మేం కాంట్రాక్టర్లం

ABN , First Publish Date - 2021-10-08T07:08:10+05:30 IST

జిల్లాలో కాంట్రాక్టర్లు వినూత్న పద్ధతిలో రోడ్డెక్కారు. రెండున్నరేళ్లుగా బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని, చావే గతి అంటూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

మేం కాంట్రాక్టర్లం

  • బిల్లులు చెల్లించండి.. ప్రాణాలు కాపాడండి
  • నాడు పోషకులం.. నేడు యాచకులం
  • కాకినాడలో ప్రభుత్వ కార్యాలయాల్లో రేపుతున్న కాంట్రాక్టర్ల  ఫ్లెక్సీలు
  • కలెక్టరేట్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్డీవో, దేవదాయ, పీఆర్‌ వరకు అన్ని శాఖల వద్ద ప్రత్యక్షం
  • అధికారులను ఉద్దేశించి బిల్లులు ఇచ్చి  ఆదుకోవాలంటూ వేడుకోలు
  • ప్రధాన రహదారులపైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కాంట్రాక్టర్లు వినూత్న పద్ధతిలో రోడ్డెక్కారు. రెండున్నరేళ్లుగా బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని, చావే గతి అంటూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడిది పెద్దఎత్తున కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం, కోర్టు మెట్లెక్కడం తదితర రూపాల్లో నిరసనలు వ్యక్తంచేయగా, ఇప్పుడు సరికొత్తగా ప్రభుత్వ కార్యాలయాల ముందు ఫ్లెక్సీలు వేయడం చర్చనీయాంశంగా మారింది. కాకినాడ కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయం, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, దేవదాయశాఖ, జడ్పీ, ఇంజనీరింగ్‌ విభాగాలు.. ఇలా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన గేట్ల ఎదుట వీటిని ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడీ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. కలెక్టరేట్‌లో అయితే ప్రధాన ద్వారానికి ఈ ఫ్లెక్సీలు అతికించి తమ నిరసన వ్యక్తం చేశారు. ‘‘మేం కాంట్రాక్టర్లం.. మా బిల్లులు చెల్లించండి.. మా ప్రాణాలు కాపాడండి, నాడు పోషకులుం.. నేడు యాచకులం... ఆస్తులు కరిగాయి...అప్పులు పెరిగాయి’’ అంటూ ఫ్లెక్సీల్లో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడీ తరహా ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇలా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసి తమ నిరసన తెలిపారని పలువురు కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. వాస్తవానికి జిల్లాకు చెందిన అనేకమంది కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపొనెంట్‌ విభాగం కింద అనేక రహదారులు, నీటి సరఫరా విభాగానికి సంబంధించిన పనులు చేశారు. ఇవికాక రహదారులు, భవనాలు, వాటర్‌ ట్యాంకులు నిర్మించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్లులన్నీ చెల్లించకుండా నిలిపివేసింది. దీంతో పలువురు కాంట్రాక్టర్లు కొన్ని నెలల కిందట హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్టర్లందరికీ బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో తాము ప్రతి జిల్లాకు బకాయిల కింద డబ్బులు ఆయా ప్రభుత్వశాఖలకు జమ చేశామని ప్రభుత్వం కోర్టుకు జవాబు ఇచ్చింది. తీరా కాంట్రాక్టర్లు జిల్లాలో ఆయా ప్రభుత్వశాఖల వద్దకు బిల్లుల బకాయిల కోసం వెళ్తే నిధులు లేవని, రాలేదని చెబుతున్నారు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా రూ.125 కోట్ల వరకు పలు విభాగాల కింద కాంట్రాక్టర్లకు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంట్రాక్టర్లు ఫ్లెక్సీల బాట పట్టారు. కాకినాడలో పలు ప్రధాన రహదారులపైనా ఇవి ఏర్పాటు చేశారు. అలాగే కాంట్రాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కాంట్రాక్టర్ల ఆవేదన పేరుతో శుక్రవారం విజయవాడలో ఆందోళన చేపడుతున్నామని, బాధిత కాంట్రాక్టర్లంతా హాజరు కావాలంటూ ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులపై మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం విశేషం.

Updated Date - 2021-10-08T07:08:10+05:30 IST