నిబంధనలకు విరుద్ధం!

ABN , First Publish Date - 2021-03-02T08:36:46+05:30 IST

ఎన్నికల నియమావళికి విరుద్ధమనే చంద్రబాబు ధర్నాకు అనుమతించలేదని చిత్తూరు, తిరుపతి అర్బన్‌ ఎస్పీలు సెంథిల్‌ కుమార్‌, వెంకట అప్పలనాయుడు

నిబంధనలకు విరుద్ధం!

అందుకే అనుమతించలేదు

పరిస్థితిని వివరించాం

అర్థం చేసుకుని వెనుతిరిగారు

ఎస్పీల ప్రకటన


చిత్తూరు/తిరుపతి(నేరవిభాగం): ఎన్నికల నియమావళికి విరుద్ధమనే చంద్రబాబు ధర్నాకు అనుమతించలేదని చిత్తూరు, తిరుపతి అర్బన్‌ ఎస్పీలు సెంథిల్‌ కుమార్‌, వెంకట అప్పలనాయుడు తెలిపారు. ‘‘ఐదు వేలమందితో నిర్వహించే ధర్నాకు చంద్రబాబు హాజరవుతారని టీడీపీ నేతలు చెప్పారు. ఇది కొవిడ్‌ నిబంధనలను ఉల్లఘించడమే అవుతుంది. చిత్తూరులోని గాంధీ సర్కిల్‌ జాతీయ, రాష్ట్ర రహదారులను కలుపుతూ పోతుంది. అక్కడ కాకుండా వేరే చోటు ఎంచుకోవాలని టీడీపీ నేతలకు చెప్పాం. కానీ, గాంధీ విగ్రహం వద్దనే ధర్నా చేస్తామని చెప్పారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇబ్బందులొస్తాయనే కారణంతో అనుమతి ఇవ్వలేదు’’ అని సెంథిల్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ధర్నా చేయాలంటే ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు.  ఇక...  తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు కూడా మీడియాతో మాట్లాడారు.


‘‘తిరుపతి ఈస్ట్‌ పోలీసు స్టేషన్‌ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహంవద్ద నిరసన కార్యక్రమానికి అనుమతి కావాలంటూ టీడీపీ నాయకుడు నరసింహయాదవ్‌ దరఖాస్తు అందించారు. ఈ ప్రాంతం బస్టాండు, రైల్వేస్టేషన్‌కు మధ్యలో బాగా రద్దీ ప్రాంతంలో ఉంది. అత్యవసర సేవలకు, భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మొదలైనందున... డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కూడా అమలులో ఉంది. నిరసన విరమించుకోవాలని చంద్రబాబుకు ఆదివారం రాత్రి ఫ్యాక్స్‌లో నోటీసు పంపించాం’’ అని వివరించారు. మరోవైపు... చంద్రబాబుకు తగిన భద్రత ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన సమయం కూడా అందుబాటులో లేదని అప్పల నాయుడు తెలిపారు. ‘‘అన్ని విషయాలను చంద్రబాబుకు వివరించాం. తిరుపతి గాంధీ విగ్రహంవద్ద షాపు తొలగింపుతోపాటు పలు అంశాలపై చంద్రబాబు మాతో చర్చించారు. ఆయన మా దృష్టికి  తీసుకొచ్చిన అన్ని అంశాలపై సమాచారం సేకరిస్తామని తెలిపాం. అధికారులు తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసు కూడా పెడతామని చెప్పాం. ఆయన సానుకూలంగా అర్థం చేసుకుని తిరుపతి నుంచి వెనుదిరిగారు’’అని అప్పలనాయుడు వివరించారు.

Updated Date - 2021-03-02T08:36:46+05:30 IST