తోడుకో.. అమ్ముకో!

ABN , First Publish Date - 2021-01-21T06:12:07+05:30 IST

పరిశ్రమల కోసం నీటి తరలింపు దందా జిన్నారం మండలంలో రోజురోజుకూ విస్తరిస్తున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జల మట్టం కొద్దిగా పెరగడంతో ఈ వ్యాపారం మరింత ఎక్కువైంది.

తోడుకో.. అమ్ముకో!
కొర్లకుంట శివారులో నీటి తరలింపు కోసం ఏర్పాటు చేసిన సంప్‌

జిన్నారంలో జోరందుకున్న నీటి అక్రమ దందా

 రోజూ వేయి ట్యాంకర్లు, ట్రాక్టర్లలో సరఫరా

 కలిసి వస్తున్న పరిశ్రమల అవసరం

 ఉచిత విద్యుత్‌తో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు

 లక్షల్లో వ్యాపారం జరుగుతున్నా పట్టని అధికారులు

 మరోవైపు నీళ్లు లేక గోసపడుతున్న స్థానికులు


 జిన్నారం, జనవరి 20: పరిశ్రమల కోసం నీటి తరలింపు దందా జిన్నారం మండలంలో రోజురోజుకూ విస్తరిస్తున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జల మట్టం కొద్దిగా పెరగడంతో ఈ వ్యాపారం మరింత ఎక్కువైంది. ట్యాంకర్‌ నీటికి రూ.1500 పలకడంతో ఈ దందా పట్ల వ్యాపారులు మొగ్గు చూపుతున్నారు. మండలంలోని కాజీపల్లి, బొల్లారం, గడ్డపోతారం, వావిలాల పరిధిలో వ్యాపారులు విచ్చలవిడిగా బోర్లు వేసి రోజుకు వెయ్యి ట్యాంకర్ల నీటిని పరిశ్రమలకు తరలిస్తున్నారు. లక్షల్లో వ్యాపారం జరుగుతున్నది. అయినా సంబంధిత శాఖల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.


ఉచిత విద్యుత్‌తో ఆర్వో ప్లాంట్లు


నీటి దందాలో భాగంగా కొందరు ఆర్వో నీటినీ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. 20వేల లీటర్లకు రూ.6వేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. కొన్ని పరిశ్రమలతో పాటు నగర శివారులోని గృహాలు, అపార్ట్‌మెంట్లకూ ఈ నీటిని చేరవేస్తున్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. గ్రామాల్లో, వ్యవసాయ క్షేత్రాల వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్లకు అనుమతులు లేకపోవడమే కాకుండా వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. 


 ఫార్మా పరిశ్రమల నుంచి డిమాండ్‌


ఫ్లోరైడ్‌, కాలుష్య ప్రభావం లేని నీటి అవసరమున్న ఫార్మా పరిశ్రమలు ముఖ్యంగా వీరిపై ఆధారపడుతున్నారు.  పారిశ్రామిక గ్రామాలైన బొల్లారం, కాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి, అన్నారం, దోమడుగు గ్రామాల్లో నీటి సరఫరా చేసేందుకు సుమారు 600కు పైగా ట్రాక్టర్లు, ట్యాంకర్లు పని చేస్తున్నాయి. ఐదు వేల లీటర్ల సామర్థ్యమున్న ట్రాక్టర్‌కు రూ.600 చొప్పున, ఇరవై వేల లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకర్‌కు రూ.1500 వరకు పరిశ్రమలు చెల్లిస్తున్నాయి.  



 స్థానికులకు తప్పని తిప్పలు


స్థానికంగా ఎడాపెడా జరుగుతున్న నీటి దందా వ్యాపారులకు, వారితో మమేకమైన నాయకులకు లక్షలు తెచ్చిపెడుతుండగా, స్థానిక ప్రజలను మాత్రం ఇక్కట్లకు గురి చేస్తున్నది. ఇక్కడి భూగర్భజలాలు అడుగంటిపోవడంతో అందరూ రోజువారీ అవసరాలకు నీటిని కొనుగోలు  చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. బొల్లారం మున్సిపాలిటీలోని ప్రతీ కాలనీలో వేధిస్తున్న నీటి సమస్య దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. వ్యాపారం సంగతలా ఉంచితే, నీటి రవాణాకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్యాంకర్లలో చాలా వాటికి రవాణా శాఖ అనుమతులు లేవు. వాటిని నడిపే డ్రైవర్లకు లైసెన్సులు కూడా లేవు. నీటి వ్యాపారుల మధ్య ఘర్షణలు, కేసులు కూడా కోకొల్లలు. అధికారుల అండదండలు ఉండడం వల్లే వీరి దందాకు ఎక్కడా బ్రేకులు పడడం లేదు. 


నీటి అవసరంపై ఏర్పాట్లు చేయని ఫలితం


జిన్నారం ప్రాంతంలో మూడున్నర దశాబ్దాల క్రితం పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అప్పటి నుంచి వీటికి అవసరమైన నీటిని సరఫరా చేయుడడంపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఏ పరిశ్రమకు ఎంత నీరు కావాలనేదానిపైనా లెక్కలు లేవు. ఇదే నీటి వ్యాపారులకు కలిసి వచ్చింది. ఇష్టారీతిన బోర్లు వేసి తోడేసే స్థాయికి తెచ్చింది. ఫలితంగా ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి తీవ్ర నీటి కొరత ఏర్పడుతున్నది. వేసవిలో సమస్య మరింత తీవ్రమవుతున్నది. 


Updated Date - 2021-01-21T06:12:07+05:30 IST