ప్రశాంత ఎన్నికలకు సహకరించండి

ABN , First Publish Date - 2021-02-25T04:52:26+05:30 IST

ప్రశాంత వాతావరణంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపునకు ప్రతిఒక్కరూ సహకరిం చాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ కోరారు.

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
పార్వతీపురంటౌన్‌: అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌

పార్వతీపురంటౌన్‌, ఫిబ్రవరి 24 :  ప్రశాంత వాతావరణంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ,   ఓట్ల లెక్కింపునకు ప్రతిఒక్కరూ సహకరిం చాలని  కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ కోరారు.  బుధవారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో  స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా   ముని సిపల్‌ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌,  జోనల్‌, రూట్‌ అఽధికారులతో మాట్లాడారు. పంచాయతీ  ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిం చామని, మున్సిపల్‌ ఎన్నికలను అంతకంటే బాగా జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్‌ కేంద్రాలతో పాటు ఓట్ల లెక్కింపు అనేది సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగాలని ఆదేశించారు. ఏ పార్టీ నాయకులకైనా  విమర్శించే అవకాశం ఇవ్వరాదన్నారు. ఎన్నికల సిబ్బంది సౌకర్యాలపై సంబంధిత అధికా రుల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  పోలింగ్‌  నుంచి ఓట్ల లెక్కింపు వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. రీ కౌటింగ్‌కు అవకాశం ఇవ్వ కుండా   ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఓటర్లు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.  ఎన్నికల నిర్వహణ అధికారులు జి.శ్రీరామ్మూర్తి, కె.కనకమహాలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు. 

కౌంటింగ్‌, స్ర్టాంగ్‌ రూంలు పరిశీలన 

బొబ్బిలి (రామభద్రపురం):   మునిసిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని  కలెక్టర్‌  హరిజవహర్‌లాల్‌ సూచించారు.  బొబ్బిలి మునిసి పల్‌ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా  ఎన్నికలు జరిపేం దుకు సిబ్బంది కృషి చేయాలన్నారు.  కౌంటింగ్‌, స్ర్టాంగ్‌ రూంలను పరిశీలించి  అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. జేసీ జె.వెంకటరావు, డీఎస్పీ మోహనరావు, మునిసిపల్‌ కమిషనర్‌ ఎంఎం. నాయుడు, తహసీల్దార్‌ పాత్రో తదితరులు ఉన్నారు. 

ఇబ్బందులు లేకుండా చూడాలి

సాలూరు: మునిసిపల్‌ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని  కలెక్టర్‌  హరి జవహర్‌లాల్‌ ఆదేశించారు. స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. స్ర్టాంగ్‌ రూంల ఏర్పాటు, రిసప్షన్‌ కౌంటర్లతో పాటు ప్రతి అంశాన్ని  అధికారులతో చర్చించారు. ఎన్నిక ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. మునిసిపల్‌ కమిషనర్‌ రమణమూర్తి, సీఐ అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. 

 పారిశుధ్యం, పచ్చదనం మెరుగుకు క్లాప్‌ ప్రోగ్రామ్‌ 

కలెక్టరేట్‌:   పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం కొత్తగా క్లాప్‌ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టిందని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ చెప్పారు.  క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా వంద రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.  బుధవారం సాయంత్రం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.   ప్రతి ఇంటి నుంచి సమర్థంగా చెత్త సేకరణ , ఆ చెత్తను వేరు చేయడం, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాల ద్వారా పరిశుభ్రత , ఆరోగ్యకరమైన పట్టణా లను రూపొందించడం లక్ష్యంగా పనిచేయాలన్నారు.  ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకు నోడల్‌ అధికారిగా చీఫ్‌ ఇంజినీర్‌ గోకర్ణ శాస్త్రిని నియమించినట్లు తెలిపారు. అనంతరం టిడ్కో ఇళ్లపై సమీక్షించారు. విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలో టిడ్కో లబ్ధిదారులు నుంచి రావల్సిన వాటా సుమారు రూ.57 కోట్లు, నెల్లిమర్ల  నుంచి రూ.10 కోట్లు, సాలూరు  నుంచి రూ.3 కోట్లు, బొబ్బిలి   నుంచి రూ.12 కోట్లు వసూలు చేయాల్సి ఉంద న్నారు.   అనంతరం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు.


 

Updated Date - 2021-02-25T04:52:26+05:30 IST