చేనేత, జౌళి రంగానికి సహకరించండి

ABN , First Publish Date - 2022-01-22T07:28:25+05:30 IST

రాష్ట్రంలో చేనేత, జౌళి రంగం అభివృద్ధి కోసం

చేనేత, జౌళి రంగానికి సహకరించండి

  • కేంద్ర మంత్రులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ
  •    బండి సంజయ్‌ మొద్దు నిద్ర వీడాలి


హైదరాబాద్‌/సిరిసిల్ల, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేనేత, జౌళి రంగం అభివృద్ధి కోసం చేపట్టిన పనులకు సహకారం అందించాలని కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్‌, పీయూష్‌ గోయెల్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం లేఖ రాశారు. వరంగల్‌లో 1200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను తమ ప్రభుత్వం అభివృద్థి చేస్తోందని, ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.897.92 కోట్లతో ప్రాజెక్టుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. సిరిసిల్లలో మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ను మంజూరు చేయాలని కోరారు.


తెలంగాణలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ సంస్థను స్థాపించాలని కోరారు. ఐఎన్‌ఎస్టీయూ పథకం కింద పవర్‌లూమ్‌ల అప్‌గ్రేడేషన్‌ ఖర్చులో 59శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం మిగిలిన మొత్తం భరించాలన్నారు. జాతీయ చేనేత అభివృద్థి కార్యక్రమంలో భాగంగా 11 బ్లాక్‌ లెవల్‌ హ్యాండ్లూమ్‌ క్లస్టర్ల మంజూరు కోసం రూ.14.80 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో కేంద్రానికి ప్రతిపాదించామని తెలిపారు. రూ.60.2 కోట్ల అంచనాతో మరో నాలుగు బీఎల్‌హెచ్‌సీల మంజూరు కేంద్ర సర్కారు వద్ద ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. మొత్తం బీఎల్‌సీలకు రూ.7.20 కోట్లను కేంద్రం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.


అదేవిధంగా హైదరాబాద్‌లో నేషనల్‌ టెక్స్‌టైల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మొద్దు నిద్ర వీడి చేనేత రంగ సమస్యలపై స్పందించాలని ఆయన వ్యాఖానించారు. శుక్రవారం సిరిసిల్లలో విలేకరులతో మాట్లాడుతూ లక్షలాది మంది నేత కార్మికుల పక్షాన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపిస్తున్న లేఖలలో వివరాలను వెల్లడించారు. ప్రతి బడ్జెట్‌ సమావేశాలకు ముందు నేత కార్మికుల సమస్యలపై విజ్ఞప్తులు చేస్తూ వచ్చామన్నారు. ఇంతవరకు ఒక్కటీ  పట్టించుకోలేదని అన్నారు.  


కేసీఆర్‌ వల్లే పెరిగిన అటవీ విస్తీర్ణం 

సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం వల్లే అటవీ విస్తీర్ణం పెరిగిందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్‌కు దేశంలోనే మొదటి స్థానం దక్కిందని ప్రపంచ పర్యావరణవేత్త ఏరిక్‌ సోలిహిమ్‌ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. 2011-2021 మధ్య కాలంలో 4,856 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగిందని ఆయన ప్రశంసించారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ ఈ క్రెడిట్‌ అంతా సీఎం కేసీఆర్‌దేనని, హరితహారం కోసం గ్రామాలు, మునిసిపాలిటీలకు గ్రీన్‌ బడ్జెట్‌ కింద నిధులు కేటాయించామని పేర్కొన్నారు. అలాగే పట్టణ ప్రజలు తమ సమీపంలోని అర్బన్‌ పార్కుల సమాచారం తెలుసుకునేందుకు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ పేరుతో యాప్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. 


Updated Date - 2022-01-22T07:28:25+05:30 IST