అప్రమత్తతతోనే నియంత్రణ

ABN , First Publish Date - 2020-04-09T11:29:53+05:30 IST

కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింత ఆందోళనకు

అప్రమత్తతతోనే నియంత్రణ

25 మందికి కరోనా నెగెటివ్‌ 

మరో ముగ్గురు రిపోర్టుల కోసం ఎదురుచూపులు.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. మరో వారం, పదిరోజులపాటు అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరూ స్వీయ నిర్భంధం, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.


జిల్లాకు వచ్చిన 10 మంది ఇండోనేషియన్లు, వారికి సహాయకుడిగా ఉన్న ఒక స్థానికుడు, ఆయన తల్లి, సోదరితోపాటు మరొకరు కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 10 మంది ఇండోనేషియన్లతోపాటు వారికి సన్నిహితంగా ఉన్న స్థానికుడికి చికిత్స అనంతరం కరోనా నెగెటివ్‌ రావడంతో ఆస్పతి వర్గాలు వారిని డిశ్చార్జ్‌ చేసి హోం క్వారంటైన్‌లో ఉంచారు. మిగిలిన ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మర్కజ్‌ మతప్రార్థనలకు జిల్లా నుంచి 19 మంది వెళ్లగా హుజూరాబాద్‌కు  చెందిన ఇద్దరికి, కరీంనగర్‌కు చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.


మిగతా 16 మందికి  నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈ 19 మంది నేరుగా కలిసిన, సన్నిహితంగా ఉన్న 27 మంది శాంపిల్స్‌ను సేకరించి వైద్య పరీక్షలకు పంపించగా వారిలో ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. తర్వాత మరో 28 మంది అనుమానితులను హ్పాసిటల్‌ క్వారంటైన్‌కు తరలించి నమూనాలు పరీక్షల కోసం పంపించగా బుధవారం వీరిలో 25 మందికి కరోనా నెగెటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరో ముగ్గురి రిపోర్టులు రావలసి ఉంది.  బుధవారం హుజూరాబాద్‌తోపాటు కరీంనగర్‌లోని హుస్సేనిపురాలో కూడా స్ర్కీనింగ్‌  నిర్వహించారు.  కరీంనగర్‌ ముకరంపుర, కాశ్మీరుగడ్డలో రెడ్‌జోన్‌  కొనసాగుతున్నది. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా కొనసాగిస్తుండడంతో ప్రజలు ఎవరూ కూడా ఇళ్ళకే పరిమితమవుతున్నారు. 


రేషన్‌ దుకాణాలు... బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న జనం : 

తెల్ల రేషన్‌కార్డులున్న వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో బియ్యం కోసం ప్రజలు రేషన్‌ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. నెలాఖరు వరకు బియ్యం పంపిణీ చేస్తామని, ప్రతి ఒక్కరికి బియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయినా పెద్ద ఎత్తున దుకాణాల వద్దకు తరలి వస్తుండడంతో సామాజిక దూరం పాటించేందుకు డీలర్లు బాక్సులో ఉండాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జీరో బ్యాలెన్సుతో జనధన్‌ ఖాతాలను తెరచిన మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు ఐదు వందల రూపాయలు వారి ఖాతాల్లో , రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశాయి. దీంతో ప్రజలు వాటిని తీసుకునేందుకు బ్యాంకుల ఎదుట బారులు తీరుతున్నారు. 


డ్రోన్‌ కెమెరాతో నిఘా

లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు కమాండ్‌ కంట్రోల్‌ వాహనంతోపాటు డ్రోన్‌ కెమెరాతో నిఘాపెట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించి ఎక్కడికక్కడ కట్టడి చేస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. 14వ తేదీతో లాక్‌డౌన్‌ ముగిస్తుందా లేదా పొడగిస్తారా అనే అంశంపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. 


హాస్పిటల్‌ క్వారంటైన్‌లో ఉన్న 68 మంది డిస్చార్జి

సుభాష్‌నగర్‌: హాస్పిటల్‌ క్వారంటైన్‌లో ఉన్న 68 మందిని బుధవారం డిస్చార్జి చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు.  వారికి కరోనా పరీక్షలే నిర్వహించామని, అందరికీ నెగెటివ్‌ వచ్చిందన్నారు. వీరిని మరో 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు తెలిపారు.


కొనసాగుతున్న స్ర్కీనింగ్‌ పరీక్షలు

సుభాష్‌నగర్‌/హుజూరాబాద్‌: హుజూరాబాద్‌లో కరోనా బాధితులు ఉన్న ప్రాంతాల్లో బుధవారం 35టీంలు, కరీంనగర్‌లో  29 టీంలు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించాయి. బుధవారం ఉస్మాన్‌పురలో1,672 ఇళ్లకు వెళ్లి 8,239 మందికి, హుజూరాబాద్‌లో 2,480 ఇళ్లకు వెళ్లి 8,060 మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత తెలిపారు. 9న ముకరంపురలో 19వైద్యబృందాలు ఇంటింటి ఫీవర్‌ సర్వే నిర్వహిస్తాయని, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. 


టెలిమెడిసిన్‌ద్వారా 17 మందికి సలహాలు..

టెలీమెడిసిన్‌ ప్రారంభించిన రోజునే ద్వారా 17మంది వైద్యసలహాలు పొందారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే  ప్రజలకు భరోసా చేయూత కేంద్రం (మానసిక) ద్వారా పది మంది వైద్య సలహాలు పొందారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-09T11:29:53+05:30 IST