కంట్రోల్‌ కరోనా

ABN , First Publish Date - 2020-04-09T11:21:26+05:30 IST

కరోనా వైరస్‌కు మందు లేదు. ముందు చూపే శ్రీరామ రక్ష అంటూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, జిల్లా అధికారులు ఎంత చెప్పినా జనం వినిపించుకోవడం లేదు

కంట్రోల్‌ కరోనా

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌కు మందు లేదు. ముందు చూపే శ్రీరామ రక్ష అంటూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, జిల్లా అధికారులు ఎంత చెప్పినా జనం వినిపించుకోవడం లేదు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దంటూ హెచ్చరించినా ఫలితం కనిపించడం లేదు. చిన్నపాటి సమస్యల సాకుతో జనం బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ, సామాజిక దూరమే ప్రధానమని భావించిన అధికారులు పలు ప్రధాన కూడళ్లను పూర్తిగా మూసివేశారు. అలాగే అక్కడక్కడ భారీకెడ్లను ఏర్పాటు చేశారు. అయినా అడ్డదారిలో బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తమకేమి కాదనే భావన ఎక్కువ మంది ప్రజల్లో వ్యక్తమవుతోంది.


ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 11కు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని 467 గ్రామాల్లో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పట్టణ ప్రాంతంలోనే పరిస్థితులు కొంత ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. గత 4 రోజుల క్రితమే పట్టణంలో 6 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మంగళవారం మరోకేసు నమోదయ్యింది. దీంతో అర్బన్‌ ప్రాంతంలో కేసుల సంఖ్య 7కు చేరింది. ఢిల్లీ మర్కజ్‌ యాత్రికుల కేసులపై కొంత ఉత్కంఠ వీడినా వారి కాంటాక్ట్‌ పైననే ఆందోళన కనిపిస్తోంది. వారితో ఎవరెవరికి వైరస్‌ వ్యాప్తి చెంది ఉంటుందని ఇంటింటి సర్వేను చేపడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్‌, నేరడిగొండ మండలాల్లో 3 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించి కరోనా ఎఫెక్ట్‌ ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధం చేశారు. పరిస్థితిని మరింత అదుపులో ఉంచాలంటే మరిన్ని కఠినమైన నిర్ణయాలను అమలు చేయకతప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఏప్రిల్‌ 14 వరకు కీలక సమయం..

ఇప్పటికే విదేశాలు, ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని గుర్తించిన అధికారులు వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షించగా 10 పాజిటివ్‌ కేసులను గుర్తించారు. మిగితా 1 ప్రైమరీ కాంటాక్ట్‌గా తేలింది. అయితే మిగిలిన ఈ 6 రోజుల్లోనే స్థానికంగా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్‌ 14 లాక్‌డౌన్‌ గడువు ముగిసేంత వరకు స్వీయ నియంత్రణతో సహకరిస్తునే కరోనా కట్టడి సాధ్యపడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి కొంత అదుపులోనే ఉన్నా మరింత విస్తరిం చకుండా ఉండాలంటే ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడగించినా ప్రజలు సహకరించాల్సి ఉంటుంది. 


విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు..

కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అధికారులు తీసుకుంటున్న కట్టడి చర్యలను పరిశీలించేందుకు అధికార, ప్రతిపక్ష నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ కరోనా కట్టడికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ముఖ్యంగా మున్సిపల్‌ పరిధిలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నందున ఉదయం నుంచి రాత్రి వరకు మున్సిపల్‌ చైర్మన్‌ అధికారులతో కలిసి కట్టడి చర్యలు చేపడుతున్నారు. బుధవారం పలు కాలనీల్లో పర్యటించిన ఎంపీ రెండు చేతులెత్తి దండం పెడుతూ బయటకు రావద్దని ప్రజలను కోరారు. అలాగే కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ల పరిధిలో తీసుకుంటున్న జాగ్ర త్తలను ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించారు. మరిన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారం చూపుతున్నారు. మొత్తానికి తమవంతుగా కరోనా కట్టడికి నేతలందరు సహకారం అందిస్తున్నారు.


ఇంటింటికీ సరుకుల పంపిణీ..

జిల్లా వ్యాప్తంగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమై పాక్షికంగా పూర్తి స్థాయిలో 19 వార్డులను గుర్తించారు. అలాగే ఉట్నూర్‌ మండలంలోని హస్నాపూర్‌ గ్రామ పరిధిలో పలు గ్రామాలు, నేరడిగొండ మండల కేంద్రం చుట్టు పక్కల మరిన్ని గ్రామాలను గుర్తించి మూడు కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఈ క్లస్టర్ల పరిధిలో మొత్తం 19వేల 541 గృహాలు, 72వేల 666 మంది ప్రజలు నివసిస్తున్నట్లు గుర్తించారు. వీరికి అవసరమైన నిత్యావసర సరుకులు బియ్యం, కూరగాయలు, ఇతర అవసరాలను తీర్చేవిధంగా 148 ప్రత్యేకాధికార బృందాలను ఏర్పాటు చేశారు. వీరి సహకారంతో ఇంటింటికి సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంక్షలు విధించిన ప్రాంతాల నుంచి ఎవరు బయటకు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Updated Date - 2020-04-09T11:21:26+05:30 IST