పాక్ అణ్వాయుధ శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ మృతి

ABN , First Publish Date - 2021-10-10T22:18:33+05:30 IST

వివాదాస్పద పాకిస్థాన్ అణ్వాయుధ శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ ఖాన్ సుదీర్ఘ అస్వస్థతతో ఆదివారంనాడు..

పాక్ అణ్వాయుధ శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ మృతి

ఇస్లామాబాద్: వివాదాస్పద పాకిస్థాన్ అణ్వాయుధ శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ ఖాన్ సుదీర్ఘ అస్వస్థతతో ఆదివారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. ఖదీర్ మృతిని పాకిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఇస్లామాబాద్‌లోని ఆసుపత్రిలో ఆయన కన్నుమూసినట్టు చెప్పారు. 1970 ప్రారంభంలో పాక్ అణ్వాయుధ ఆలోచనలకు ఖదీర్ ఆద్యుడుగా నిలిచారు. 70 దశకంలో ఆయన నెథర్లాండ్స్ నుంచి పాకిస్థాన్‌కు తిరిగిరావడానికి ముందే వివాదంలో చిక్కుకున్నారు. నెథర్లాండ్స్‌లోని న్యూక్లియర్ రీసెర్చ్ ఫెసిలిటీలో ఖదీర్ పనిచేసారు. రీసెర్చ్ ఫెసిలిటీ నుంచి యురేనియం ఎన్రిచ్‌మెంట్ టెక్నాలజీని తస్కరించారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. పాకిస్థాన్ తొలి న్యూక్లియర్ వెపన్ అభివృద్ధిలో ఆ టెక్నాలజీని ఆయన ఉపయోగించారని అంటారు.


బెల్జియంలోని లియువెన్ కేథలిక్ యూనివర్శిటీలో  మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో ఆయన డాక్టరేట్ పొందారు. భారతదేశం తొలి 'పీస్‌ఫుల్ న్యూక్లియర్ ఎక్స్‌ప్లోజన్' నిర్వహించిన అనంతరం 1974లో పాక్ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రాంను ఖదీర్ ప్రారంభించారు. పాకిస్థాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం, ఖదీర్ ఖాన్ ప్రమేయం ఎంతోకాలంగా ఆరోపణలు, విమర్శలకు గురువుతూనే ఉంది. 1990లో పాక్ అణ్వస్త్ర కార్యక్రమాలపై ఆంక్షలు విధించిన వాషింగ్టన్.. ఖదీర్‌పై ఆరోపణలు సైతం చేసింది. అణురహస్యాల విషయంలో పొరుగున ఉన్న ఇరాన్, నార్త్ కొరియాతో ఖదీర్ వ్యాపారం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించింది. పాకిస్థాన్‌లో ఆయన అణు పితామహుడుగా, హీరోగా చెబుతుంటారు. ర్యాడికల్ రెలిజియస్ పార్టీలు మాత్రం ఆయన ఇస్లామిక్ న్యూక్లియర్ బ్యాంబ్ ఫాదర్ మాత్రమేనని అంటుంటాయి. 'నేషనల్ ఐకాన్‌'గా ఆయనను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుస్తుంటారు. కాగా, ఆదివారం సాయంత్రం ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో ప్రభుత్వ లాంఛనాలతో ఖదీర్‌ను ఖననం చేయనున్నారు.

Updated Date - 2021-10-10T22:18:33+05:30 IST