Abn logo
Jun 16 2021 @ 03:20AM

ఏడాదిలో ఎంత రచ్చ!

వివాదాస్పదంగా సంచయిత నిర్ణయాలు

కోట దాటిన మాన్సాస్‌ కార్యాలయం

విద్యాసంస్థల ప్రైవేటీకరణకు యత్నం

సిబ్బందికి జీతాలివ్వకుండా ఇబ్బందులు

విద్యార్థులు, సిబ్బంది ఆందోళనలూ బేఖాతరు

పదవి చేపట్టగానే సంచయిత హల్‌చల్‌


(విజయనగరం - ఆంధ్రజ్యోతి)

‘కోట’తో ఆమె ఎలాంటి అనుబంధమూ పెట్టుకోలేదు. ఏళ్ల తరబడి అటువైపే చూడలేదు. అలాంటిది, ఒక్కసారిగా  విజయనగరం వచ్చేశారు. సర్కారు అర్ధరాత్రి జీవో జారీ చేయగానే... తెల్లవారేసరికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మాన్సా్‌స (మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. సింహాచలం ఆలయ బోర్డు అధ్యక్షురాలు అయ్యారు. ఆమే... సంచయిత! హైకోర్టు ఉత్తర్వులతో ఆమె ‘మాజీ’ అయినట్లే! కానీ... ఈ ఏడాది కాలంలో ఆమె తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. మాన్సాస్‌ ట్రస్టు రూపురేఖలను ఏడాది కాలంలోనే సంచయిత మార్చేశారు. ప్రధాన కార్యాలయాన్ని జిల్లా దాటించేశారు. 1958లో పీవీజీ రాజు ఏర్పాటు చేసిన ట్రస్టు ప్రధాన కార్యాలయం విజయనగరం కోటలోనే ఏర్పాటైంది. ట్రస్టు కార్యకలాపాలు, విద్యా సంస్థల నిర్వహణ, పరిపాలనా వ్యవహారాలు, భూముల లావాదేవీలన్నీ కార్యాలయంలోనే జరిగేవి. గతేడాది మార్చిలో సంచయిత చైర్‌పర్సన్‌గా వచ్చిన తర్వాత... కార్యాలయంలోని రికార్డులు, కీలక పత్రాలు, పరిపాలనా విభాగాలన్నింటినీ విశాఖ జిల్లా పద్మనాభం మండలానికి తరలించారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతే కాకుండా పద్మనాభంలో ఉన్న మహారాజా జూనియర్‌ కళాశాలను మూసివేశారు. విజయనగరంలో దశాబ్దాలుగా సాగుతున్న మహారాజా కళాశాలను (ఎంఆర్‌ కాలేజీ) ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయించారు. 


పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఎయిడెడ్‌ కళాశాలను దూరం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులంతా దీనిపై కొన్ని నెలల పాటు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. ఎంఆర్‌ కళాశాల ప్రధాన గేటు వద్ద టెంట్‌ వేసి ధర్నాలు చేశారు. అలాగే, మహారాజా జూనియర్‌ కళాశాలను విజయనగరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విలీనం చేసి కోటలో ఇంటర్‌ విద్య లేకుండా చేశారు. కోట్లాది రూపాయల ఆస్తులు, బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నా... కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. బోధన, బోధనేతర సిబ్బంది జీతాల కోసం రోడ్లెక్కి పోరాటాలు సాగించారు. ఇక... బీఈడీ కళాశాలను కోటలోని రౌండ్‌ మహల్‌ నుంచి ఎత్తివేసి పోస్టాఫీస్‌ ఎదురుగా ఉన్న స్థలంలోకి మార్చారు. లా కళాశాలను ఎంఆర్‌ ఇంటర్‌ క్యాంప్‌సకు మార్చారు. కరోనా కాలంలో సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో సంస్థకు చెడ్డపేరు వచ్చింది. పేద విద్యార్థుల భోజన సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన చౌలీ్ట్ర నిర్వహణ గాలికి వదిలేశారు. విజయనగరం పట్టణంలోని ఎంఆర్‌ క్రీడా మైదానంపై కూడా కన్నేశారు. గ్రౌండ్‌లోకి ఎవరినీ వెళ్లనీయకుండా తాళం వేయటంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఘంటశాల ఈ ట్రస్టు చౌలీ్ట్రలో ఉండి సంగీత కళాశాలలో గాత్ర కచేరి చేసేవారట. ఇటువంటి చౌలీ్ట్ర సంచయిత హయాంలో కళ తప్పింది.


వివాదాస్పద వైఖరి...

సంచయిత నియామకం, నిర్ణయాలు మాత్రమే కాదు... పలు సందర్భాల్లో ఆమె వ్యవహార శైలి కూడా వివాదాస్పదమే! సంచయిత ‘మాన్సాస్‌’ చైర్‌పర్సన్‌ అయిన రెండు నెలల్లోనే సింహాచలం అప్పన్న చందనోత్సవం జరిగింది. ఆ రోజున స్వామి వారి తొలి దర్శనం పూసపాటి వంశీయులు చేసుకోవడం ఆనవాయితీ. కానీ... సంచయిత వారికి ఆహ్వానమే పంపకుండా అధికారులను కట్టడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ... స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆనంద గజపతిరాజు భార్య సుధా గజపతి, కుమార్తె ఊర్మిళను అధికారులు ముందే ఆపివేశారు. ‘పరిస్థితి అర్థం చేసుకోండి. సంచయిత తొలి దర్శనం చేసుకునే దాకా మీరు పక్కన ఉండండి. ఆ తర్వాత మిమ్మల్ని పిలుస్తాం’ అని చెప్పారు. దీంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత విజయనగరంలో జరిగిన పైడితల్లి సిరిమాను ఉత్సవం రోజు కూడా వారికి ఇలాంటి అవమానమే జరిగింది. వేడుక రోజున పూసపాటి వంశీయులు అమ్మవారిని కోటపై నుంచి దర్శించుకోవడం ఆనవాయితీ. గత ఏడాది సుధా గజపతి, కుమార్తె ఊర్మిళా గజపతి... ముందు వరుసలో కూర్చున్నారు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన సంచయిత, అధికారులతో చెప్పి వారి స్థానాలను ఖాళీ చేయించారు. మరెక్కడా కూర్చోడానికి లేకుండా కుర్చీలు కూడా లేకుండా చేశారు. సింహాచలం బోర్డు చైర్‌పర్సన్‌గా ఆమె హయాంలో ముగ్గురు ఈవోలు మారడం గమనార్హం. ఇక... బోర్డు సమావేశాలు మూడు నాలుగు జరిగినప్పటికీ, అన్నీ ఆమె ఏకపక్షంగా నిర్ణయించేవారని ఆరోపణలున్నాయి.