జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే జోన్ల మార్పిడి

ABN , First Publish Date - 2021-06-24T06:56:52+05:30 IST

నాలుగు సంవత్సరాలుగా జరిగిన జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కొత్తగా జోన్ల మార్పిడి విషయాన్ని తెరపైకి తెచ్చారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు.

జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే జోన్ల మార్పిడి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల టౌన్‌, జూన్‌ 23: నాలుగు సంవత్సరాలుగా జరిగిన జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కొత్తగా జోన్ల మార్పిడి విషయాన్ని తెరపైకి తెచ్చారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.  కవిత ఎంపీగా ఉన్న సమయంలో అభివృద్ధి ఆమె సూచనల మేరకే జరిగిందని, యావర్‌ రోడ్‌ వెడల్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే అధికారిక ఉత్తర్వులు ఇచ్చివుంటే కవితకు పేరు దక్కేదన్నారు. జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతుందని భావించి 2017లో యావర్‌ రోడ్డు విస్తరణ చేపట్టాలని అప్పటి పాలకవర్గం తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తే పట్టించుకోలేదన్నారు. స్వయంగా అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవితలు యావర్‌ రోడ్‌ విషయంలో జగిత్యాలలో రివ్యూ మీటింగ్‌ కూడా నిర్వహించారని, వెడల్పు ఆవశ్యకతపై ప్రభుత్వానికి నివేదికలు సైతం పంపారన్నారు. దీంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు జగిత్యాలలో సర్వే నిర్వహించి ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకున్నారన్నారు. అయినప్పటికీ పాలక వర్గం పదవీ కాలం ముగిసిన మాస్టార్‌ ప్లాన్‌ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాలుగు సంవత్సరాలుగా జరిగిన జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కొత్తగా జోన్ల మార్పిడి విషయాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. జగిత్యాల పట్టణ విస్తీర్ణం రోజురోజుకు పెరుగడంతో రెసిడెన్షియల్‌ ప్రాంతం కమర్షియల్‌ జోన్‌గా, అగ్రికల్చర్‌ జోన్‌గా ఉన్న ప్రాంతం రెసిడెన్షియల్‌ ప్రాంతంగా మారిందన్నారు. కాలానుగుణంగా జోన్ల మార్పిడి చేయాల్సిన భాధ్యత పాలకవర్గంపై ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న యావర్‌ రోడ్డును 100 ఫీట్ల విస్తరణలో భాగంగా ఉన్న గృహసముదాయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను ఎలా విస్తరించారో అలాగే ప్రైవేట్‌ గృహాలను కుడా విస్తరించి యావర్‌ రోడ్డు వెడల్పు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యావర్‌ రోడ్డు వెడల్పును కాంగ్రెస్‌ పార్టీ 100 శాతం స్వాగతిస్తోందని వెల్లడించారు. రాయికల్‌ మండలంలోని బోర్నపెల్లి వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎంతో కృషి చేశానని కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు తమరే గొప్పలు చెబుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, సౌకర్యార్థం కోసం ఎప్పుడూ కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని వివరించారు. సమావేశంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, మాజీ మున్సిపల్‌ అధ్యక్షురాలు విజయ లక్ష్మి దేవేందర్‌ రెడ్డి, నాయకులు గాజుల రాజేందర్‌, కల్లెపల్లి దుర్గయ్య, గుంటి జగదీశ్వర్‌, గాజెంగి నందయ్య, మామిడి మహిపాల్‌, నేహాల్‌, నక్క జీవన్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-06-24T06:56:52+05:30 IST