మట్టిపాలేనా..?

ABN , First Publish Date - 2020-04-08T10:46:41+05:30 IST

లాక్‌డౌన్‌ రైతుల పాలిట శాపంగా మారింది. వ్యవసాయ పనులు చేసుకునేందుకు మధ్యాహ్నం ఒంటి గంట

మట్టిపాలేనా..?

కోతకు వచ్చిన పంటలు

ఇళ్లకే పరిమితమైన కూలీలు

బయటకు రానివ్వని వలంటీర్లు, పోలీసులు

అమలు కాని ప్రభుత్వ సడలింపు

కంటతడి పెడుతున్న రైతులు


ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఈ రైతుపేరు కృష్ణ. రెండు ఎకరాల పొలం ఉంది. మిరప సాగు చేశాడు. 200 మంది కూలీలతో మొదటి కోత కోసి అమ్ముకున్నాడు. రెండో కోత సమయంలో లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. దీంతో కూలీలు దొరక్క పంటను పొలంలోనే వదిలేశాడు. కూలీలు దొరికి ఉంటే సుమారు 14 క్వింటాళ్ల దిగుబడిని అమ్ముకునేవాడు. ఎమ్మిగనూరు నుంచి కూలీలను తీసుకువెళదామంటే ఆటోలను పోలీసులు, మున్సిపల్‌ అధికారులు అడ్డుకుంటున్నారు. రోడ్డు ఎక్కితే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు భయపడి బయటకు రావడం లేదు. కూలీలను తరలించేందుకు ఒప్పుకోవడం లేదు. కూలీలు కూడా పనులకు వెళ్లేందుకు ఽభయపడుతున్నారు. పొలంటో మిరప కాయలు రాలిపోతున్నాయి. ఖరీఫ్‌లో పంటలు సాగు చేసిన జిల్లాలోని రైతులందరి పరిస్థితి ఇలానే ఉంది. అధికారులు కూలీలను తరలించేందుకు వాహానాలకు అనుమతి ఇచ్చి ఆదుకోవాలని రైతులు విన్నవిస్తున్నారు. 


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, ఏప్రిల్‌ 7: లాక్‌డౌన్‌ రైతుల పాలిట శాపంగా మారింది. వ్యవసాయ పనులు చేసుకునేందుకు మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రభుత్వం అనుమతించినా.. క్షేత్రస్థాయిలో వలంటీర్లు, పోలీసులు సహకరించడం లేదు. దీంతో చేతికొచ్చిన మిర్చిపంట నేలపాలవుతోంది. తీవ్రంగా నష్టపోతున్న రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. 


నంద్యాల మండలంలోని మిట్నాల, శివరామపురం, పుసలూరు, పాండురంగాపురం, చాపిరేవుల తదితర 20 గ్రామాల పరిధిలో విస్తారంగా మిరప సాగు చేశారు. జూలైలో సుమారు 2500 ఎకరాల్లో మిరప నాటారు. ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. మార్చి, ఏప్రిల్‌ నాటికి పంట కోతకు వస్తుంది. ఈ ఏడాది మార్చిలో కోతకు వచ్చింది. ఇంతలోనే కరోనా కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. దీంతో కూలీలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహానంది, పాణ్యం, గోస్పాడు మండలాల కూలీలతో ఏటా వ్యవసాయ పనులు చేయించేవారు. ప్రస్తుతం కూలీలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. 


అడ్డుకుంటున్న వలంటీర్లు

లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక గ్రామాల పర్యవేక్షణ బాధ్యతను అధికారులు వలంటీర్లకు అప్పగించారు. వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లబోతే వీరు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. ప్రభుత్వం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ వ్యవసాయ పనులకు అనుమతి ఇచ్చిందని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. వాహనాలను నిలిపేసి కూలీలను ఇళ్లకు పంపుతున్నారు. దీంతో కూలీలను తరలించేందుకు ఆటోలు, ట్రాక్టర్ల యజమానులు ముందుకు రావడం లేదు. ఈ కారణంగా కోతకు వచ్చిన మిరప పంట నేల రాలిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


నేల రాలుతోంది..

మిట్నాల వద్ద 20 ఎకరాల్లో మిరప సాగు చేశాను. రూ.20 లక్షలు పైగా పెట్టుబడి ఖర్చు చేశాను. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. వ్యవసాయ కూలీలను గ్రామ వలంటీర్లు, పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనితో మిరప నేలరాలుతోంది. అధికారులు స్పందించి వ్యవసాయ కూలీలకు అనుమతి ఇవ్వాలి.

- చెరుకూరి రవి, రైతు


కూలీలు లేక..

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో బోరు బావులు, తుంగభద్ర తీరంలో వరి, మోక్కజొన్న, మిర్చి, ఉల్లి, బొప్పాయి, వేరుశనగ తదితర పంటలను సాగుచేశారు. ప్రస్తుతం కోతల కాలం. లాక్‌డౌన్‌ కారణంగా కూలీలు దొరకడం లేదు. ఎమ్మిగనూరు మండలంలో కూలీల సమస్య తీవ్రంగా ఉంది. సమీప గ్రామాల్లో వ్యవసాయ పనులకు ఎమ్మిగనూరు నుంచే ఎక్కువ మంది కూలీలు వెళ్లేవారు. ఆటోలను పోలీసులు తిరగనివ్వడం లేదు. దీంతో కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. నందవరం, గోనేగండ్ల మండలాల్లో కొందరు కూలీలు పనులకు వెళ్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి, కౌతాళం మండలాల్లో కూలీల కొరత ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా అటోలు తిరగపోవడమే సమస్య. మంత్రాలయం, పెద్దకడుబూరు మండలాల్లో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. కానీ కొరత ఎక్కువగా ఉంది. దీంతో పంట కోత ఆలస్యమౌతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


కూలీలకు గడ్డుకాలం

లాక్‌డౌన్‌ వల్ల వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్చి 22 నుంచి ఇళ్లకు పరిమితమైన వారికి పూట గడవటం కష్టంగా మారింది. వలస వెళ్లినవారు అక్కడే చిక్కుకు పోయారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ పెద్ద కుటుంబాలకు సరిపోవడం లేదు. అప్పు చేద్దామన్నా దొరకని పరిస్థితి. 


ప్రభుత్వం ఆదుకోవాలి

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యాను. ప్రభుత్వం ఇచ్చే రేషన్‌తో మా కుటుంబాలు  గడవటం కష్టం. అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తే మరింత ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి.

- షేక్‌ రమీజాబీ, వ్యవసాయ కూలీ, ఆత్మకూరు



పొలంలోనే పత్తి

ఆదోని నియోజకవర్గంలో పత్తి విస్తారంగా సాగు చేశారు. ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి కోత చివరి దశలో ఉంది. రబీలో సాగుచేసిన పత్తి సైతం చేతికి వచ్చింది. పత్తిని విడిపించేందుకు కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎవరూ బయటకు రాకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో కూలీలు ఇళ్ల నుంచి కదలడం లేదు. రైతులు పొలంలో కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 


కూలీలు దొరకడం లేదు..

ఖరీఫ్‌లో ఐదెకరాలలో పత్తి సాగు చేశాను. మూడో కోతకు సిద్ధంగా ఉంది. రబీలో బోరుబావి కింద మరో రెండెకరాలలో పత్తి సాగు చేశాను. అది కూడా కోతకు సిద్ధంగా ఉంది. 14 రోజులుగా కూలీలు దొరకడం లేదు. కూలీల ఇళ్ల వద్దకు వెళ్లి పిలిచినా కరోనాకు భయపడి  రావడం లేదు. రాత్రింబవళ్లు పొలంలో కాపలా ఉంటున్నాం. 

- బలరామిరెడ్డి, పర్వతాపురం, ఆదోని మండలం


రెట్టింపు కూలి ఇస్తామన్నా..

మండల పరిధిలోని ఎన్‌ రంగాపురం గ్రామానికి చెందిన రైతు వెంకటేసుకు మూడెకరాల పొలం ఉంది. రెండు ఎకరాల్లో వేరుశనగ, ఎకరాలో వంకాయ సాగు చేశాడు. దాదాపు రూ.లక్ష పెట్టుబడి పెట్టాడు.  ప్రస్తుతం పైర్లకు తెగులు సోకింది. కలుపు మొక్కలు పెరిగాయి. లాక్‌డౌన్‌ కారణంగా కూలీలు పనులకు రావడం లేదు. సాధారణంగా పురుషులకు రూ.300, స్త్రీలకు రూ.200 కూలి ఇస్తారు. ప్రస్తుతం రెట్టింపు కూలి ఇస్తామన్నా పనులకు రావడం లేదని వెంకటేసు వాపోయాడు. పంటలను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి చేతనైనకాటికి పనులు చేసుకుంటున్నామని తెలిపాడు.


Updated Date - 2020-04-08T10:46:41+05:30 IST