సాయంలో న్యాయవాదులందరికీ సమన్యాయం కావాలి

ABN , First Publish Date - 2020-05-27T06:06:24+05:30 IST

కరోనా వల్ల ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితుల సందర్భంలో యువ, పేద అడ్వకేట్‌‌లను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్ల ఆర్థిక సహాయంతో ముందుకు రావటం అభినందనీయం....

సాయంలో న్యాయవాదులందరికీ సమన్యాయం కావాలి

కరోనా వల్ల ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితుల సందర్భంలో యువ, పేద అడ్వకేట్‌‌లను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్ల ఆర్థిక సహాయంతో ముందుకు రావటం అభినందనీయం. ఈ సహాయం పొందడానికి అర్హులైన న్యాయవాదులను గుర్తించడంలో ‘తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అడ్వైజరీ బోర్డ్’ కీలక పాత్రను పోషించాలి. అయితే బోర్డ్ సభ్యుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కొందరు పెద్దలు ఇష్టానుసారంగా నిబంధనలను రూపొందించడం బాధాకరం. ఈ నిబంధనల వల్ల ఎంతో మంది యువ, పేద న్యాయవాదులకు సహాయం దక్కకుండా పోతోంది. ఈ సమయంలో ‘తెలంగాణ అడ్వకేట్స్ ట్రస్ట్’ చర్యలు న్యాయవాదులకు ధైర్యాన్ని ఇచ్చేవిగా ఉండాలే కానీ మనోనిబ్బరం పోగొట్టేలా ఉండకూడదు.


గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ సైతం ఈ అంశంపై వేసిన రిట్ పిటీషన్‌పై స్పందిస్తూ సర్వీసుతో సంబంధం లేకుండా న్యాయవాదులకు సహాయం అందేలా చూడాలని ఆదేశించింది. ఈ సందర్బంగా బోర్డ్ తరఫున పలు డిమాండ్లు వెల్లడిస్తున్నాం: 1) వెంటనే ట్రస్ట్ బోర్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. సభ్యుల సలహాలు సూచనల ప్రకారం అర్హులైన న్యాయవాదులను గుర్తించేందుకు వీలుగా నిబంధలను రూపొందించాలి. 2) ఈ నెల ఆఖరుతో (మే 29) అడ్వకేట్ల హెల్త్ ఇన్యూరెన్స్ పాలసీల గడువు ముగుస్తున్నందున వెంటనే ట్రస్ట్ సభ్యులతో చర్చించి హెల్త్ పాలసీ కార్డులను రెన్యూవల్ చేయాలి. 3) తల్లిదండ్రులు, పిల్లలతోసహా పూర్తి కుటుంబానికి ఇన్సూరెన్సు వర్తింపజేయాలి. 4) ఇన్సూరెన్సు మొత్తాన్ని రూ.5లక్షలకు పెంచాలి. 5) ప్రతి మూడు నెలలకు ఒకసారి ట్రస్ట్ సమావేశాలను నిర్వహించి న్యాయవాదుల సంక్షేమ కార్యకలాపాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. 6) పని ఒత్తిడిలో సమయాన్ని కేటాయించలేని పరిస్థితుల నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ స్థానంలో ట్రస్ట్ బోర్డ్ మెంబర్లలో ఒకరిని ట్రస్ట్ చైర్మన్‍గా నియమించాలి. 7) విధిగా ట్రస్ట్ సమావేశాలను నిర్వహించని ఎడల ట్రస్ట్ బోర్డును రద్దు చేయాలి.

బూడిద మల్లేష్

తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అడ్వైజరీ బోర్డ్ సభ్యుడు

Updated Date - 2020-05-27T06:06:24+05:30 IST