Abn logo
Sep 24 2021 @ 00:17AM

చింతనా ధోరణుల సమన్వయకుడు

భారతీయ తత్వశాస్త్ర తీరుతెన్నుల గురించి సాధికారంగా మాట్లాడిన ఇద్దరు ముగ్గురు తెలుగు వాళ్ళలో ప్రముఖంగా చెప్పుకోవలసిన పేరు కొత్త సచ్చిదానందమూర్తి (1924–2011). భారతీయ తత్వశాస్త్రానికి, విద్యారంగానికి ఆయన విశేషమైన సేవలు అందించారు. సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత భారతీయ తాత్విక సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్లినవారు కొత్త సచ్చిదానందమూర్తి అని ప్రొఫెసర్ వేదపారాయణ అన్నారు. 


అధిభౌతిక శాస్త్రం నుంచి రాజనీతి శాస్త్రం దాకా అనేక కీలక అంశాల గురించి సచ్చిదానందమూర్తి మౌలిక ప్రతిపాదనలు చేశారు. అంతకంటే ముఖ్యంగా పాశ్చాత్యతాత్వికుల ఆలోచనల గురించి కూడా స్వతంత్ర పరిశీలనలు, విశ్లేషణలు చేశారు. భారతీయ మత సిద్ధాంతాలతో పాటు జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, టావోయిజం లాంటి విదేశీ మత సిద్ధాంతాలను గురించి కూడా ఆయన లోతైన విశ్లేషణ చేశారు. సచ్చిదానందమూర్తి తన గురించి ఇలా చెప్పుకున్నారు: ‘నా ఆలోచనలు చాలా బలంగా వేదాంత సంప్రదాయంలో, కొంతవరకు బుద్ధుడి బోధనలో వేళ్ళూనుకుని ఉన్నాయి. అస్తిత్వవాద రచనలు, ముఖ్యంగా యాస్పర్స్ రచనలు నన్ను ఎక్కువగా ప్రభావితం చేశాయి. హైడెగ్గర్, బుబర్, మార్సెల్, నిబర్ లాంటి అనేక మందికి నేను రుణపడి ఉన్నాను’. ఇదే సందర్భంలో తాను చేయాల్సిన పని వేదాలను తిరిగి వ్యాఖ్యానించడం, అస్తిత్వవాదాన్ని కొనసాగించడం కాదనే స్పృహ ఆయనకు స్పష్టంగా ఉంది. మనో వైజ్ఞానిక శాస్త్రాన్ని, సాంస్కృతిక మానవశాస్త్రాన్ని భాషాశాస్త్ర విశ్లేషణలను సమన్వయం చేసుకుని ప్రయాణించాల్సిన అవసరాన్ని గురించిన స్పష్టమైన అవగాహనతో ఆయన రచనలు సాగాయి, విశ్లేషణలు నడిచాయి. 


బౌద్ధంతో ప్రేరణ పొందిన సచ్చిదానందమూర్తి సహజంగానే నిరంతరం యుద్ధమేఘాలు ఆవరించి ఉన్న వర్తమాన ప్రపంచంలో శాంతిని గురించి ఎక్కువగా ఆలోచించారు. ఆ ఆలోచన లోంచే ఒక శాంతి కాముకుడుగా ‘The Quest for Peace’ అనే పుస్తకం రాశారు. మనుషులు నైతిక త్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా మొత్తం ప్రపంచంలో శాంతిని నెలకొల్పడం సాధ్యమవుతుందని ఆయన బలంగా నమ్ముతారు.


అశోక్ వొరా లాంటి వాళ్లు భావించినట్లుగా సచ్చిదానందమూర్తి ప్రధానంగా vedantic theism చేత ప్రభావితమయ్యారు. అయితే ఆయనలో హేతువాద ఛాయలు ఏమాత్రం తక్కువగా లేవు. ఈ హేతువాద ఆలోచనలతోనే సచ్చిదానంద మూర్తి భారతీయ తాత్విక సంప్రదాయం గురించి మౌలిక విశ్లేషణలు చేశారు. భారతీయ తాత్విక సాంప్రదాయం కేవలం మార్మిక అంశాలకు సంబంధించినదని, శతాబ్దాలుగా అది ఎటువంటి మార్పుకు గురికాకుండా కొనసాగుతుందనే అభిప్రాయాన్ని ఆయన ఖండించారు. ఆయన దృష్టిలో ఈ అభిప్రాయాన్ని ఎక్కువగా ప్రచారం చేసింది ప్రాచ్య వాదులు(Orientalists), మిషనరీలు. ఈ విషయాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు. నిజానికి, సచ్చిదానందమూర్తి దృష్టిలో చాలామంది భారతీయ పరిశోధకులు కూడా ఇదే ఆలోచనా ధోరణిలో కొనసాగారు. ఫలితంగా వాళ్లు ఒకానొక ఆత్మన్యూనతకు గురయ్యారు. ఈ న్యూనత నుంచి బయటపడడం అనేది దేశీయమైన శాస్త్రీయ విషయాలను పరిశీలించి వాటిని నొక్కిచెప్పటం వల్ల సాధ్యమవుతుందని ఆయన విశ్వసించారు. ఈ విషయంలో తన కర్తవ్యాన్ని ఆయన చాలా ప్రతిభావంతంగా నిర్వహించారు. దేశీయంగా ఉన్న చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, రాజకీయశాస్త్రం, అర్థశాస్త్రం, ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం, రసాయనిక శాస్త్రం, వైద్యశాస్త్రం లాంటి వాటిని పట్టించుకోకపోవడం అనేది నిర్యాణం, మోక్షం లాంటి వాటి మీద ఎక్కువ దృష్టిపెట్టడం వల్ల జరిగిందని సచ్చిదానందమూర్తి అభిప్రాయం. భారతీయ తత్వశాస్త్రం మౌలికంగా మార్మికతను గురించినదనే భావం బలపడటానికి కూడా ఇదే కారణం. కౌటిల్యుడు, వరాహమిహిరుడు లాంటి వాళ్ల గురించి లోతుగా ఆలోచించి ఉన్నట్లయితే పరిస్థితి వేరే విధంగా ఉండేదని, దేశీయమైన విషయాలను గురించి ఆత్మన్యూనత తలెత్తేది కాదని సచ్చిదానందమూర్తి బలంగా నమ్మారు. 


వేదాలను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ ప్రపంచం బాధామయమని, దాన్ని తప్పించుకోవడం మానవజన్మ అంతిమలక్ష్యం అని వేదాల్లో ఎక్కడా లేదని సచ్చిదానందమూర్తి స్పష్టం చేశారు. అసలు వేదాలు స్వర్గలోకపు జీవితాన్ని గురించి కాక ఈ భూమి మీద జీవితాన్ని గురించే చెప్పాయి అనేది ఆయన నిశ్చితాభిప్రాయం. పురోగతి (progress) అంటే మరింత మెరుగైన, సంతోషకరమైన జీవితం కోసం మనిషి చేసే నిరంతర ప్రయత్నం అయితే, వేదాలు ఈ విషయాన్ని గురించి విశేషమైన ఆలోచనలు మన ముందు ఉంచాయని ఆయన నిర్ధారించారు.


భారతీయ చరిత్ర గురించి సచ్చిదానందమూర్తి పరిశీలనలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ఆయన ఇలా అన్నారు: ‘Imperialists, Missionaries and Marxists did not find Indian history meaningful’. ఈ విషయాన్ని నిరాకరిస్తూ భారతదేశ చరిత్ర గురించి ఆయన ఒక మౌలిక ప్రతిపాదన చేశారు. పాశ్చాత్య ప్రపంచం భారతదేశంలోకి వచ్చేంతవరకు భారతీయులకు చారిత్రక స్పృహ లేదని వలసవాద ఆలోచనలను గట్టిగా ఖండించారు. అలాగే దేశీయంగా ఉన్న వలసవాద మేధావులను కూడా విమర్శించారు. ఆర్యన్ ఔన్నత్యం, ద్రావిడ ఆటవికత్వం అనే ద్వంద్వంలో చిక్కుకుని ఆర్యులు దేశానికి నాగరికతను, ఉన్నతస్థాయి మతాన్ని అందించారని దేశీయ వలసవాద మేధావులు చేస్తున్న వాదన అర్థరహితమని ఆయన కొట్టివేశారు. సచ్చిదానందమూర్తి విశ్లేషణ ప్రకారం భారతీయ సమాజం ఎప్పుడూ నిశ్చలంగా లేదు. మిగతా సమాజాల వలే అది ఆదిమ, బానిస, భూస్వామ్య, రాచరిక, సామ్రాజ్యవాద దశలను దాటి ప్రజాస్వామ్యంలోకి ప్రవేశించింది. ఈ క్రమాన్ని గుర్తించకపోవడం వలసవాద ఆలోచనా ఫలితం తప్ప వేరుకాదనేది ఆయన అభిప్రాయం. 


భారతీయ తత్వశాస్త్రాన్ని, పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని సమన్వయం చేసుకోవాల్సిన అవసరాన్ని అనేక సందర్భాల్లో సచ్చిదానంద మూర్తి నొక్కిచెప్పారు. ప్రాచీన కాలం నుంచి 20వ శతాబ్దం వరకు ఉన్న భారతీయ తత్వశాస్త్ర శాఖలను గురించి చర్చించటంతో పాటు పాశ్చాత్య తత్వ శాస్త్ర అధ్యయన అవసరాన్ని తన రచనల్లో మూర్తి అనేకచోట్ల గుర్తుచేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం వర్తమాన ప్రపంచంలో సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం ఒక కొత్త చారిత్రక అస్తిత్వాన్ని ముందుకు తెచ్చాయి. ఇది ఒక రకంగా పాశ్చాత్య తత్వశాస్త్ర ఆలోచనల ఫలితం. అందువల్ల మన సమకాలీన అస్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి పాశ్చాత్య తత్వశాస్త్రం అవసరమని సచ్చిదానంద మూర్తి భావించారు. భారతీయ తాత్వికశాఖ లైన హిందూ, జైన, లోకాయత, బౌద్ధం గురించి, వాటి చారిత్రక మూలాల గురించే కాకుండా పాశ్చాత్య తత్వశాస్త్రంలో కీలకాంశాలుగా గుర్తించబడిన అనేక విషయాలను చాలా సులభతరంగా ఆయన వివరించారు. 


ఇవాళ మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్న అంబేడ్కర్ ఆలోచనల గురించిన స్పష్టమైన అభిప్రాయాలను సచ్చిదానందమూర్తి చాలాకాలం క్రితమే వ్యక్తం చేశారు. ఆయన దృష్టిలో ‘కులనిర్మూలన’ గ్రంథంలో అంబేడ్కర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా కీలకమైనవి. అలాగే గాంధీ మీద అంబేడ్కర్ పెట్టిన విమర్శను ఆయన పూర్తిగా ఆమోదించారు. సచ్చిదానందమూర్తి దృష్టిలో రమణమహర్షి, అరవిందో, గాంధీ లాంటివాళ్ళు తాత్వికులు కారు. వాళ్లను అరిస్టాటిల్, స్పినోజా లాంటి తాత్వికులతో పోల్చలేం. రమణ మహర్షి, అరవిందోలు దైవజ్ఞులు లేక యోధులు మాత్రమే. అగస్టీన్ లాగ గాంధీ సత్యాన్వేషి. ఈ అన్వేషణలో ఆయనను నడిపించింది అంతర్గతమైన ఒత్తిడి అని ఆయన అంటారు. భారతదేశానికి ఏది కావాలో నెహ్రూకి తెలిసినంతగా మరెవరికీ తెలియదని సచ్చిదానందమూర్తి అన్నారు. 


తెలుగువాడిగా తాత్వికరంగంలో సచ్చిదానందమూర్తి చేసిన కృషి అద్వితీయం. ఇంగ్లీషులో రచనలు చేయటం వల్ల ఆయన కృషి మిగతా ప్రపంచానికి ఎక్కువగానే తెలిసింది. ఆ స్థాయిలో ఆయనకి గుర్తింపు కూడా వచ్చింది. అయితే ఆయన వీటిని పెద్దగా పట్టించుకోకుండా తెనాలి పక్కనున్న జాగర్లమూడి అనే చిన్న గ్రామంలో చివరి వరకు పుస్తకాల మధ్య తనను తాను బంధించుకుని అంతిమక్షణం వరకు కొత్త విషయాలను శోధించే పని కొనసాగించారు. వర్తమాన చారిత్రక సందర్భంలో జ్ఞానపు అఖండ తల గురించిన మిత్‌లు చెదిరిపోయాయి. అన్నిటినీ సమగ్రంగా వివరించగలిగే శాస్త్రీయ సిద్ధాంతం అనేది ఏదీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ తత్వశాస్త్రం నుంచి రాజనీతిశాస్త్రం దాకా ఉన్న అనేక ప్రాచీన, ఆధునిక విషయాలను విశ్లేషిస్తూ సచ్చిదానందమూర్తి చేసిన రచనలు శకలాలుగానైనా మనకి ఎంతగానో ఉపకరిస్తాయి. చాలా విషయాల గురించి స్పష్టమైన వైఖరి తీసుకోవటానికి కూడా సహకరిస్తాయి. 

బి. తిరుపతిరావు

(రేపు, సచ్చిదానందమూర్తి జయంతి)

ప్రత్యేకంమరిన్ని...