మెస్సీ సాధించెన్‌..

ABN , First Publish Date - 2021-07-12T09:00:22+05:30 IST

అర్జెంటీనా జట్టు 28 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన కోపా అమెరికా కప్‌ ఫైనల్లో 1-0 తేడాతో బ్రెజిల్‌పై విజయం సాధించింది. దీంతో 1993 తర్వాత మరో మేజర్‌ టోర్నీని

మెస్సీ సాధించెన్‌..

‘కోపా’ విజేత అర్జెంటీనా

ఫైనల్లో బ్రెజిల్‌పై విజయం


ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా గుర్తింపు.. క్లబ్‌ స్థాయిలో 34 టైటిళ్లు గెలిచిన అనుభవం.. ఏకంగా ఆరు బాలన్‌ డిఓర్‌ అవార్డులు ఖాతాలో ఉన్నా.. అర్జెంటీనాకు ఒక్క అంతర్జాతీయ ట్రోఫీని కూడా అందించలేదనే విమర్శ ఇప్పటిదాకా  లియోనెల్‌ మెస్సీని వేధిస్తుండేది.. చివరికి తన కెరీర్‌ చరమాంకంలో మంత్ర ముగ్ధులను చేసే ఆటతీరుతో.. టాప్‌ స్కోరర్‌గా మారి కోపా అమెరికా కప్‌ను సగర్వంగా ముద్దాడాడు. డీగో మారడోనా సైతం ఈ కప్‌ను గెలవకపోవడం గమనార్హం.  


రియో డి జనీరో: అర్జెంటీనా జట్టు 28 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన కోపా అమెరికా కప్‌ ఫైనల్లో 1-0 తేడాతో బ్రెజిల్‌పై విజయం సాధించింది. దీంతో 1993 తర్వాత మరో మేజర్‌ టోర్నీని గెలుచుకున్నట్టయింది. ఆ ఏడాది కూడా జట్టు చివరిసారి కోపా కప్‌నే అందుకుంది. ఇక కెప్టెన్‌ మెస్సీ కూడా కెరీర్‌లో తొలిసారి అర్జెంటీనా జట్టుకు ఓ పెద్ద టైటిల్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను 22వ నిమిషంలో వెటరన్‌ స్ట్రయికర్‌ ఏంజెల్‌ డి మారియా సాధించాడు. బ్రెజిల్‌  స్వదేశంలో దాదాపు ఆరున్నరేళ్ల తర్వాత ఓ మ్యాచ్‌ను ఓడడం గమనార్హం. మరోవైపు ఈ మ్యాచ్‌కు 7800 మంది ప్రేక్షకుల్ని మాత్రమే అనుమతించారు.


ఆరంభంలోనే..: డిఫెండింగ్‌ చాంప్‌ హోదాలో బరిలోకి దిగిన బ్రెజిల్‌కు 13వ నిమిషంలోనే గోల్‌ చేసే అవకాశం దక్కింది. స్ట్రయికర్‌ రికార్లిసన్‌ అందించిన బంతిని నేమార్‌ గోల్‌గా మలిచేందుకు ప్రయత్నించినా అర్జెంటీనా డిఫెండర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఆ తర్వాత దూకుడు పెంచిన మెస్సీ సేనకు 22వ నిమిషంలో ప్రతిఫలం దక్కింది. మిడ్‌ఫీల్డర్‌ డి ఫాల్‌ అందించిన లాంగ్‌ పాస్‌ను డి మారియా 20 గజాల దూరం నుంచి అద్భుత నియంత్రణతో గోల్‌పోస్టు లోకి పంపాడు. దీంతో అర్జెంటీనా సంబరాలు మిన్నంటాయి. ద్వితీయా ర్ధంలో బ్రెజిల్‌ జోరు పెంచి ంది. ప్రత్యర్థి గోల్‌పోస్టుపై పదేపదే దాడు లకు దిగింది. నేమార్‌ డ్రిబిల్‌, పాస్‌, షాట్లతో ఒత్తిడి పెంచాడు. 53వ నిమిషంలో బ్రెజిల్‌ గోల్‌ చేసినా అది ఫౌల్‌గా తేలింది. అలాగే 55వ నిమిషంలో రికార్లిసన్‌ షాట్‌ను అర్జెంటీనా కీపర్‌ మార్టినెజ్‌ అడ్డుకున్నాడు. ఇక 88వ నిమిషంలో మెస్సీకి గోల్‌ను  చేసే అవకాశం చేజారింది. కీపర్‌ను ఏమార్చే ప్రయత్నంలో జారడంతో బంతిని డ్రిబిల్‌ చేయలేక పోయాడు. చివరకు సమయం ముగియడంతో అర్జెంటీనా విజయం ఖాయమైంది. ఆనందంతో మెస్సీని సహచరులు కాసేపు గాల్లోకి ఎగిరేశారు.


గాయంతోనే ఆడాడు..

జట్టుకు టైటిల్‌ అందించాలనే కసితో లియోనెల్‌ మెస్సీ గాయంతోనే ఫైనల్‌ బరిలోకి దిగినట్టు అర్జెంటీనా కోచ్‌ లియోనెల్‌ స్కలోని తెలిపాడు. ఆల్‌టైమ్‌ బెస్ట్‌ ఫుట్‌బాలర్‌గా పిలుచుకునే మెస్సీకి ఈ టైటిల్‌ ఎంత అవసరమో అందరికీ తెలుసని, తనలాంటి ఆటగాడు మరొకరు లేరని కోచ్‌ కొనియాడాడు. 


 ఇద్దరూ ఉత్తమ ఆటగాళ్లే..

ఈ టోర్నీలో మెస్సీ, నేమార్‌... ఇద్దరినీ ఉత్తమ ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. ఈసారి ఒక్క ఆటగాడిని మాత్రమే ఎంపిక చేయలేమని, ఈ టోర్నమెంట్‌లో అలాంటి వారు ఇద్దరున్నారంటూ దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ సమాఖ్య పేర్కొంది. మెస్సీ మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్‌.. నేమార్‌ ఐదు మ్యాచ్‌ల్లో రెండు గోల్స్‌ సాధించారు. ఇదిలావుండగా మ్యాచ్‌ ఓడాక నేమార్‌ దుఖం ఆపుకోలేకపోయాడు. దీంతో మెస్సీ తన స్నేహితుడిని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు.


1‘ కోపా’ కప్‌ను అత్యధిక సార్లు (15) గెలుచుకున్న ఉరుగ్వేతో అర్జెంటీనా జట్టు సమానంగా నిలిచింది.

Updated Date - 2021-07-12T09:00:22+05:30 IST