Advertisement
Advertisement
Abn logo
Advertisement

భోగి మంటల్లో పీఆర్సీ ప్రతులు

  • రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసనలు
  • 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని డిమాండ్‌

 

అమరావతి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను ఉపాధ్యాయులు భోగి మంటల్లో తగులబెట్టారు. అశుతోశ్‌ మిశ్రా ఇచ్చిన పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేసి 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, పాత తాలూకు కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఫ్యాఫ్టో ఇచ్చిన పిలుపుతో ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. గుంటూరులో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో ఫ్యాఫ్టో చైర్మన్‌ ప్రతులను తగులబెట్టి నిరసన వ్యక్తంచేశారు. ఈ నెల 20వ తేదీన ఫ్యాఫ్టో ఇచ్చిన జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్లు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


ఫ్యాఫ్టో సెక్రటరీ జనరల్‌ శరత్‌చంద్ర మచిలీపట్నంలో, విజయవాడలో యూటీఎఫ్‌ కార్యాలయం వద్ద నక్కా వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్‌ కార్యాలయం వద్ద పాండురంగ వరప్రసాద్‌, కర్నూలులో హృదయరాజు, ఒంగోలులో పర్రె వెంకటరావు, చిత్తూరులో నరోత్తంరెడ్డి.. ఇలా అన్ని కేంద్రాల్లోను ఫ్యాఫ్టో నేతలు పాల్గొని అధికారుల నివేదికను భోగిమంటల్లో దహనం చేశారు. ఫిట్‌మెంట్‌ పెంచడంతో పాటు హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులు కొనసాగించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.


అశుతోశ్‌ నివేదిక బయటపెట్టాలి: ఫ్యాప్టో 

కర్నూలు(ఎడ్యుకేషన్‌): కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఫ్యాప్టో నాయకులు భోగి మంటల్లో 11వ పీఆర్సీ ప్రతులను తగులబెట్టారు. అశుతోశ్‌ మిశ్రా కమిటీ నివేదికను బయట పెట్టాలని ఫ్యాప్టో చైర్మన్‌ ఓంకార్‌ యాదవ్‌, సెక్రటరీ జనరల్‌ గట్టు తిమ్మప్ప డిమాండ్‌ చేశారు. శుక్రవారం కర్నూలులో మీడియాతో మాట్లాడారు. సీఎస్‌ కమిటీ నివేదికను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను యథాతథంగా కొనసాగించాలని, సీపీఎ్‌సను రద్దు చేయాలని కోరారు.  


కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ పోరుబాట 

విజయవాడ: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగుల సమస్యలపై 19, 20, 21 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించనున్నామని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, టీచర్లు, వర్కర్స్‌ జేఏసీ చైర్మన్‌ ఏవీ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశీలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 31న ‘చలో విజయవాడ’ నిర్వహిస్తామన్నారు. 


Advertisement
Advertisement