రాగి పాత్ర మంచిదేనా?

ABN , First Publish Date - 2021-03-23T05:38:33+05:30 IST

అందరిలో క్రమంగా ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. కొవిడ్‌ విజృంభణతో ఈ ధోరణి మరింత ఎక్కువయింది. అనేక వ్యాధులకూ, ఆరోగ్య సమస్యలకూ కారణం ఆధునిక జీవన శైలే అనే ఆలోచనతో...

రాగి పాత్ర మంచిదేనా?

అందరిలో క్రమంగా ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. కొవిడ్‌ విజృంభణతో ఈ ధోరణి మరింత ఎక్కువయింది. అనేక వ్యాధులకూ, ఆరోగ్య సమస్యలకూ కారణం ఆధునిక జీవన శైలే అనే ఆలోచనతో... పాత పద్ధతులకు చాలామంది మళ్ళుతున్నారు. ఆహారంలో తృణ ధాన్యాలను, ఇతర పదార్థాలనూ భాగం చేసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం రోజువారీ జీవనంలో భాగంగా మార్చుకుంటున్నారు. అదే విధంగా వంటకూ, వడ్డనకూ, ఇతర అవసరాలకూ వినియోగించే పాత్రల విషయంలోనూ మార్పులు చేసుకుంటున్నారు. ప్లాస్టిక్‌ సీసాల స్థానంలో రాగి గ్లాసులు, చెంబులు వచ్చి చేరుతున్నాయి. హోటళ్ళలో కూడా రాగి పాత్రల్లో పదార్థాలను తెచ్చి, వడ్డించడం చాలా చోట్ల కనిపిస్తోంది. శుభకార్యాల బహుమతుల్లో రాగి వస్తువులు చోటు చేసుకుంటున్నాయి.


ఇంతకూ రాగి పాత్రల వినియోగం ఆరోగ్యానికి ఎంత వరకూ ప్రయోజనం?

ఆయుర్వేదంలో రాగికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రాగి వస్తువుల వాడకం కఫ, వాత, పిత్త సమస్యలను నివారిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. రాగికి గొప్ప విద్యుత్‌ వాహకత ఉంది. దీనిలో సూక్ష్మ జీవులను నివారించే లక్షణాలు ఉన్నాయనీ, రాగి పాత్రలో నీరు పోసి, రాత్రంతా ఉంచి, ఉదయాన్నే తాగితే ఎన్నో వ్యాధులు తలెత్తకుండా ఉంటాయనీ, గొంతు, నేత్ర, చర్మ సమస్యలు నయమవుతాయనీ నమ్మకం ఉంది. నీటిని శుద్ధి చెయ్యడంలో రాగికి గొప్ప శక్తి ఉందనీ, థైరాయిడ్‌, అజీర్తి నియంత్రణలో ఉంటాయనీ, కొలెస్ట్రాల్‌, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయనీ, పొట్టలోని మలినాలు తొలగిపోతాయనీ చెబుతుంది ఆయుర్వేదం. రాగిలో యాంటీ బ్యాక్టీరియల్‌ ప్రభావం, నీటిని శుద్ధి లేదా స్టెరిలైజ్‌ చేసే సామర్థ్యం ఉన్నాయని కొన్ని అధ్యయనాలు కూడా వెల్లడించాయి.


రాగి పాత్రలో వేయకూడనివి

రాగి ఒక లోహం అనే విషయం మరచిపోకూడదు. లోహాలను వేటి కోసం ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ప్రధానం. పుల్లగా, ఉప్పగా ఉండే వస్తువులను... అంటే ఆమ్ల తత్త్వం ఉన్న పదార్థాలను రాగి పాత్రల్లో వండినా, నిల్వ చేసినా వ్యతిరేక ప్రభావాలు కలుగుతాయి. ముఖ్యంగా నిమ్మ, బత్తాయి, నారింజ, ఉసిరి లాంటి జ్యూస్‌లను రాగి గ్లాసుల్లో తాగడం, లేదా నిల్వ చేయడం మంచిది కాదు. అదే విధంగా రాగి పాత్రల్లో ఊరగాయలనూ, పుల్లటి పచ్చళ్ళనూ దాచకూడదు. అలాగే పాల పదార్థాల కోసం, పెరుగు తోడు వెయ్యడానికీ రాగి పాత్రలను ఉపయోగించకపోవడం శ్రేయస్కరం. ఒక లీటరు నీటిలో రెండు మిల్లీగ్రాములకు మించి రాగి ఉండకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. ఎంత ఎక్కువైనా రోజుకు పది మిల్లీ గ్రాములు దాటకూడదని పేర్కొంది. ఆ ప్రకారం రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని రోజుకు మూడు కప్పుల కన్నా అంటే సుమారు ముప్పావు లీటరుకు మించి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలోకి ఎక్కువ రాగి వెళ్తే దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు చూపించవచ్చని  హెచ్చరిస్తున్నారు. అలాగే ఎక్కువ కాలం రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగితే వికారం, తల తిప్పడం, పొట్టలో నొప్పి లాంటివి తలెత్తే ప్రమాదం ఉంటుందనీ, పది గంటలకన్నా ఎక్కువ సేపు రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగకపోవడమే ఉత్తమమనీ సూచిస్తున్నారు.   పైగా, కాపర్‌ డెఫిషెన్సీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. కనుక రాగి పాత్రల వినియోగం ఉపయోగకరమే. కానీ ఏ పదార్థాలకు వీటిని వాడకూడదో, రాగి పాత్రల్లోని నీరు ఎంత మేరకు తాగాలో తెలుసుకుంటే దుష్ఫలితాలను నివారించుకోవచ్చు.


Updated Date - 2021-03-23T05:38:33+05:30 IST