జనాన్ని ఇంట్లో ఉంచేందుకు పోలీసుల వినూత్న ప్రయత్నం.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2020-04-02T23:40:09+05:30 IST

కోవిడ్-19 దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అది మరింత ప్రబలకుండా కేంద్రం కట్టుదిట్టమైన

జనాన్ని ఇంట్లో ఉంచేందుకు పోలీసుల వినూత్న ప్రయత్నం.. వీడియో వైరల్!

చత్తీస్‌గఢ్: కోవిడ్-19 దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అది మరింత ప్రబలకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ నెల 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన కేంద్రం.. ప్రజలను బయటకు రావొద్దని, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు, నిత్యావసర సరుకులు, మందులు ఇతర అత్యవసరాలు తప్ప మరే దుకాణాలు తెరవకుండా ఆంక్షలు విధించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది. అయితే, ఇప్పటికీ చాలామంది కేంద్రం విజ్ఞప్తులను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. బయటకు రావొద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా వినిపించుకోకపోవడంతో కొన్ని చోట్ల పోలీసులు లాఠీలకు పనిచెబుతుండగా చత్తీస్‌గఢ్ పోలీసులు మాత్రం కొంచెం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించి బైక్‌పై వచ్చిన వారిని పట్టుకుని.. ‘ఓం జై జగదీశ్..’ అనే భక్తిపాటను పాడుతూ వారి నుదుటికి తిలకం దిద్ది చెవిలో పువ్వులు పెట్టి హారతి ఇచ్చారు. అనంతరం చేతులు జోడించి బయటకు రావొద్దంటూ దండం పెట్టారు. ఇలా చేస్తే అయినా ఇకపై సిగ్గుతో బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటారన్నది పోలీసుల ఆలోచన. పోలీసుల ప్రయత్నం ఫలితాలు ఇస్తోంది. ఇంటి నుంచి బయటకు వచ్చి అవమానాల పాలవడం కంటే ఇంట్లో ఉండడమే బెటరని జనం భావిస్తున్నారు. 

Updated Date - 2020-04-02T23:40:09+05:30 IST