ప్రవాళ భిత్తిక!

ABN , First Publish Date - 2021-06-14T06:53:52+05:30 IST

ఎరుపెక్కిన ప్రవాళం కోసం అంగారకుడిని అర్థిద్దామా....! సూర్యుడు ఇటేపే వస్తాట్ట పగడపు దిబ్బపై సేదతీరతాడని కబురు పెట్టింది సముద్రం వెడదామా నేస్తం...

ప్రవాళ భిత్తిక!

ఎరుపెక్కిన ప్రవాళం కోసం

అంగారకుడిని అర్థిద్దామా....!

సూర్యుడు ఇటేపే వస్తాట్ట

పగడపు దిబ్బపై సేదతీరతాడని కబురు పెట్టింది సముద్రం

వెడదామా నేస్తం...

కొన్ని ఎండలు అనుభవిద్దాం....

మరికొన్ని మబ్బుతునకల్ని కరగబెట్టి కత్తుల్ని తయారుచేద్దాం!

ఆటుపోట్ల కాలంలో ఆదమరిచి తీరం చేరకు...

శీతజలం నిన్ను స్థాణువు చేస్తుంది

కనులు చిట్లే నీ వర్ణం వివస్త్రగా తేలుతుంది జాగ్రత్త!

సముద్రాన్ని దాటలేం.. మరొక సంద్రాన్ని చేరలేం...

ఇది ‘హిందూ’ మహాసముద్రం 

మన రంగులు మార్చుకుంటేనే చెల్లుబాటు కుదురుతుంది

నిండు జాబిలి వెలుగు కూడా లొంగుబాటు ప్రకటించింది నేస్తం!

వెడదాం పదా...

ఉష్ణ మండల శిలల అడుగున 

చల్లని లోకం తారసపడుతుందేమో చూద్దాం...

అందాకా...

ఈ మబ్బుతునక పట్టుకో

సూర్యుడువస్తే బార్టర్‌ పద్ధతిన పదునైన ఆయుధమేదైనా మార్చుకో

ఇంది హిందూ మహా సముద్రం..

సముద్ర అనుసంధానం ఎవడైనా చేస్తే బావుండు...!

మరొక చోటికి దూకిపోదుము...

పద్మావతి గంధవరపు

91103 31139

Updated Date - 2021-06-14T06:53:52+05:30 IST