కొత్తిమీర వడలు

ABN , First Publish Date - 2021-10-23T17:21:03+05:30 IST

కరివేపాకు, కొత్తిమీరను దాదాపు అన్ని కూరల్లో వేస్తాం. బిర్యానీ అంటే పుదీనా ఉండాల్సిందే. అయితే కాస్త భిన్నంగా ఈసారి కొత్తిమీరతో వడలు వేసుకుని కరివేపాకు చట్నీతో బ్రేక్‌ఫాస్ట్‌ చేయండి. సాయంత్రం వేళ పుదీనా పరోటా రుచి చూడండి.

కొత్తిమీర వడలు

కొత్తిమీర వడలు...కరివేపాకు చట్నీ!

కరివేపాకు, కొత్తిమీరను దాదాపు అన్ని కూరల్లో వేస్తాం. బిర్యానీ అంటే పుదీనా ఉండాల్సిందే. అయితే కాస్త భిన్నంగా ఈసారి కొత్తిమీరతో వడలు వేసుకుని కరివేపాకు చట్నీతో బ్రేక్‌ఫాస్ట్‌ చేయండి. సాయంత్రం వేళ పుదీనా పరోటా రుచి చూడండి. పోషకాలు పుష్కలంగా లభించే ఈ వంటలు మీ జిహ్వచాపల్యాన్ని తీరుస్తాయి.


కావలసినవి: శనగపిండి - రెండు కప్పులు, కొత్తిమీర - రెండు కప్పులు, బియ్యప్పిండి - ఒక టేబుల్‌స్పూన్‌, పసుపు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - రెండు టీస్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - నాలుగైదు, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం: అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఒక బౌల్‌లో శనగపిండి తీసుకుని అందులో బియ్యప్పిండి, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత కొత్తిమీర వేయాలి. ఒకనిమిషం పాటు వేగిన తరువాత శనగపిండి మిశ్రమం వేసి కలుపుకోవాలి. మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు ఉంచి దింపుకోవాలి. ఒక ప్లేట్‌లో సిల్వర్‌ ఫాయిల్‌ పేపర్‌ తీసుకుని దానిపై ఈ మిశ్రమం పోయాలి. అంతటా సమంగా పరుచుకునేలా చేతితో ఒత్తాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వాటిని వేసి వేగించాలి. చట్నీతో వేడి వేడిగా కొత్తిమీర వడలు సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-10-23T17:21:03+05:30 IST