ప్రత్యేక కేంద్రం వద్దే పడిగాపులు... రోజుకు 70 నుంచి 80 మంది రోగులు గాంధీకి

ABN , First Publish Date - 2021-04-21T07:36:06+05:30 IST

గాంధీలో కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ రోగులకు

ప్రత్యేక కేంద్రం వద్దే పడిగాపులు...   రోజుకు 70 నుంచి 80 మంది రోగులు గాంధీకి

ఒక్కొక్కరికీ అరగంట పైనే సమయం

వంతు వచ్చేసరికే కొందరి పరిస్థితి విషమం

ప్రధాన గేటు నుంచే బాధితులకు అడ్డంకులు

పాజిటివ్‌ నివేదిక ఉంటేనే లోనికి అనుమతి 


పాజిటివ్‌ రిపోర్ట్‌లేక, గాంధీ ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోక, మా అమ్మను ఎక్కడకు తీసుకెళ్లాలో తెలియక, చివరకు ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచింది. గాంధీలో చేర్చుకుంటే కొన్ని రోజులైనా బతికుండేదేమో. 

- ఓ కొడుకు ఆవేదన 


తిరిగి, తిరిగి చివరకు ఉస్మానియా ఆస్పత్రికి వెళ్తే చేర్చుకుని వైద్యులు ఆక్సిజన్‌ అందించారు. కొద్ది సేపటికే ఆక్సిజన్‌ తీసి కిమ్స్‌కు తీసుకెళ్ళమని సలహా ఇచ్చారు. రెండు రోజులు ఆక్సిజన్‌ అందిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుందని, బెడ్‌ లేకున్నా, నేలపైనన్నా ఆక్సిజన్‌ ఇవ్వండని వేడుకున్నా పట్టించుకోలేదు. చేసేది లేక అంబులెన్స్‌లో కిమ్స్‌కు వెళ్లాం. అక్కడ చేర్చుకోలేదు. గాంధీ ఆస్పత్రికి వెళ్లమన్నారు. గాంధీకి వెళ్తే అక్కడ పట్టించుకునే వారే లేరు. అత్త చివరకు ప్రాణాలు కోల్పోయింది. 

- ఓ కోడలి ఆక్రందన


పది, ఇరవై కాదు.. రోజుకు ఏకంగా 70 నుంచి 80 మంది వరకు  రోగులు గాంధీ ఆస్పత్రి వద్ద క్యూ కడుతున్నారు. చివరలో ఉన్న వారి వంతు వచ్చేసరికి సీరియస్‌గా ఉన్న వారు ఊపిరి వదులుతున్నారు. సిబ్బంది, సౌకర్యాల లేమితో గంటల కొద్దీ సమయం పడుతుండడంతో చాలా మంది అంబులెన్స్‌లోనే ఊపిరి వదులుతున్నారు. 


హైదరాబాద్‌ సిటీ/మూడుచింతలపల్లి/పద్మరావునగర్‌/బాలానగర్‌

గాంధీలో కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ రోగులకు వేర్వేరుగా చికిత్సలు అందిస్తున్నారు. అత్యవసర విభాగం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక  (ట్రేయేజ్‌) కేంద్రంలో పేర్లు నమోదు చేసుకుని కొవిడ్‌ రోగులకు పరీక్షిస్తున్నారు. ఆక్సిమీటర్‌ పెట్టి ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ గమనిస్తున్నారు.  అవసరమైన వారిని ఐసీయూ, ఇతర వార్డులకు తరలిస్తున్నారు. ఇలా ఒక్కో రోగిని పరీక్షించే వరకూ కనీసం అరగంట పడుతోంది. ఒకే సారి ఇద్దరు, ముగ్గురు రోగులను వేర్వేరుగా పరిశీలించినప్పటికీ నాలుగో వ్యక్తి వంతు రావడానికి కనీసం అరగంట నుంచి గంట పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో క్యూలో ఉన్న వారికి అత్యవసర చికిత్స సకాలంలో అందే పరిస్థితి లేదు. తన వంతు వచ్చేసరికే ముప్పు పొంచి ఉంది. అందుకే కొంత మంది అంబులెన్స్‌లోనే ప్రాణాలు వదులుతున్నారు. ఎంత ఎమర్జెన్సీ పరిస్థితి అయినా రోగి నేరుగా వైద్యుల వద్దకు వెళ్లే అవకాశం లేదు. ఇతర సమస్యలతో వచ్చిన నాన్‌ కొవిడ్‌ రోగులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. 


ప్రధాన గేట్‌ వద్ద అడ్డు

గాంధీ ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా ప్రకటించిన తర్వాత అక్కడ కట్టుదిట్టమైన కట్డడి చేశారు. ప్రధాన గేటు వద్దనే పోలీసు, సెక్యూరిటీతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాన్‌ కొవిడ్‌ రోగులను గేటు వద్దే పోలీసులు వెనక్కి పంపుతున్నారు. కనీసం వైద్యుల వద్దకు పంపించడం లేదు. ఒక్కోసారి కరోనా బాధితులను కూడా లోపలకు అనుమతినివ్వడం లేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు సోమవారం ఎక్కువగా చోటు చేసుకున్నాయి. కనీసం ఓ 20 నుంచి 30 మంది రోగులను గేటు బయట నుంచే పోలీసులు, సెక్యూరిటీ పంపించేశారని ఫిర్యాదులు నమోదయ్యాయి. కొంత మంది రోగుల కుటుంబీకులు పోలీసులు, సిబ్బందితో గొడవ పడి లోపలకు వెళ్లారు. గట్టిగా వాదించలేని వారు ఉసూరుమని అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. రోగుల ఆక్రందనల వీడియోలు వైరల్‌ కావడం, గేటు వద్ద చోటు చేసుకున్న ఘర్షణలు అధికారుల దృష్టికి పోవడంతో మంగళవారం నాటికి పరిస్థితి కొంత మారింది. దాదాపు అందరినీ లోపలకు పంపించారు. పెద్దగా ఇబ్బంది లేని నాన్‌ కొవిడ్‌ రోగులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. రోగి వెంట ఇద్దరు ముగ్గురు వస్తే ఒక్కరినే అనుమతినిచ్చారు. 


రిపోర్టు ఉంటేనే అడ్మిషన్‌

కొంత మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినప్పటికీ వారి వద్ద రిపోర్ట్‌ ఉండడం లేదు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో పరీక్ష చేసుకున్న వారికి రిపోర్ట్‌ ఇవ్వడం లేదు. అలాంటి వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారి గాంధీకి తీసుకొస్తే అడ్మిట్‌ చేసుకోవడం లేదు. రిపోర్ట్‌ ఉంటేనే లోపలకు అనుమతి ఇస్తున్నారు. దీంతో చికిత్స అందరక రోగి చనిపోతున్నాడు. 


వైద్యులపై భారం

బాధితులు అధిక సంఖ్యలో తరలివస్తుండడంతో వైద్య సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు. అధిక భారం పడుతోందని వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికిపైగా ఇక్కడ వైద్యసేవలు అందిస్తున్నారు. మధ్యలో వైరస్‌ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో నాన్‌ కొవిడ్‌ వైద్య సేవలు అందించారు. ఇప్పుడు మళ్లీ అధిక సంఖ్యలో కేసులు వస్తుండడంతో పడకల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై రెట్టింపు భారం పడుతోంది. గతంలో ఒక రోగి వచ్చిన సమయంలో ఇప్పుడు 25 మంది ఒకేసారి వస్తున్నారని, ఆ స్థాయిలో చికిత్సలు అందించడం తలకు మించిన భారమవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. విశ్రాంతి లేకుండా పోయిందని వాపోతున్నారు. రోజంతా పీపీఈ కిట్స్‌ ధరించి ఉండాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది నర్సులు, వైద్యులు ఇళ్లకు  వెళ్లకుండా హాస్టల్లోనే ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. 

Updated Date - 2021-04-21T07:36:06+05:30 IST