విలయ కరోనా!

ABN , First Publish Date - 2021-05-08T05:03:25+05:30 IST

అశ్వారావుపేట మండలంలో ఈనెల 6న 115మందికి కరోనా పరీక్షలు చేయగా 53మందికి కరోనా సోకింది. ఈనెల 7న 141 మందికి పరీక్షలు చేయగా 53 మందికి కరోనా సోకింది. అంటే పరీక్షలు చేయించుకున్న ప్రతీ ముగ్గురిలో ఒకరికి కరోనా సోకింది. అంటే రెండు రోజుల్లో పాజిటివిటీ రేటు 41.40 శాతంగా ఉంది. దీనిని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కరోనా రెండో ఉధృతి తన ప్రతాపాన్ని ఎలా చూపుతుందో.

విలయ కరోనా!
కరోనా కేసులు అధికంగా నమోదైన ఊట్లపల్లి గ్రామం

రెండు రోజుల్లో ఆరుగురి మృతి

గణనీయంగా పెరుగుతున్న పాజిటివిటి రేటు

అశ్వారావుపేట రూరల్‌, మే 7: అశ్వారావుపేట మండలంలో ఈనెల 6న 115మందికి కరోనా పరీక్షలు చేయగా 53మందికి కరోనా సోకింది. ఈనెల 7న 141 మందికి పరీక్షలు చేయగా 53 మందికి కరోనా సోకింది. అంటే పరీక్షలు చేయించుకున్న ప్రతీ ముగ్గురిలో ఒకరికి కరోనా సోకింది. అంటే రెండు రోజుల్లో పాజిటివిటీ రేటు 41.40 శాతంగా ఉంది. దీనిని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కరోనా రెండో ఉధృతి తన ప్రతాపాన్ని ఎలా చూపుతుందో.

5515...పరీక్షలు...723 కేసులు 

అశ్వారావుపేట మండలంలో కరోనా ఉధృతి గణనీయంగా ఉంటోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగు తోంది. అశ్వారావుపేట మండలంలో అశ్వారావుపేట, గుమ్మడివల్లి, వినాయకపురం ఆసుపత్రులలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. అశ్వారావుపేట, వినాయకపురం పీహెచ్‌సీలో మార్చి 22 నుంచి 3,330 కరోనా పరీక్షలు చేయగా 621మందికి కరోనా నిర్దరణ అయింది. గుమ్మడివల్లి పీహెచ్‌సీలో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 2185 పరీక్షలు చేయగా 102మందికి కరోనా నిర్థారణ అయింది. అయితే గత పక్షం రోజుల నుంచి కరోనా విజృంభణ అధికంగా ఉంటుంది. పక్షం రోజులుగా పరీక్షలు పెరుగుతుంటే అదే స్థాయిలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఏప్రిల్‌ 15 వరకు పరీక్షల సంఖ్య ఎక్కువగా ఉన్నా కేసులు తక్కువగానే ఉంది. కాని పదిహేను రోజులుగా కరోనా పరీక్షలు పెరుగుతున్నా కేసులు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. గత నాలుగు రోజులుగా పరీక్షలు చేసే ప్రతి రోజూ దాదాపు సగం మందికి కరోనా సోకుతుంది. ఈమధ్యకాలంలో కరోనా పాజిటివిటీ రేటు 40శాతం వరకు ఉండగా ఏప్రిల్‌ ఆరంభం నుంచి ఇప్పటివరకు పాజిటివిటీ రేటు సుమారు 13శాతంగా ఉంది. భవిష్యత్తులో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. 

పిట్టల్లా రాలుతున్న బాధితులు

అశ్వారావుపేట మండలంలో గురువారం ఒక్కరోజే ఐదుగురు కరోనాతో బాధపడుతూ మృతిచెందారు. ఇందులో పట్టణానికి చెందిన ముగ్గురు వృద్ధులు, నారంవారిగూడెం, గంగారం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం మండలంలోని ఊట్లపల్లి, నల్లబాడు, ఆసుపాక గ్రామాల్లో కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క ఆసుపాకలో గురువారం పది కేసులు, శుక్రవారం 6కేసులు రావటం జరిగింది. వీరంతా నిత్యం కలిసి కూలి పనులకు వెళ్లే కూలీలు. 

రెండు రోజుల్లో ఆరుగురు మృతి

అశ్వారావుపేట మండలంలో గురు, శుక్రవారాలలో ఏకంగా ఆరుగురు కరోనతో మృతి చెందారు. దీంతో కలసి మండలంలో ఇప్పటి వరకు 12కిపైగా మృతి చెందారు. కరోనా మృతుల సంఖ్య పెరగటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పట్టణానికి చెందిన వ్యాపారికి నాలుగు రోజుల క్రితం కరోనా సోకింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి మృతిచెందారు. పట్టణంలోని ఖమ్మం రోడ్‌లో నివాసం ఉండే 75ఏళ్ల వ్యక్తికి ఐదు రోజుల క్రితం కరోనా సోకింది. ఇతనిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం రాజమండ్రి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మండలంలోని గంగారం గ్రామానికి చెందిన మహిళలకు (75)కి ఐదు రోజుల క్రితం కరోనా సోకింది. పరిస్థితి విషమంగా ఉండటంతో గురువారం అశ్వారావుపేటలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే ఆమె గురువారం అర్థరాత్రి మృతి చెందారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి (70) కరోనాతో మృతి చెందారు. ఇటీవలే ఇతని పెద్ద కుమార్తె కొవిడ్‌తో మృతి చెందింది. వినాయకపురానికి చెందిన మహిళ(35) కరోనాతో మృతి చెందింది. ఈమె శుక్రవారం కరోనా పరీక్ష చేయించుకుంది. పాజిటివ్‌ వచ్చిందని తేలడంతో ఇంటికి తిరిగి వెళ్లి ఆమె తీవ్ర ఉద్వేగానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఇవి కాక అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ దమ్మపేట మండలం, తాటిసుబ్బన్నగూడేనికి చెందిన యువకుడు(25) కొవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతడి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకెళ్లడానికి గ్రామస్థులు నిరాకరించడంతో పేరాయిగూడెం పంచాయతీ సిబ్బంది మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 


Updated Date - 2021-05-08T05:03:25+05:30 IST