కరోనా పంజా

ABN , First Publish Date - 2021-05-07T06:14:07+05:30 IST

కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి విసిరిన పంజాకు అనేక మంది బలవుతున్నారు. ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఈ వైరస్‌ బారినపడి విలవిలలాడుతున్నారు. పైసలు పోతే పాయే.. బతికితే చాలు అంటూ అప్పులు చేసైనా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

కరోనా పంజా

పేదలు, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం

మానసికంగా కుంగిపోతున్న జనం

ఆరోగ్యంగా, ఆర్థికంగా చితికిపోతున్న వైనం

చిన్నపాటి లక్షణాలకే ఆస్పత్రిలో చేరొద్దంటున్న వైద్యులు


(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భూపాలపల్లి జిల్లాలో రెండుమూడు రోజులుగా 200 మందికి పైగా ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ములుగు జిల్లాలో 150 నుంచి 200 మధ్య కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం కరోనా టెస్టులపై పరిమితి విధించింది. ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు 30లోపే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంత స్వల్పంగా టెస్టులు నిర్వహిస్తేనే ఇంత భారీ సంఖ్యలో నిర్ధారణ అవుతుండగా ఇంకా పరిమితి పెంచితే పాజిటివ్‌ కేసుల మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.  

ప్రాణం దక్కితే చాలు..

 కరోనాతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లా  కేంద్రాల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యం లేకపోవటంతో బాధితులు మెరుగైన వైద్యం కోసం వరంగల్‌, హైదరాబాద్‌ లాంటి నగరాలకు తరలుతున్నారు. కరోనా సోకిన వ్యక్తి కోలుకునే వరకు రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వెచ్ఛించాల్సి వస్తోంది.  ఇంత మొత్తంలో ఖర్చు చేసినా బతుకుతారనే గ్యారంటీ లేదు. అయినా ఆశతో అప్పో, సప్పో చేసి లక్షలాది రూపాయలు ధారపోస్తున్నారు. డబ్బులు పోయినా పర్వాలేదు.. బతికి బట్టకడితే చాలు అన్నట్టు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కరోనాతో బాధపడుతున్న భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒకరిని ఇటీవల హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఆక్సిజన్‌, రెమ్‌డిసివియర్‌ ఇంజెక్షన్‌,  ఇతర టెస్టుల పేరిట రోజుకు రూ. 1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు అంటున్నారు. అయినా ఫలితం లేకుండా పోతోంది.  

‘ఆర్థిక’ ఆందోళన

కరోనాతో ఇంట్లో ఏ ఒక్కరూ ఆస్పత్రిలో చేరినా కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లు సంపాదించి కూడబెట్టిన డబ్బులు ఆస్పత్రి ఖర్చులకే ధారపోస్తున్నా ఈ మహమ్మారి నుంచి కోలుకుంటారనే గ్యారంటీ కనిపించడం లేదు. ఆస్పత్రిలో చేరిన బాధితులు సైతం డబ్బుల టెన్షన్‌తో కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతున్నారు. దీంతోనే ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడం, బీపీ పెరగడం లాంటి పరిస్థితులు వచ్చి చికిత్సకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. మరికొన్ని ఇళ్లలో అయితే పాజిటివ్‌ వ్యక్తితో కలిసి ఉన్న కుటుంబ సభ్యులు తమకు ఎక్కడో ఈ వైరస్‌ అంటుకుందోననే  టెన్షన్‌తో వారం పది రోజులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వారికి సైతం ఆయాసం, బీపీ పెరిగిపోతోందని తెలుస్తోంది. మల్హర్‌ మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఈ తరహా ఆందోళనతో నే మృతి చెందాడని తెలిసింది. కరోనా సోకిందని మానసికంగా కుంగిపోవటంతో ఆరోగ్యం క్షీణించి క న్నుమూశాడని ప్రచారం జరుగుతోంది.  

ముందు జాగ్రత్తలే మందు.. 

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలే మేలని అంటున్నారు నిపుణులు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే బయటకు వెళ్లాలని, డబుల్‌ మాస్క్‌ ధరించాలని సూచిస్తున్నారు.  భౌతికదూరం పాటిస్తూ  పౌష్టికాహారం తీసుకోవాలని, యోగా లేదా వ్యాయమం తప్పనిసరిగా చేయాలని అంటున్నారు. కరోనా సోకినా గాబరా పడొద్దని  సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించటంతోనే చాలా మంది ఆస్పత్రిలో చేరి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారని అంటున్నారు. కరోనా రాకుండా జాగ్రత్తలు పడటమే ఉత్తమమని,  వచ్చినా ధైర్యంగా ఎదుర్కొవాలనిసూచిస్తున్నారు. 

లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో చేరొద్దు 

- డాక్టర్‌ ప్రధాన్‌కుమార్‌, ఎండీ (ఎమర్జెన్సీ), భూపాలపల్లి 

కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్పత్రిలో చేరొద్దు. పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన తర్వాత  హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. పౌష్టికాహారం తీసుకోవటంతో పాటు తేలికపాటి వ్యాయమాలు, యోగా లాంటివి చేస్తే త్వరగా కోలుకోవచ్చు. చిన్నపాటి లక్షణాలకే ఆందోళన చెందొద్దు. ఆక్సిజన్‌ లెవల్‌ 94 కంటే తక్కవగా ఉన్నప్పుడు, ఏదైనా జబ్బు మందులు వాడుతున్నా తగ్గపోతే వైద్యుడిని సంప్రదించాకే ఆస్పత్రిలో చేరాలి. కరోనాతో 98శాతం మంది కోలుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దు.

 ధైర్యంగా ఎదుర్కొన్నా...

-పీచర రామకృష్ణ, గారెపల్లి (కాటారం మండలం) 

కరోనాను ధైర్యంగా ఎదుర్కొన్నా. మొదట్లో నాకు ఎలాంటి లక్షణాలు లేవు. అయితే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఎదురైంది. దీంతో కరోనా టెస్టు చేయిస్తే పాజిటివ్‌ వచ్చింది. తర్వాత ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయి. అయినప్పటికీ మొండి ధైర్యంతో కరోనాకు భయపడకుండా మిత్రులు, కుటుంబ సభ్యుల సలహా మేరకు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరి మూడు రోజుల్లోనే తిరిగి ఇంటికి వచ్చేశాను.  కరోనా వస్తే భయపడకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. డాక్టర్‌ సలహాతో మందులు వాడాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా, ధైర్యంగా ఉంటే కరోనాను ఎదుర్కోవచ్చు.


Updated Date - 2021-05-07T06:14:07+05:30 IST