గట్టెక్కేదెలా!?

ABN , First Publish Date - 2021-06-18T04:09:51+05:30 IST

నెల్లూరు నగరానికి చెందిన ఓ చిరు వ్యాపారి కరోనా బారిన పడ్డారు.

గట్టెక్కేదెలా!?

జిల్లాపై తీవ్రంగా కరోనా సెకండ్‌వేవ్‌

ఆసుపత్రుల్లో వైద్యానికి రూ.లక్షల ఖర్చు

వేల కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం

ఆస్తులు అమ్మడం, తనఖాలు పెట్టడం

రిజిసే్ట్రషన కార్యాలయాలు, బ్యాంకుల్లో కనిపిస్తున్న వాస్తవాలు


నెల్లూరు, జూన 17 (ఆంధ్రజ్యోతి) : 

నెల్లూరు నగరానికి చెందిన ఓ చిరు వ్యాపారి కరోనా బారిన పడ్డారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చుయింది. ఆ వ్యక్తి కోలుకున్నప్పటికీ తిరిగి మునుపటిలా వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆ కుటుంబం ఇంటిని తనఖా పెట్టి అప్పు తీసుకుంది. 


మనుబోలుకు చెందిన ఓ రైతు కరోనాతో చెన్నైలో చికిత్స తీసుకున్నారు. దాదాపు రూ.7 లక్షల వరకు ఖర్చు అయినా ఆ వ్యక్తి చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా తయారైంది. చేసిన అప్పులు తీర్చేందుకు వారికున్న బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రుణం తెచ్చుకుంది. 


కొవిడ్‌ సృష్టించిన కల్లోలంలో వేల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. అనేక కుటుంబాలు ఆప్తులను కోల్పోగా వేల కుటుంబాలు ఆస్తులను పోగొట్టుకున్నాయి. ఈ రెండింటినీ పోగొట్టుకున్న కుటుంబాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడింది. ఆసుపత్రిలో చేరితే వైద్యానికి రూ.లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద కరోనాను చేర్చినా చాలా ప్రైవేటు ఆసుపత్రులు అనధికారికంగా నగదు వసూలు చేశాయి.. చేస్తున్నాయి. ఇక మెరుగైన వైద్యం కోసం ఇతర రాషా్ట్రలకు వెళితే భారీగా ఖర్చవుతోంది. ఈ ఖర్చు ఒక ఎత్తయితే.. కుటుంబాన్ని పోషించే వారు లేకపోవడం, లాక్‌డౌన కారణంగా సంపాదన మార్గం లేకపోవడంతో అనేక కుటుంబాలు అప్పులు మీద ఆధారపడ్డాయి. ఓ వైపు వైద్యం, మరోవైపు కుటుంబ పోషణ కోసం మొదటి వేవ్‌తో పోలిస్తే గడిచిన రెండు నెలల కాలంలో అప్పులు తీసుకుంటున్న వారు ఎక్కువయ్యారు. రిజిసే్ట్రషన కార్యాలయాలు, బ్యాంకుల్లో పరిస్థితిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 

సాధారణ రోజుల్లో జరిగే రిజిసే్ట్రషన్ల కన్నా కరోనా సమయంలో రిజిసే్ట్రషన్ల సంఖ్య బాగా తగ్గింది. ఆస్తులు కొందామనుకున్న చాలా మంది తమ వద్దనున్న నగదును వైద్యానికి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక మరికొంత మంది ఏ పరిస్థితి ఎలా ఉంటోందనని, ఆస్తులు కొనడం మానేశారు. దీంతో ఆదాయం కూడా తగ్గిపోయింది. కాగా జరిగిన రిజిసే్ట్రషన్లలో కూడా ఎక్కువగా తనఖా రిజిసే్ట్రషన్లే ఉండటం గమనార్హం. జిల్లాలో నెల్లూరు, గూడూరు రిజిసే్ట్రషన్ల జిల్లాల పరిధిలో మొత్తం 19 సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో వీటి పరిధిలో సుమారు 6 వేల రిజిసే్ట్రషన్లు జరిగాయి. అందులో రెండు వేల రిజిసే్ట్రషన్లు ఆస్తుల తనఖావే ఉన్నాయి. రిజిసే్ట్రషన శాఖలో ఏప్రిల్‌ నెలలో ఆదాయం రూ.34 కోట్లు ఉండగా, అదే మే నెలలో రూ.20 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ లెక్కలను బట్టే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాంకుల్లోనూ రుణాలు తీసుకునేవారి సంఖ్య ఎక్కువైంది. ఎక్కువ మంది బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు పొందుతున్నారు. బంగారు తాకట్టు పెట్టే వారు ఇటీవల కాలంలో ఎక్కువగా తమ బ్యాంకు వస్తున్నారని నెల్లూరులోని ఓ బ్యాంక్‌ అధికారి చెప్పారు. కాగా ఆస్తులు, బంగారం లేని పేదలైతే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని బతుకుబండి లాగిస్తున్నారు. 

Updated Date - 2021-06-18T04:09:51+05:30 IST