అప్రమత్తంగా ఉంటే కరోనా దరి చేరదు

ABN , First Publish Date - 2020-05-30T09:42:19+05:30 IST

ఏ విషయంలోనైనా అలస త్వమనేది ప్రమాదానికి సంకేతమని, అప్రమత్తంగా ఉంటే కరోనా దరి చేరదని డిప్యూటీ

అప్రమత్తంగా ఉంటే కరోనా దరి చేరదు

కొవిడ్‌ విధుల్లో సేవలందిస్తున్న వారికి సెల్యూట్‌ 

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ 

మూడు నియమాలు తప్పనిసరి : జిల్లా కలెక్టర్‌ 


కాకినాడ, మే 29 (ఆంధ్రజ్యోతి): ఏ విషయంలోనైనా అలస త్వమనేది ప్రమాదానికి సంకేతమని, అప్రమత్తంగా ఉంటే కరోనా దరి చేరదని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పలు అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం ప్రజలు కరోనాతో సహవాసం చేయకతప్పదని, మే నెలలో కేసులు సంఖ్య పెరిగే సూచనలున్నాయని సీఎం జగన్‌ ముందే చెప్పారన్నారు. ఆయన మాటలను కొందరు అపహాస్యం చేశారన్నారు. సీఎం చెప్పినట్టే కేసులు పెరుగుతున్నాయన్నారు. అయితే ఎవరు భయపడవద్దని, రక్షణ చర్యలు తీసుకుంటూ వైరస్‌ కారకాల నుంచి దూరంగా ఉండాలన్నారు. కొవిడ్‌ 19 వైరస్‌ నియంత్రణ విధుల్లో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వారిని యుద్ధంలో సైనికులతో పోల్చారు. వైద్య, ఆరోగ్యం, పోలీసు, రెవెన్యూ, పారిశుధ్య సిబ్బంది వైరస్‌ నియంత్రణకు చేస్తున్న సేవలకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. పెద్ద జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్‌తో మృతి ఒకటే నమోదవ్వడం, తదుపరి మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్న కలెక్టర్‌ను మంత్రి అభినందించారు. కొవిడ్‌ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా పతనమైప్పటికీ ప్రజల ఆరోగ్యం విషయంలో ఖర్చుకు తమ ప్రభు త్వం వెనకంజ వేయడం లేదన్నారు.


కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుందోననడానికి జీ మామిడాడలో నమోదైన కొవిడ్‌ కేసులే నిదర్శనమన్నారు. నిర్లక్ష్యం, ఏమవుతుందిలే అనుకోవడంతో పలు కేసుల నమోదుకు దారి తీసిందన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత జనసంచారం పెరగ డంతో వైరస్‌ వ్యాప్తి పెరిగిందన్నారు. భౌతిక దూరం పాటించకపోవడం, ముఖానికి మాస్క్‌లు ధరించకపోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల ముప్పు వాటిల్లిందన్నారు. ఈ మూడు నియమాలు తప్పనిసరి పాటించి ఉంటే ఇన్ని కేసులు వచ్చి ఉండేవి కావన్నారు. అనుమానితులు, పాజిటివ్‌ కాంట్రాక్టు వ్యక్తులను హోం ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని, దీనిపై సమీప ప్రాంతాల ప్రజల్లో అపోహలున్నా యని కలెక్టర్‌ తెలిపారు. ఇంట్లో ఉంటే సరైన వైద్యం అందదని, పక్కన ఉండే కుటుం బాల వ్యక్తులకు వైరస్‌ సోకుతుందని అనుకోవడం పొరపాటన్నారు.


జిల్లా వ్యాప్తంగా ఐదో విడత ఇంటింటి సర్వే జరుగుతుందన్నారు. దీనికోసం పారా మెడికల్‌ సిబ్బంది డోర్‌ టు డోర్‌ తిరుగుతూ వైద్య, ఆరోగ్య శాఖ కరోనా నియంత్రణ కోసం ముద్రించిన కరపత్రాలను పంచుతున్నారన్నారు. ప్రస్తుతం వైద్య సేవలందిస్తున్న వైద్యులకు అద నంగా ఇంకా 75 మంది అవసరం ఉన్నారన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ ప్రతినిధులను ఈ మేరకు సంప్రదించామన్నారు. కొందరి నిపుణులైన వైద్యులను పంపడానికి సముఖత వ్యక్తం చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా 670 క్వారం టైన్‌ సెంటర్లున్నాయని, వీటిలో 10 వేల గదులు, 27 వేల బెడ్‌లు ఏర్పాటు చేశామ న్నారు. 75 పునరావాసా కేంద్రాల్లో 6,918 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. జిల్లా నుంచి 4244 మందిని ఇతర ప్రాంతాలకు పంపామన్నారు. సొంత జిల్లాలకు 1463, రాష్ర్టాలకు 3688 మందిని తరలించామన్నారు. అనంతరం హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారికి అందజేసే మెడికల్‌ కిట్‌లను ఆవిష్కరించారు. సమావేశంలో జేసీలు డాక్టర్‌ లక్ష్మిశ, సీహెచ్‌ కీర్తి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి సత్యసుశీల, నోడల్‌ అధికారి డాక్టర్‌ మాజేటీ మల్లికార్జునరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-30T09:42:19+05:30 IST