కరోనా కట్టడి గాలికే!

ABN , First Publish Date - 2020-06-06T10:20:23+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపులు అమల్లోకి వచ్చిన తర్వాత తిరుపతిలో కరోనా కట్టడి నియమాలను

కరోనా కట్టడి గాలికే!

తిరుపతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సడలింపులు అమల్లోకి వచ్చిన తర్వాత తిరుపతిలో కరోనా కట్టడి నియమాలను గాలికొదిలేశారు.మద్యం దుకాణాలకు అనుమతులిచ్చాక భౌతిక దూరం బలాదూర్‌ అయిపోయింది. మాస్కులు అలంకారప్రాయమయ్యాయి. మాస్కు లేకపోతే రూ.500 ఫైన్‌ వేస్తామని హెచ్చరించిన కార్పొరేషన్‌ ప్రకటనలకే పరిమితమైంది.కరోనా నియంత్రణ కోసం నిత్యం మాస్‌ శానిటైజేషన్‌, రెడ్‌ జోన్లలో కఠిన ఆంక్షలు విధించే కార్పొరేషన్‌ ఇప్పుడు ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదు.


తిరుపతిలో గురువారానికి 22 పాజిటివ్‌ కేసులు నమోదవగా 10మంది కోలుకున్నారు.ఒకరు చనిపోగా 11 యాక్టివ్‌ కేసులున్నాయి. పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాలైన నెహ్రూనగర్‌, ఎల్బీనగర్‌, రైల్వే కాలనీ, దొడ్డాపురం వీధి, బైరాగిపట్టెడ, గంగమ్మ గుడి, శివాజీనగర్‌ ప్రాంతాల్లో 300 మీటర్ల పరిధిలోనే కార్పొరేషన్‌ రెడ్‌జోన్లుగా గుర్తించింది. అయితే కంటైన్మెంట్‌ జోన్లలో ఉండే ఆంక్షలేవీ అమలు కావడంలేదు.  ఆయా వీధులకు అడ్డంగా బారికేడ్లు పెట్టి వదిలేశారు. ఎవరిష్టమొచ్చినట్టు వారు తిరుగుతున్నారు.


ఇదివరకు 6 ట్రాక్టర్లు, రెండు ట్యాంకర్లు, ఒక ఆటో, బట్టర్‌ ఫ్లై మిషన్‌తో క్రిమిసంహారక ద్రావణం పిచికారి చేసేవారు. ఇప్పుడు కేవలం రెండు ట్యాంకర్లు, ఒక ఆటోతోనే సరిపెట్టేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. ఇటీవల నమోదయ్యే కేసులు చాలావరకు ఎవరినుంచి సోకిందో అంతుబట్టడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కంటైన్మెంట్‌ జోన్లలోనైనా ఆంక్షలు కఠినతరం చేయకపోతే వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని వైద్యనిపుణులంటున్నారు. 

Updated Date - 2020-06-06T10:20:23+05:30 IST