‘పర్ఫెక్ట్‌’గా మత్తు!

ABN , First Publish Date - 2020-08-03T09:08:27+05:30 IST

‘పర్ఫెక్ట్‌’గా మత్తు!

‘పర్ఫెక్ట్‌’గా మత్తు!

శానిటైజర్‌ మరణాలకు అదే కారణం?

పెద్దల ‘మహి’మతో మరోరకం బాటిల్‌ మాయం!

మందుబాబులే లక్ష్యంగా రెక్టిఫైడ్‌ స్పిరిట్‌తో తయారీ

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విచ్చలవిడి విక్రయాలు

కేసు నుంచి తెలివిగా తప్పించుకున్న బడా డ్రగ్‌ డీలరు

మొత్తం వ్యవహారం వెనుక బలమైన రాజకీయ నేత?

గుంటూరు జిల్లా వ్యాపారిపై కేంద్ర నిఘావర్గాల ఆరా

ఘటనపై జాతీయ స్థాయిలో కలకలం!


అమరావతి, (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో ఇప్పుడు రెండు అంశాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకటి పంజాబ్‌లో నాటుసారా మృతులు.. రెండోది ఏపీలో శానిటైజర్‌ మరణాలు. ఈ రెండింటి వెనుక అసలు విషయాలపై ఆరా తీసిన కేంద్ర నిఘా వర్గాలకు కొన్ని సంచలన విషయాలు తెలిసినట్లు సమాచారం. రాష్ట్రంలో మద్యం వ్యసనపరుల మరణాలకు రెండు రకాల శానిటైజర్లు కారణమని తెలుస్తోంది. వారం వ్యవధిలో శానిటైజర్లు తాగి ఇరవై మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే!. హైదరాబాద్‌లోని బాలానగర్‌ ప్రాంతంలో ఎలాంటి లైసెన్సూ లేకుండా ఏపీకి చెందిన ఓ సంస్థ రెక్టిఫైడ్‌ స్పిరిట్‌తో తయారు చేసి ‘పర్ఫెక్ట్‌’గా విక్రయిస్తోందని పోలీసులు తేల్చారు. ఇంతవరకూ బాగానే ఉన్నా గుంటూరు జిల్లాకు చెందిన ఒక రాష్ట్ర సంఘం నాయకుడు ఈ వ్యవహారంలో తెలివిగా తప్పించుకున్నట్లు సమాచారం. నరసరావుపేట ప్రాంతానికి చెందిన ఆయన ఏజెన్సీస్‌, ఎంటర్‌ప్రైజస్‌, ల్యాబొరేటరీస్‌ వంటి వేర్వేరు పేర్లతో వ్యాపారాలు నడుపుతున్నారు. అదే జిల్లాలోని నాదెండ్ల మండలంలో ఒక ఫార్మాసూటికల్స్‌ ద్వారా శానిటైజర్‌ తయారు చేయించి విక్రయిస్తున్నారు. ఈ కంపెనీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఓ రాజకీయ నేత అనుచరునిదిగా ప్రచారంలో ఉంది. తాజాగా శానిటైజర్‌ తాగి మరణించిన వ్యక్తులు కొందరు ఇదే కంపెనీకి చెందిన శానిటైజర్‌ సేవించినట్లు కేంద్ర నిఘావర్గాలకు సమాచారం అందింది. మృతుల వద్ద ఆ శానిటైజర్‌ బాటిళ్లు కూడా దొరికినా కొందరు పెద్దల ‘మహి’మతో వాటిని మాయం చేసినట్లు సమాచారం. దీనిపై నిఘావర్గాలు ఆరా తీయగా రాష్ట్రంలో బలమైన ఒక రాజకీయ పార్టీ నేత సహకారంతో ఆయన తన కంపెనీ బాటిల్‌ అక్కడ లేకుండా మాయం చేసినట్లు సమాచారం. ఈ విషయమై పక్కా సమాచారం అందుకున్న నిఘావర్గాలు.. ఆ నాయకుడు తయారు చేయిస్తున్న శానిటైజర్‌ గురించి ఆరా తీయగా రెక్టిఫైడ్‌ స్పిరిట్‌తో తయారు చేయిస్తున్నట్లు తేల్చారు. అందులో కార్నినోజిక్‌ అనే కేన్సర్‌ కారకాలున్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈరకం శానిటైజర్‌ తాగిన కొద్ది సేపటికే లివర్‌ దెబ్బతింటుందని తెలుస్తోంది. అయితే మృతుల వద్ద పడిన ఉన్న బాటిల్‌ మాయం చేయడానికి సహకరించింది ఎవరు.? ఒత్తిడి తెచ్చిన నాయకుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి.? తదితర అంశాలపై కూపీలాగిన నిఘావర్గాలు కేంద్రానికి సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది.  

Updated Date - 2020-08-03T09:08:27+05:30 IST