కొవిడ్‌తో పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి మృతి

ABN , First Publish Date - 2020-08-13T07:19:07+05:30 IST

కొవిడ్‌తో పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి మృతి

కొవిడ్‌తో పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి మృతి

సంతాపం తెలిపిన చంద్రబాబు, లోకేశ్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ప్రముఖ పారిశ్రామికవేత్త, పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌ సీఎండీ పాలెం శ్రీకాంత్‌రెడ్డి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో మృతి చెందారు. కొవిడ్‌తో ఆయన బుధవారం మృతిచెందినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీకాంత్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని డైరెక్టర్లు, ఉద్యోగులు ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. శ్రీకాంత్‌రెడ్డి స్వగ్రామం కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం తాటిమాకులపల్లె. హైకోర్టు మాజీ న్యాయమూర్తి పాలెం చెన్నకేశవరెడ్డి మూడో కుమారుడైన శ్రీకాంత్‌రెడ్డికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, వాటిని విజయపథంలో నడిపించడంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. రవాణా, లాజిస్టిక్స్‌ పరిశ్రమకు సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్లను అందించే ఫోర్‌సాఫ్ట్‌ కంపెనీని హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహించారు. 2013లో కంపెనీకి చెందిన విదేశీ అనుబంధ విభాగాలతో పాటు కీలక వ్యాపారాన్ని రూ.265 కోట్లకు బ్రిటన్‌కు చెందిన కీవిల్‌ గ్రూప్‌నకు విక్రయించారు. ప్రస్తుతం పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌ ద్వారా ఈ-కామర్స్‌ రంగంపై దృష్టి పెట్టారు. టీడీపీ వాణిజ్య విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీకాంత్‌ రెడ్డి... 2009లో టీడీపీ అభ్యర్థిగా లోక్‌సభకు కడప నుంచి వైఎస్‌.జగన్‌పై పోటీచేసి ఓడిపోయారు. తర్వాత పార్టీ కి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మోడరన్‌ రాయలసీమ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సీమ అభివృద్ధికి కృషి చేశారు. తండ్రి పేరుతో ట్రస్ట్‌ స్థాపించి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాంత్‌రెడ్డి మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-08-13T07:19:07+05:30 IST