క్యా ‘కరోనా’

ABN , First Publish Date - 2020-08-13T10:31:55+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, రవాణా సౌకర్యం సరిగా లేనందున ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్యా ‘కరోనా’

ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించాలన్న  ప్రభుత్వం

17 నుంచే 50 శాతం టీచర్లు హాజరు కావాలని వెల్లడి

కరోనా వైరస్‌ నేపథ్యంలో అరకొరగా రవాణా సౌకర్యం

బస్సులు, రైళ్లలో ప్రయాణం చేసేందుకు జంకుతున్న ఉపాధ్యాయులు

ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న టీచర్ల సంఖ్య 13,570 

వారిలో 70 శాతానికిపైగా వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం :

ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, రవాణా సౌకర్యం సరిగా లేనందున ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ పరిస్థితుల్లో రైళ్లు సరిగా నడపడం లేదు. బస్సులు కూడా అరకొరగానే ఉన్నాయి. దాంతో హైదరాబాద్‌తో పాటు వివిధ పట్టణాల్లో నివాసం ఉంటూ పాఠశాలలకు రాకపోకలు సాగిస్తున్న టీచర్లు రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో 70 శాతం మంది వివిధ ప్రాంతాల్లో ఉంటూ స్కూల్స్‌కు వెళ్తున్నారు.


ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని, ఈ నెల 17 నుంచి 50 శాతం మంది టీచర్లు పాఠశాలలకు హాజరు కావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,870 ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. అందులో 13,570 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వారిలో 70 శాతానికిపైగా వివిధ ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు, ఇతర వాహనాలలో రాకపోకలు సాగిస్తున్నారు. మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాలతో పాటు, ఆయా జిల్లాల్లోని పట్టాణాలు నుంచి, మరికొందరు హైదరాబాద్‌ నుంచి పాఠశాలలకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో బస్సులు, రైళ్లలో ప్రయాణం చేసేందుకు వారు జంకుతున్నారు.


పాలమూరు నుంచే అధికంగా రాకపోకలు

ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పని చేస్తున్న టీచర్లు అత్యధికంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఉం టూ రాకపోకలు సాగిస్తున్నారు. పట్టణం నుంచి సుమారు 5,000 మంది టీచర్లు పాఠశాలలకు వెళ్తున్నారని విద్యాశాఖ, ఆర్టీసీ, రైల్వే వర్గాల లెక్కలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రైళ్లు సరిగా నడపడం లేదు. దీంతో పాఠశాలలకు వెళ్లాలంటే ఇబ్బందిగానే ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.


రవాణా సౌకర్యం కల్పించాలి

పాఠశాలలకు తాము వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే రవాణా సౌర్యం కల్పిస్తే బాగుంటుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కిష్టయ్య, జి.నారయణ్‌గౌడ్‌, దుంకుడు శ్రీనివాస్‌ కోరుతున్నారు. పాఠశాలలను శానిటైజేషన్‌ చేయించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని చెబుతున్నారు.

Updated Date - 2020-08-13T10:31:55+05:30 IST