విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-10-01T10:49:43+05:30 IST

కరీంనగర్‌ జిల్లాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 17,784 మందికి కరోనా సోకగా 153 మంది ప్రాణాలు కోల్పోయారు

విజృంభిస్తున్న కరోనా

జిల్లాలో 17,784 మందికి సోకిన వైరస్‌

సెప్టెంబర్‌లోనే 10,000 పాజిటివ్‌లు

చికిత్సలో 3,994 మంది వ్యాధిగ్రస్తులు

153 మంది మృతి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌ జిల్లాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 17,784 మందికి కరోనా సోకగా 153 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక సెప్టెంబర్‌లోనే 10వేల మంది వ్యాధిబారినపడ్డారు. ఆగస్టులో విజృంభన ప్రారంభం కాగా సెప్టెంబర్‌ చివరి  వరకు అదే ఒరవడి  కొనసాగించి కొంత తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ఆగస్టులో వచ్చిన కేసులతో పోలిస్తే సెప్టెంబర్‌  సుమారు 50శాతం అధిక మొత్తంలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మార్చి 2వ తేదీన తొలి కరోనా కేసు నమోదు కాగా జిల్లాలో మార్చి 17న మొదటి కేసు వచ్చింది. 31వ తేదీ వరకు జిల్లాలో 13 మందికి కరోనా సోకగా, ఏప్రిల్‌లో ఆరుగురికి, మే నెలలో నలుగురికి  పాజిటివ్‌ వచ్చింది. లాక్‌డౌన్‌ కాలంలో కేవలం 23 మంది మాత్రమే వ్యాధిబారిన పడ్డారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత జూన్‌లో 88 మందికి వ్యాధి సోకింది. అప్పటి నుంచి కేసులు పెరుగుతూ పోతున్నాయి. జూలైలో హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మొదలుకావడంతో వలసవెళ్లిన వారందరూ తమతమ ఇళ్లకు తిరిగిరావడం, సడలింపులు పెరిగిపోవడంతో జూలైలో గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాధి విస్తరించింది. జిల్లాలో 313 గ్రామపంచాయతీలు ఉండగా సుమారు 250కిపైగా గ్రామాల్లో వ్యాధి విస్తరించింది. జూలైలో 1,518 మంది వ్యాధి సోకగా ఆగస్టులో 6,699 మంది వ్యాధి బారినపడ్డారు. సెప్టెంబర్‌లో మరింత విజృంభించింది. జిల్లాలో 87,329 మందికి రాపిడ్‌ ఆంటిజెన్‌ టెస్టులు, 30,290 మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.


మొత్తం జిల్లాలో 1,17,626 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 17,784 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో ఇప్పటి వరకు 11,637 మంది కోలుకోగా 3,994 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో, హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 153 మంది కరోనా కారణంగా మరణించారని అధికార వర్గాలు చెపుతుండగా ఆ సంఖ్య 200 వరకు ఉంటుందని అనధికారిక సమాచారం. ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో కాకుండా సీటీస్కాన్‌ల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకొని కరోనా మందులు వాడుతూ వ్యాధి విషమించి మరణించిన వారి సంఖ్య అధికారికంగా నమోదు కావడంలేదని తెలుస్తున్నది. ప్రభుత్వ వైద్యశాలల్లో వ్యాధి నిర్ధారణ అయినవారు 17,784 మంది కాగా ప్రైవేట్‌గా పరీక్షలు చేయించుకొని చికిత్స పొందుతున్న వారు కనీసం ఏడెనిమిది వేల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల మేరకు సుమారు 25వేల మంది ఇప్పటికే వ్యాధిబారినపడ్డట్లు భావిస్తున్నారు.


జిల్లాలో ప్రస్తుతం 3,994 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 3,651 మంది హోంక్వారంటైన్‌లో ఉండగా జిల్లా ఆసుపత్రిలో 82 మంది, శాతవాహన క్వారంటైన్‌ కేంద్రంలో 39 మంది, హైదరాబాద్‌ ఆసుపత్రుల్లో 97 మంది, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 115 మంది, జమ్మికుంట క్వారంటైన్‌ కేంద్రంలో 10 మంది చికిత్స పొందుతున్నారని సమాచారం. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల ప్రకారం కట్టరాంపూర్‌ పరీక్షా కేంద్రంలో సగటున 26శాతం, సప్తగిరికాలనీలో 25శాతం, విద్యానగర్‌ పరీక్ష కేంద్రంలో 24శాతం, చొప్పదండిలో 20శాతం, హౌసింగ్‌ బోర్డు కాలనీలో 17.3శాతం, బుట్టిరాజారాం కాలనీలో 17శాతం, తిమ్మాపూర్‌లో 20శాతం, ఇల్లందకుంటలో 11శాతం, చిగురుమామిడిలో 14శాతం, గంగాధర, గుండిలో 12శాతం, సైదాపూర్‌లో 3శాతం, వావిలాలలో 6శాతం, మానకొండూర్‌లో 10శాతం, జమ్మికుంటలో 9శాతం, చెల్పూర్‌లో 11శాతం, రామడుగులో 7శాతం, చల్లూరూలో 2శాతం కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తున్నది. సెప్టెంబర్‌ చివరి వారం నుంచి కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తున్నది. ఇది స్థిరంగా లేనందువల్ల అప్పుడే వ్యాధితగ్గుముఖం పట్టినట్లు కాదని భావిస్తున్నారు. వైద్యాధికారులు చెపుతున్న ప్రకారం వ్యాధి విస్తరణ వేగంగానే ఉన్నా తీవ్రత మాత్ర తగ్గిందని అంటున్నారు. వ్యాధిబారినపడ్డవారు తొందరగానే కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. 


మరో 103 మందికి కరోనా పాజిటివ్‌ 

జిల్లాలో 103 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ అయింది. ఈమేరకు బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. బుధవారం స్థానికులు తెలిపిన మేరకు జిల్లాలో 200 మందికి కరోనా వ్యాధి సోకినట్లు తెలిసింది. హుజురాబాద్‌లో 25, చొప్పదండిలో 23, కొత్తపల్లిలో 20, జమ్మికుంటలో 17, రామడుగులో 15, మానకొండూర్‌లో 13, చిగురుమామిడిలో 9, తిమ్మాపూర్‌లో 4, ఇల్లందకుంటలో 6, వీణవంకలో 6, గంగాధరలో 4, సైదాపూర్‌లో 1, శంకరపట్నంలో 1, 56 కేసులు కరీంనగర్‌ పట్టణంలోని వివిధ డివిజన్లలో నమోదైనట్లు తెలిసింది.  

Updated Date - 2020-10-01T10:49:43+05:30 IST