Abn logo
Aug 2 2020 @ 05:10AM

మృతదేహం నుంచి కరోనా సోకదు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ)

 ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని లెక్కచేయకుండా వారు విధుల్లో నిమగ్నమయ్యారు. జాగ్రత్తలు తీసుకు న్నా, పని ధ్యాసలో ఉన్న వారిని కరోనా కాటేసింది. అయినా వారు జంకలేదు. వైర్‌సను సరైన సమయంలో గుర్తించి, పరీక్షలు చేయించుకొని, వైద్యుల సూచనలు పాటించి గుండెనిబ్బరంతో కరోనాను ఎదుర్కొన్నారు. వారం రోజుల్లోనే కొందరు, పది రోజుల్లో మరికొందరు ఆరోగ్యవంతులై తిరిగి విధుల్లో సగర్వంగా చేరారు. కరోనాతో మృతిచెందిన తల్లిదండ్రులను చూసి పేగుతెంచుకుపుట్టిన బిడ్డలే అమ్మో అంటూ ఆమడదూరం పారిపోతున్నారు. అయినవారి కడచూపునకు నోచుకోక, అనాథ శవాల్లా ఆ కన్న ప్రాణాలు వీడిపోతున్నాయి. దీనికి కార ణం అజ్జానమే. ఓ ఉద్యమకారుడి పార్థీవం అనాథగా మిగలొద్దని ఉ.సాంబశివరావు మృతదేహాన్ని ముద్దాడి, అంత్యక్రియ లు నిర్వహించిన డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ మనమధ్య ఆదర్శంగా నిలిచారు. నెలలపాటు కరోనాతో సావాసం చేస్తూ అలుపెరగకుండా సేవలందిస్తున్న వైద్యసిబ్బంది ఉన్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యుల సూచనలు పాటిస్తే కరోనాను తరిమికొట్టవచ్చు. అన్నింటికీ మించి మనోధైర్యమే గొప్ప ఆయుధం.


ఏ వ్యాధి లేనివారు భయపడాల్సిన పని లేదు-భాస్కరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే

ఏ వ్యాధి లేనివారు భయపడాల్సిన పనిలేదు. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. తొలిసారి పరీక్ష చేయించుకుంటే నెగటివ్‌ వచ్చింది. కొద్దిరోజులకు మళ్లీ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చింది. వా రం రోజులు హోంక్వారంటైన్‌ పా టించాలని హైదరాబాద్‌లో ఉండే నా మిత్రుడు డాక్టర్‌ ఎంవీరావు సూ చించారు. రోజుకు మూడుమార్లు కషాయం, పాలు తాగడంతోపాటు గవర్నమెంట్‌ వైద్యులు ఇచ్చిన మందులే వేసుకున్నా. సీ-విటమిన్‌తోపాటు రావిఫ్లో 13 రోజుల కోర్సు వాడా. ఇక టెస్టు కూడా అక్కరలేదన్నారు. అయినా పరీక్ష చేయించుకు న్నా. ఆదివారం రిపోర్ట్‌ వస్తుంది. నా అభిప్రాయం ప్రకారం ఆరోగ్యవంతులైన యువకులు పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. చేయించుకున్నప్పటి నుంచి అదో భయం. గుండె జబ్బు, అస్తమా లాంటి శ్వాస సమస్యలు ఉన్నవారే చేయించుకోవాలి. నేను హైదరాబాద్‌లో 50 మందిని చేర్పించా, ఎవరికీ ఆక్సిజన్‌ అవసరం పడలేదు. కరోనా గురించి భయపడాల్సిన పనేలేదు. భయపడితే జ్వరం తగ్గడానికి మరో రెండు రోజులు పడుతుంది. ఎంవీ.రావు ఇచ్చిన మందులే మా నియోజకవర్గంలో అవసరం ఉన్న వారికి పంపిస్తున్నా.

 

ధైర్యంగా ఉండటమే మందు- గొంగిడి సునీత, ఆలేరు ఎమ్మెల్యే

నాకు, జూలై 1వ తేదీ సాయంత్రం కరోనా పాజిటివ్‌ రిపోర్టు రాగా, 2న ఆస్పత్రిలో చేరా. నాకు వైరస్‌ లక్షణాలు లేవు. 1న సాయంత్రం 15నిమిషాల పాటు తలనొప్పి వచ్చింది తప్ప, ఎలాంటి లక్షణాలు లేవు. ఆస్పత్రిలో ఇచ్చిన మందులు, కషాయాల కారణంగా వారం రోజుల్లోనే కోలున్నా. ధైర్యంగా ఉండటమే తొందరగా కోలుకునేలా చేసింది. డయాలసిస్‌, గుండె, కిడ్నీ, లివర్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నవారు తలనొప్పి వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఏ జబ్బులు లేనివారు ఇంటివద్ద కషాయం తాగండి. దోసకాయ, అనపకాయ, ఈ రెండు  మాత్రం తినకండి. మాంసాహారం, రోజూ ఒక గుడ్డు తినాలి. అల్లం, దాల్చిన చెక్క, లవంగ, ఇలాయిచీ మరగబెట్టి కషాయం తాగండి. రోజు మొత్తం గోరు వెచ్చని నీళ్లు తాగండి. అందులో ఇంత పసుపు వేసుకుంటే ఇంకా మంచింది. ఆవిరిపట్టండి. మాస్క్‌ ధరించండి. రోజూ వేడి నేటి స్నానం చేస్తూ, భౌతికదూరం పాటిస్తే ఎవ్వరికీ ఏమీ కాదు.


ప్రాణం తీసే జబ్బు కాదు- గొంగిడి మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌

కరోనాకు భయపడొద్దు. జాగ్రత్తలు పాటిస్తే ఇది ప్రాణం తీసే జబ్బు కాదు. అధైర్యపడకుండా వైద్యుల సలహాలు పా టిస్తూ మందులు వేసుకోవాలి. మన అజాగ్రత్తే మనల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటిస్తూ, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటే 80 శాతం కరోనా మన దగ్గరకు రాదు. శ్వాస ఇబ్బంది ఉన్నవారు తప్పక డాక్టర్ల సూచనలు పాటిస్తూ హోంక్వారంటైన్‌లో ఉంటే సరిపోతుంది.


మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు - అనిల్‌,    నల్లగొండ ట్రాఫిక్‌ సీఐ

 కరోనా సోకిన వారు మానసికంగా దృఢంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో స్థైర్యం కోల్పోవద్దు. కరోనాకు సంబంధించిన వార్తలు, విషయాలను సోషల్‌ మీడియాలో చూడొద్దు. ప్రస్తుతం పూర్తిస్థాయి మెడిసిన్‌ లేకపోవడంతో, సాధారణ మందులే వాడాలి. డాక్టర్లు సూచించినట్టు రోజూ మూడు సార్లు మందులు వేసుకున్నా. రెండుమార్లు కషాయం తాగా. బాదం, పిస్తా, ఉడకబెట్టిన గుడ్డు వంటి బలమైన ఆహారం తీసుకున్నా. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి.


ఏడు రోజుల్లో కోలుకున్నా - నర్సింహ, నల్లగొండ  టూటౌన్‌ ఎస్‌ఐ

డ్యూటీలో భాగంగా ఓ కేసు విషయమై బెం గుళూరు వెళ్లా. అక్కడే కరోనా సోకింది. గతనెల 13న దగ్గు మొదలైంది. అనుమానంతో వెంటనే పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వైద్యులు సూచించినట్టు డోలో 650తోపాటు ఇతర మందులు వేసుకున్నా. పల్స్‌ ఆక్సీమీటర్‌, థర్మామీటర్‌ దగ్గర పెట్టుకున్నా. యోగా, బ్రీతింగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ లు గంటపాటు చేసేవాడిని. దీంతో ఎక్కడా గాలిపట్టినట్టు అనిపించేది కాదు. మా ఎస్పీ గారు, ఇతర ఆఫీసర్లు ఽఽధైర్యం చెప్పా రు. దీంతో ఏనాడూ ధైర్యం కోల్పోలేదు. అందుకే తొందరగా కోలుకున్నట్టు అనిపించింది. నా వంట నేనే చేసుకున్నా, హోంక్వారం టైన్‌లోనే చికిత్స తీసుకున్నా.


 మృతదేహం నుంచి కరోనా సోకదు- డాక్టర్‌ చెరుకు సుధాకర్‌

మనిషి చనిపోయా క మూడు నుంచి నాలుగు గంటల తరువాత శరీరంలో కరోనా వైరస్‌ ఉండదు. కొందరి మూఢవిశ్వాసం కారణంగా గొప్ప డాక్టర్లు మృతిచెందినా దిక్కులేని వారిగా మారుతున్నారు. చెన్నైలో ప్రముఖ న్యూరాలజిస్ట్‌ సైమన్‌దీ అదే పరిస్థితి. జీవితాన్ని దేశానికి అంకితం చేసి ప్రాణాలు కోల్పోయిన ఆయన మృతదేహాన్ని శ్మశాన వాటికలోకి రానివ్వలేదు. చివరికి తోటి డాక్టర్‌, అంబులెన్స్‌ డ్రైవర్‌ గోతి తీసి పాతిపెట్టాల్సి వచ్చింది. మనదగ్గర కూడా ప్రస్తుతం ఏ కారణంతో చనిపోయినా మృతదేహాలను ఊర్లోకి రానివ్వడం లేదు. ఆంధ్రాలో గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు కోరుకుంటున్నారో చర్చించిన గొప్ప తాత్వికవేత్త, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న నేత ఉ.సాంబశివరావు(ఉసా). ఉసా మృతి వార్త సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకొని వెళ్లా. కరోనా మృత దేహంతో వైరస్‌ వ్యాపించదని సమాజానికి చెప్పేందుకే ఉసా అంత్యక్రియలు దగ్గరుండి నిర్వహించాం. ఆయనపై నాకున్న గౌరవంతో కాళ్లకు దండం పెట్టి, నుదిటిని ముద్దాడా. మానసిక భయంతో మృతదేహం వద్దకు వెళ్లని వారు కరోనా సోకితే ఏం తట్టుకుంటారు? కరోనా కారణంగా గొప్పగొప్పవారు అనాథలుగా మిగులుతున్నారు. ఇది ఆగిపోవాలి.


అపోహలు, ఆందోళనల వల్లే సమస్యలు - కొండల్‌రావు, డీఎంహెచ్‌వో

రోజురోజుకూ అపోహలు, ఆందోళన లు ఎక్కువై అంతా భయపడు తున్నారు. దీనికి సోషల్‌ మీడియా లో వచ్చే వైరల్‌ మెసేజ్‌లు తోడ య్యాయి. పాజిటివ్‌గా ఆలోచిస్తే అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నెగటివ్‌గా చూస్తే ప్రతీ చిన్న విషయం భూతంలా కనిపిస్తుం ది. కరోనా కూడా అంతే. కరోనా వచ్చిన వారు 95శాతం మంది కోలుకుంటున్నారు. 5శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అందులో 3 శాతం రికవరీ ఉండగా, 2శాతం మంది మాత్రమే మృతిచెందుతున్నారు. అది కూడా గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వంటి ఇతర సమస్యలు ఉన్నవారే. వైరస్‌ వచ్చే ది, పొయ్యేది మనకు తెలియదు. దాని గురించి గాబరా పడొద్దు. కరో నా నుంచి బయటపడిన వారితో  మనం స్ఫూర్తి పొందాలి. మంచి నిద్ర, పౌష్ఠికాహారం, వేడి నీళ్ల ఆవిరి, గోరువెచ్చని నీళ్లు తాగడం, భౌతిక దూరం, శానిటైజేషన్‌ ఇవన్నీ వైరస్‌ నిరోధకాలే. లక్షణాలు లేకపోయినా ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగి, ఉన్నదంతా పోగొట్టుకోవడం మన ఆందోళన వల్లే.


Advertisement
Advertisement