కరోనా టు టీకా

ABN , First Publish Date - 2021-03-01T07:26:57+05:30 IST

గజగజ వణికించిన మహమ్మారి.. ఈ సంవత్సర కాలంలో అనేక రంగాలను చిన్నాభిన్నం చేసింది.

కరోనా టు టీకా

2.3.2020 1.3.2021

నగరంలో కరోనా కేసు వెలుగు చూసి ఏడాది 

కావొస్తుంది. అప్పట్లో కొన్ని నెలలు నగరాన్ని 

గజగజ వణికించిన మహమ్మారి.. ఈ సంవత్సర కాలంలో అనేక రంగాలను చిన్నాభిన్నం చేసింది. దైనందిన జీవి తంలో ఎన్నో కొత్త మార్పులకు కారణం అయింది. ఇక కరోనా లేదు.. గిరోనా లేదు అని ప్రజానీకం రిలాక్స్‌ అయిపోతున్నంతలో.. మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో భయం కూడా మొదలైంది. మరో వైపు మలిదశ వ్యాక్సినేషన్‌కి సర్వం సన్నద్ధం అయింది. గత ఏడాది ఇదే నెల రెండో తేదీన నగరంలో తొలి కరోనా కేసు పడగ విప్పి భయకంపితులను చేసింది. ఈ ఏడాది అదే నెల.. ఒక రోజు ముందు మలిదశ వ్యాక్సినేషన్‌ యజ్ఞం జరగనుండడం విశేషం. అటు కరోనా.. ఇటు టీకాలు.. మధ్యలో దైనందిన జీవితం.. ఇంకా ఎన్ని పరిణామాలు సంభవించనున్నాయో అన్న ఆందోళన సర్వత్రా ఉంది. 

ఫీజుల మోత.. ట్రాన్స్‌పోర్టు వాత

ఆందోళనలో ప్రైవేట్‌ విద్యార్థుల తల్లిదండ్రులు

గతంలో పది మంది చొప్పున  చేరవేత

ప్రస్తుతం ముగ్గురు, నలుగురు మాత్రమే

రేట్లు పెంచిన ఆటోడ్రైవర్లు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): నగరంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా మారింది. పెరిగిన రవాణా చార్జీలు, విద్యాసంస్థల బలవంతపు ఫీజుల వసూళ్లతో వారు బెంబేలెత్తిపోతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేట్‌ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


జీఓ 46 హుష్‌కాకి..

కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి కేవలం నెలవారీ ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలని గత ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీఓ 46ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఫీజు మొత్తాన్ని  కాకుండా కేవలం ట్యూషన్‌ ఫీజు తీసుకోవాలని సూచించింది. దీంతో తల్లిదండ్రులపై ఆర్థికభారం తగ్గుతుందని స్పష్టం చేసింది. నగరంలోని ప్రైవేట్‌ పాఠశాలలు ఈ జీఓను పక్కకు పెట్టి  ఫీజు మొ త్తాన్ని వసూలు చేస్తున్నాయి. గతంలో కొన్ని పాఠశాలలు నెలవారీ ఫీజు మాత్రమే తీసుకోగా,  6 నుంచి 10 తరగతులకు ప్రత్యక్ష బోధనలు ప్రారంభం కావడంతో మొత్తం ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. పూర్తి ఫీజు ఇవ్వకుంటే పై తరగతికి ప్రమోట్‌ చేయబోమని గట్టిగా చెబుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. 


భారంగా రవాణా చార్జీలు..

 గతంలో ఓ పాఠశాలకు చెందిన 10 నుంచి 15 మంది విద్యార్థులు ఆటో, ఓమ్నీ, టాటా ఏసీ వాహనాల్లో పాఠ శాలలకు వెళ్లి, వచ్చేవారు. ఇందుకోసం ఒక్కొక్కరు నెలకు  రూ. 500 నుంచి 800 వరకు చెల్లించేవారు. కరోనా నేపథ్యంలో  ఆటోవాలాలు ముగ్గురు, నలుగురిని మాత్రమే తీసుకెళ్తుండడంతో ఒక్కో విద్యార్థిపై రెండింతల భారం అధికంగా పడుతోంది. గతంలో రూ.500 చెల్లించిన వారు ప్రస్తుతం 1,200 వరకు చెల్లించాల్సి వస్తోంది. పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ చార్జీల కారణంగానే రవాణా చార్జీలు పెంచాల్సి వస్తోందని డ్రైవర్లు చెబుతున్నారు.


రూ.2 వేలు అడుగుతున్నారు

నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు 5, మరొకరు 6వ తరగతి. కరోనాకు ముందు ఇద్దరినీ ఒకే ఆటోలో స్కూల్‌కు పంపించి, ప్రతి నెలా రూ. 2వేలు ఇచ్చేవాడిని. ఇప్పుడు ఒక్కొక్కరికి రూ. 2వేలు అడుగుతున్నారు. ఇదేమని అడిగితే కరోనాతో ఆటోలో నలుగురిని మాత్రమే తీసుకెళ్తున్నామని, అందుకే రేట్లు పెంచామని చెబుతున్నారు. మూడు నెలల తరగతులకు ఫీజులు, రవాణా చార్జీలు మోయలేని భారంగా మారాయి. 

సంతో్‌షకుమార్‌, విద్యార్థి తండ్రి, మోతీనగర్‌



ఉపాధ్యాయుల లాంగ్‌లీవ్‌..!

ఉపాధ్యాయులకు కరోనా భయం పట్టుకుంది. మహమ్మారి కారణంగా గతంలో 12 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మృతిచెందినట్లు తెలిసింది. దాదాపు 200 మంది వరకు కరోనా బారిన పడి కోలుకున్నట్లు సమాచారం. కాగా, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ప్రధానంగా 55 ఏళ్లకు పైబడిన ఎస్‌జీటీల్లో కొందరు బడికి వెళ్లేందుకు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. వార్షిక పరీక్షలు జరిగే వరకు లాంగ్‌లీవ్‌ పెట్టుకుని ఇంటివద్ద ఉండేందుకు నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు విద్యాశాఖాధికారులకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు సమాచారం.

Updated Date - 2021-03-01T07:26:57+05:30 IST