కరోనా: ఒక బహుళార్థక సన్నివేశం

ABN , First Publish Date - 2020-03-19T08:54:28+05:30 IST

అపొకలిప్స్‌ అని ఏదో నోరుతిరగని ప్రమాదాన్ని పిల్లలు చెప్పుకుంటున్నారు కానీ, నిజంగా ఇది ప్రళయమంత పెద్దదా? గత్తర అంత చిన్నదా? అంతా గడచి పోయాక లెక్కలు చూసుకోవచ్చును కానీ, ఈ వేదన లెక్కలు మాత్రమే కాదు. అట్లాగని, ఈ కల్లోలం...

కరోనా: ఒక బహుళార్థక సన్నివేశం

కరోనా కల్పిస్తున్న సన్నివేశాలు అనేకం. మానసిక దగ్గరితనం పెంచుకుంటూ, భౌతికమయిన జాగ్రత్తలు తీసుకుంటే గండం గట్టెక్కుతాం. మానవత్వాన్ని పెంచుకోవడానికి, ప్రళయభయంలోనైనా పరస్పర ద్వేషాన్ని వదులుకోవడానికి ఒక కరోనా ఒక అవకాశం.


కొత్తకొత్తగా వస్తున్న జబ్బులకు, పరిచయం అవుతున్న క్రిములకు వెనుక ఏవో కుట్రలున్నాయన్న అనుమానం కూడా ఆధారరహితమైనది కాదు. క్రిముల సహాయంతో మనుషులను చంపాలని, యుద్ధంలో గెలవాలని అనుకునే దేశాలున్నాయి, పాలకులున్నారు. మనుషులను పెద్ద సంఖ్యలో చంపడానికి అణుమారణాయుధాలను తయారుచేయడానికి మనుషులే పరిశోధనలు చేస్తారు. జన్యుపరిశోధనలతో అధికఫలసాయం, అధిక మాంసం ఉత్పత్తి సాధించాలని అనైతిక శోధనలు చేస్తారు. అటువంటి దుర్మార్గాల నుంచి పుట్టినదేనా ఈ కరోనా? కరోనా కుట్ర కావచ్చు, సహజమూ కావచ్చు. మానవ ప్రయాణం మొత్తంగా తక్కిన జీవవ్యవస్థతో వ్యవహరిస్తున్న తీరుకు ఎదురయ్యే ప్రతిక్రియల్లో ఒకటి కావచ్చు.


ఊపిరితిత్తులు మంచుపలక వలె పగుళ్ళిచ్చాయి

వేడి ఆవిరిలాగా నాళాల్లో శ్వాస కూతపెట్టింది

(ఆంథోనీ టావో: కరొనావైరస్‌ ఇన్‌ చైనా)

అపొకలిప్స్‌ అని ఏదో నోరుతిరగని ప్రమాదాన్ని పిల్లలు చెప్పుకుంటున్నారు కానీ, నిజంగా ఇది ప్రళయమంత పెద్దదా? గత్తర అంత చిన్నదా? అంతా గడచి పోయాక లెక్కలు చూసుకోవచ్చును కానీ, ఈ వేదన లెక్కలు మాత్రమే కాదు. అట్లాగని, ఈ కల్లోలం అంతా ముసుగులూ శుభ్రాలూ ఆరడుగుల దూరాలూ కానే కాదు. అంతకుమించిన సన్నివేశాలు, దృశ్యాలు, దుస్స్వప్నాలు అనేకం కిరీటపు పొడుపుకొసలలాగా మొలుచుకొస్తున్నాయి . ఈ కరోనా అనేక కొత్తలను ఆవిష్కరించింది. అనేక పాతలకు కొత్త అన్వయాలను ఇచ్చింది. కొత్త భయాలను నేర్పింది. 


కనీసం అది ఒక క్రిమి అయినా కాదు. అర్థక్రిమి. ఒక కణం కూడా కాని, కేవల జీవపదార్థం. అంతటి పరమాణువుకే అన్ని కొమ్ములు. కవచాలన్నిటిని ఛేదించి, కోటను లోపలినుంచి పట్టుకునే యుద్ధవిద్యలు. మన చేతితో మన నోటిలోకి దూరిపోయే చాతుర్యాలు. బలహీనుడిని పట్టుకుని చంపుకుతినే ఎత్తుగడలు. వేల ఏళ్ల మానవ నాగరికత, సభ్యత, వందారెండువందలేళ్ల శాస్త్రసాంకేతిక ప్రగతి, ఇరవయ్యొకటో శతాబ్దపు బడాయి వైజ్ఞానికత అంతా నిరర్ధకమేనా అనిపించేంత మహమ్మారి ఇది. సువిశాల విశ్వంలో పిపీలికాలమో అంతకు వేయిరెట్ల సూక్ష్ములమో అని ఎప్పుడో తెలుసును, వుట్టి గాలివానకు కొట్టుకుపోయే రాబందులాగా ఒక గ్రహశకలానికో, మనమే పంపిన ఉపగ్రహపు శిథిలానికో, ఒక అంటువ్యాధికో, అమ్మతల్లికో, చివరకు అతిసారానికీ, దోమకాటుకీ కూడా వేలకొద్దీ రాలిపోయే, సృష్టి అంతమవుతుందని భయపడే జాతి మనది. అప్రియజ్ఞానాలకు ఆదమరచిన వేళ, మళ్లీ ఇప్పుడిది మనమేమిటో తెలియజెప్పింది..


యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువుని పొగడకూడదు. మనల్ని తక్కువా చేసుకోగూడదు. రణరంగ మధ్యంలో నిర్వేదం కలగడం మనకు కొత్త కాదు. సత్యం పొడుచుకువచ్చి, తత్వం తెలియడమూ కొత్త కాదు. చివరకు మనమే గెలుస్తాం. కరోనాను కడిగేసుకుంటాం. లక్షలాది సమాధులను దాచిపెట్టేసి, విజయపతాకం మనమే ఎగురవేస్తాము. కరోనా మనుషుల మీద చేసిన ప్రయోగంలో లభించిన ఫలితాలు మాత్రం చరిత్రలో మిగిలిపోతాయి. 


మనిషి తన లోకాన్ని తాను ఎంతగా చెడగొట్టాడంటే, మనకూ ఆకాశానికీ మధ్య ఉన్న మేలితెర కూడా చిరిగిపోయేంత. రుతుచక్రం వంకరపోయేంత. భూమి విషమయ్యేంత. అందుకని, ఏ వైపరీత్యం వచ్చినా దేవుణ్ణో, ప్రకృతినో నిందించడానికి లేకుండా పోయింది. తుఫానులు, సునామీలు, భూకంపాలు అన్నిటికీ మానవనేరమేదో కారణమేమో అన్న అనుమానం కలగడంలో ఆశ్చర్యం లేదు. కానీ, స్వయంచాలితమైన చరాచర సృష్టిపై మనిషికి అదుపు వచ్చిందని అనుకోవడం అతిశయమే. ఇంకా మానవ హస్తం లేని వైపరీత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఉంటాయి. అట్లాగే, కొత్తకొత్తగా వస్తున్న జబ్బులకు, పరిచయం అవుతున్న క్రిములకు వెనుక ఏవో కుట్రలున్నాయన్న అనుమానం కూడా ఆధారరహితమైనది కాదు. క్రిముల సహాయంతో మనుషులను చంపాలని, యుద్ధంలో గెలవాలని అనుకునే దేశాలున్నాయి. పాలకులున్నారు. మనుషులను పెద్ద సంఖ్యలో చంపడానికి అణుమారణాయుధాలను తయారుచేయడానికి మనుషులే పరిశోధనలు చేస్తారు. జన్యుపరిశోధనలతో అధికఫలసాయం, అధిక మాంసం ఉత్పత్తి సాధించాలని అనైతిక పరిశోధనలు చేస్తారు. అటువంటి దుర్మార్గాల నుంచి పుట్టినదేనా ఈ కరోనా? కావచ్చు. కాకపోవచ్చు. కానీ, అటువంటి ఆరోపణ చైనా మీద చేయడానికి అమెరికాకు హక్కు లేదు. వియత్నాం ఆకాశం నుంచి విషాన్ని విరజిమ్మిన చరిత్రను ఎవరు మరచిపోతారు. కరోనా కుట్ర కావచ్చు, సహజమూ కావచ్చు. మానవ ప్రయాణం మొత్తంగా తక్కిన జీవవ్యవస్థతో వ్యవహరిస్తున్న తీరుకు ఎదురయ్యే ప్రతిక్రియల్లో ఒకటి కావచ్చు. 


ఈ దుర్మార్గం వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించడంతో ఆగిపోవు కుట్రవాదనలు. కార్పొరేట్ల రుణభారాన్ని, నష్టాల బరువుని మాఫీ చేయడానికి ఇది ఒక ముసుగు అని ఒకరంటారు. ఉద్యమాలను, విప్లవాలను వాయిదా వేయడానికి కల్పించిన మాయ అని మరొకరు అంటారు. ఎదుగుతున్న చైనాను దెబ్బతీయడమే ఇందులో కీలకం అని ఒకరంటే, ప్రపంచపు జనాభాను 30 శాతం తగ్గించే పథకం ఇందులో ఉందని మరొకరు అంటారు. కుట్రలను ఊహించడానికి, కుట్రలుగా భావించడానికి తగినంతగా ఈ ప్రపంచం కుళ్లిపోయి ఉన్నది. తప్పేంలేదు. 


ఈ కల్లోలంలో సైతం గాలిపటాలు ఎగురవేస్తారు కొందరు. గోమూత్రం గురించి, పేడ గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు, వాటికి ఆన్‌లైన్‌లో ధర విపరీతంగా పెరిగిపోయిందట. ఒకే సన్నివేశంలో శుభ్రకారి ద్రావకాలకు, విసర్జకాలకు ప్రపంచంలో డిమాండ్‌ ఎట్లా పెరుగుతుందో అర్థం కాదు. ఆ విషయాలను వదిలేస్తే, ఒక పీఠాధిపతి కరోనా నిరూపించిన భారతీయ సంప్రదాయాన్ని ప్రస్తావించారు. చేతులు జోడించి నమస్కరించడం అనే సంప్రదాయాన్ని ప్రస్తావించడం కాదు, అది సరే. కానీ, మడి దడి అనే వాటిని చాదస్తమని వెక్కిరిస్తారు, కానీ, కరోనా నేపథ్యంలో అదే అవసరమని తేలింది– అని ఆ ఆచార్యుల వారు అన్నారు. ఔరా, అనిపించింది. కరోనా వల్ల ఇన్నిరకాల ఉపయోగాలున్నాయా? అని ఆశ్చర్యపోవాలి మరి. 


ఈ సన్నివేశంలో పుట్టిన ఒక కొత్త మాట. సోషల్‌ డిస్టన్సింగ్‌. అంటే సామాజిక దూరీకరణ అనవచ్చు కృత్రిమానువాదంలో. ఇది ఒక భావనగా భారతీయ సంప్రదాయానికి చిరపరిచితమైనదే అయినప్పటికీ, కరోనా మరీ ఎక్కువ మోతాదులో దాన్ని డిమాండ్‌ చేస్తున్నది. పైగా సార్వత్రికం, సార్వజనీనం చేస్తున్నది. క్వారంటైన్‌ను– ఆరోగ్య నిర్బంధం అనవచ్చు. అది కానీ, నిర్బంధ గృహనివాసం కానీ, సాంస్కృతికంగా జనానికి ఇంకా ఆమోదకరంగా ఉన్నట్టు లేవు. మన దగ్గరే కాదు, ఇరాన్‌లోను, పాకస్థాన్‌లోను, ఇటలీలోను కూడా జనాలు ఆరోగ్యసైనికుల నుంచి పారిపోతున్నారు. తనిఖీలను తప్పించుకోవాలని, జబ్బును దాచిపెట్టాలని చూస్తున్నారు. 1897 నాటి ప్లేగు చట్టాన్ని అవసరార్థం ఉపయోగించుకోవడమే కాదు, ఆ నాటి ప్లేగు అనుభవాలను నేర్చుకోవాలి. ప్రజలకు నచ్చచెప్పి వారి ఒప్పుదల పొందకపోతే, మహమ్మారుల నియంత్రణ అసాధ్యమవుతుంది. స్కూలు, జైలు లాగే, ఆస్పత్రిని కూడా నిర్బంధ వ్యవస్థగా పరిగణించే శాస్త్రవేత్తల వాదనలో వాస్తవముంది. ఆరోగ్యం కూడా విధించేది, అధికారంతో అమలుచేసేది అయినప్పుడు– దాన్ని ప్రజానీకం పరాయిదిగానే చూస్తుంది. సోషల్‌ డిస్టన్సింగ్‌ మానవసున్నితత్వాన్ని భంగపరచకుండా, దానికి లోబడి ఎట్లా తాత్కాలిక వ్యూహంగా అమలుచేయగలమో ఆలోచించాలి, ప్రజల ప్రమేయంతో, వారి సృజనాత్మకతతో. ప్రజలను అణచిపెట్టే సాధనాలతోనే చైనా ఈ వైరస్‌వ్యాప్తిని కూడా నిరోధించిందని ఒకటే ఊదరగొడుతున్నారు. ఇప్పుడు అన్నిదేశాల వారు, మన దేశంతో సహా, అటువంటి విధానాలనే అమలుచేస్తున్నారు. చైనాలో కేవలం నిర్బంధమే కాదు, ఒక సాముదాయికత, స్వచ్ఛంద సహకారమూ కూడా ఉన్నాయి. 


వైరస్‌ చేసే విధ్వంసానికి వ్యవస్థలు, ప్రభుత్వాలు చేసే జోడింపులు ప్రమాదకరమైనవి. కంపెనీల నష్టాలను భర్తీచేయడం కోసమే ఈ ఉపద్రవాన్ని సృష్టించారనడం అతి అవుతుంది కానీ, ఈ సంక్షోభ సమయంలో కావలసిన పని చక్కబెట్టుకునే పెద్దలు ఉంటారు. వైరస్‌ను లెక్కచేయనని చెప్పి, అమెరికన్‌ సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టిన ట్రంప్‌, ఇప్పుడు మరిన్ని బెయిల్‌–అవుట్‌లకు వచ్చిన అవకాశాన్ని గుర్తించి ఉంటారు. అధ్యక్ష ఎన్నికలలో కరోనా ప్యాకేజి రెండు పక్షాలకూ కొత్త ఊతపదం. సోషలిస్టు అని చెప్పుకునే బెర్నీ శాండర్స్‌, మనిషికో రెండువేల డాలర్లు కరోనా ప్యాకేజి కింద ఇస్తానని చెబుతున్నాడు. అన్నట్టు, కరోనా భయంతో ఇప్పుడు అమెరికాలో ఆహారం, సానిటైజర్లు, టిష్యూపేపర్స్‌తో పాటు ఆయుధాలకూ గిరాకీ పెరిగిందట. ముంచుకొస్తున్న మాంద్యం నుంచి రక్షించమని కంపెనీలు భారత్‌లో కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. గొంతులేని ప్రజలు కూడా ఆదుకొమ్మని కోరుతున్నారు. ఏలికలు ఎవరిని రంజింపజేస్తారో చూడాలి. 


కరోనా చాలా మందికి మేలు చేసింది, హానీ చేస్తోంది. ఉద్యమాల వేడి తగ్గకతప్పడం లేదు. అయితే, ఈ ఉపద్రవం మనుషుల మధ్య సాత్వికభావాలను పెంచి, ఆపదలో ఉన్నప్పుడు సహజంగా కలిగే ఐక్యతను పెంచుతోంది. ఇష్టంలేనివారికి అది సమస్యే. ఇంగ్లండ్‌ తమ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నా సరే, దానికి అండగా ఉంటామని ఐరోపా యూనియన్‌ ప్రకటించింది. సాక్షాత్తూ నరేంద్రమోదీ పొరుగుదేశాలతో కలసి కరోనాతో పోరాడాలని అనుకుంటున్నాడు. ఒక్క ట్రంపు మాత్రమే ఇరాన్‌ మీద కనీసం ఆంక్షలను కూడా తగ్గించడం లేదు. 


కరోనా కల్పిస్తున్న సన్నివేశాలు అనేకం. మానసిక దగ్గరితనం పెంచుకుంటూ, భౌతికమయిన జాగ్రత్తలు తీసుకుంటే గండం గట్టెక్కుతాం. మానవత్వాన్ని పెంచుకోవడానికి, ప్రళయభయంలోనైనా పరస్పర ద్వేషాన్ని వదులుకోవడానికి ఒక కరోనా ఒక అవకాశం. 

మాస్కుల వెనుక నుంచి మందహాసం చేశాం

బొమ్మలు ఎగరేసి పలకరించుకున్నాం

మేమింకా ఇక్కడే ఉన్నామని చెప్పడానికి

తలుపులింకా తెరిచే ఉంచాం..

                                       (ఆంథోనీ టావో)


కె. శ్రీనివాస్



Updated Date - 2020-03-19T08:54:28+05:30 IST