మన్యాన్ని కమ్మేసిన కరోనా

ABN , First Publish Date - 2021-05-17T05:58:50+05:30 IST

మన్యాన్ని కరోనా మహమ్మారి కమ్మేసింది. కేవలం 16 రోజుల్లో 28 శాతం తీవ్రత కనబరుస్తోంది. ఏజెన్సీ ఏడు మండలాల్లోని 18 ఆరోగ్య కేంద్రాల పరిధిలో కేసులను పరిశీలిస్తే రంపచోడవరం మండలం పెద గెద్దాడ ఆరోగ్య కేంద్రంలోనే పాజిటివిటీ రేటు 49 శాతంగా నమోదైంది.

మన్యాన్ని కమ్మేసిన కరోనా

రంపచోడవరం, మే 16: మన్యాన్ని కరోనా మహమ్మారి కమ్మేసింది. కేవలం 16 రోజుల్లో 28 శాతం తీవ్రత కనబరుస్తోంది. ఏజెన్సీ ఏడు మండలాల్లోని 18 ఆరోగ్య కేంద్రాల పరిధిలో కేసులను పరిశీలిస్తే రంపచోడవరం మండలం పెద గెద్దాడ ఆరోగ్య కేంద్రంలోనే పాజిటివిటీ రేటు 49 శాతంగా నమోదైంది. తర్వాతి స్థానంలో రాజవొమ్మంగి మండలం లాగరాయి ఆరోగ్య కేంద్రంలో 30 శాతం ఉంది. కొవిడ్‌ మొదటి వేవ్‌లో గిరిజన ప్రాంతానికి మైదాన ప్రాంతం నుంచి రాకపోకలను తీవ్రస్థాయిలో క్రమబద్ధీకరించిన అధికార యంత్రాంగం ఈ మారు కనీసం అడ్డుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇక్కడ 26 మరణాలు నమోదయ్యాయి.
ఇంతకాలం మన్యాన్ని మలేరియా, కాళ్లవాపు వ్యాధులు మాత్రమే పీడించేవి. వాటి తీవ్రత అంతగా లేకపోవడంతో మన్యం వాసులకు ప్రభుత్వ రంగంలోనే మెరుగైన వైద్య సేవలు అందుతూ వచ్చాయి. కాగా కొవిడ్‌ వైరస్‌ గిరిజనుల జీవనాన్ని అస్థిరపరుస్తోంది. కేవలం హైవేలను ఆనుకుని ఉండే ప్రాంతాలు, మండల కేంద్రాలకే పరిమితమైన వైరస్‌ ఇపుడు లోతట్టు గిరిజన గ్రామాలను కూడా పట్టిపీడిస్తోంది. కరోనా మొదటి వేవ్‌ అనుభవాలు, రెండో వేవ్‌ తీవ్రత నేపథ్యంలో లోతట్టు            గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం ఆ దిశగా సరైన చర్యలు చేపట్టలేకపోయింది. దీంతో పాజిటివ్‌ లక్షణాలు వచ్చినా స్వీయ నిర్బంధంలో ఎలా ఉండాలో తెలియట్లేదు. ఒకవేళ పాజిటివ్‌ వచ్చినా ఐసోలేషన్‌లో ఉండాలన్న అవగాహన కలిగిన వారు కూడా కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినా అక్కడ ఉండలేక సతమతమవుతున్నారు.
మరోవైపు ఏడు మండలాలకు కలిపి ఒక్క రంపచోడవరంలో మాత్రమే ఏరియా ఆసుపత్రి వుంది. ఇక్కడ కూడా 100 పడకలకు సరిపడా సామర్థ్యం లేదు. కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరిగినా వారికి తగ్గట్టుగా వైద్య సదుపాయాలు లేవు. ముఖ్యంగా ఆక్సిజడ్‌ బెడ్ల సంఖ్య స్వల్పమే! ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్‌ స్థాయిలు సరిగా లేని బాధితులను హుటాహుటిన రాజమహేంద్రవరమో, కాకినాడకో తరలించి చేతులు దులుపుకుంటున్నారు. తీరా అక్కడకు వెళ్లాక ఆశ్రయం కల్పించే పరిస్థితి లేదు. ఇటీవల ఒక గిరిజన మహిళను రాజమహేంద్రవరం పంపగా సరైన సేవలందకపోవడంతో తిరిగి రంపచోడవరం వచ్చి చికిత్స పొందుతూ మర్నాడే మృతి చెందింది.  
ఇదే తీవ్రత మన్యంలో కొనసాగి పాజిటివిటీ రేటు మరింత పెరిగితే బాధితులకు నిర్దేశించిన స్థాయిలో చికిత్స అందించే పరిస్థితి కరవై నష్టం మరింత పెరుగుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా కలెక్టరు మురళీధర్‌రెడ్డి మన్యంలోని ఏరియా ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇది కార్యరూపం దాల్చితే మన్యానికి కూడా మెరుగైన ఆక్సిజన్‌ సదుపాయం కలుగుతుంది.

Updated Date - 2021-05-17T05:58:50+05:30 IST