బాలికల గురుకులంలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-11-30T08:39:33+05:30 IST

బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 48 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

బాలికల గురుకులంలో కరోనా కలకలం

  • ముత్తంగిలో 47 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలికి
  • పాఠశాలలోనే క్వారంటైన్‌.. నిలకడగా అందరి ఆరోగ్యం 
  • విద్యాసంస్థలను అప్రమత్తం చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
  • పాఠశాలల్లో మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలి
  • నిబంధనల అమలుపై నిర్లక్ష్యం వద్దు: మంత్రి సబిత


సంగారెడ్డి/హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 48 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే బాలికల గురుకులంలో 47 మంది విద్యార్థినులు, ఉపాధ్యాయురాలికి వైరస్‌ సోకింది. ప్రత్యక్ష తరగతులు పునః ప్రారంభమైన తర్వాత ఒకే విద్యాసంస్థలో ఇంత పెద్దమొత్తంలో కేసులు రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా, వసతి గృహంతో కూడుకున్న ముత్తంగి గురుకులంలో 470 మంది విద్యార్థినులు, 26 మంది ఉపాధ్యాయులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ఇటీవల ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఆమెను తల్లిదండ్రులు స్వస్థలమైన ఆదిలాబాద్‌ తీసుకెళ్లి పరీక్ష చేయించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో గురుకులం ప్రిన్సిపల్‌ ఆదివారం 261 మంది విద్యార్థినులు, 17 మంది ఉపాధ్యాయులకు యాంటీజెన్‌ టెస్టులు చేయించారు. 42 మంది విద్యార్థినులు, టీచర్‌కు పాజిటివ్‌ వచ్చింది. వీరిని పాఠశాలలోని హాలులో క్వారంటైన్‌ చేశారు. శాంపిళ్లను ఆర్టీపీసీఆర్‌, జినోమ్‌ పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపించారు. 


మరో 209 మంది విద్యార్థినులు, 16మంది ఉపాధ్యాయులకు సోమవారం పరీక్షలు చేయగా ఐదుగురు విద్యార్థినులకు పాజిటివ్‌ వచ్చింది. వీరిని కూడా ఐసోలేషన్‌లో ఉంచారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ గాయత్రీదేవి సోమవారం పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్యభట్టు సోమవారం పాఠశాలను సందర్శించారు. గురుకుల విద్యా సంస్థల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురుకుల విద్యార్థులను బయటి వ్యక్తులు కలవకుండా ఆదేశాలిచ్చారు. గురుకులాల్లో ఉండి చదువుకుంటున్న పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు ప్రతి వారం వస్తుంటారు. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా వీరిలో ఉంటారు. అయితే, ఇటీవల ఎక్కడో ఒకచోట కరోనా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో వారి రాకతో వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందని భావిస్తూ అధికారులు ఆంక్షలు విధించారు. మరోవైపు రాష్ట్రంలో సోమవారం 33,236 మందికి పరీక్షలు చేయగా.. 184 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో ఒకరు మృతి చెందారు. 


నిర్లక్ష్యం వద్దు: మంత్రి సబిత

కొవిడ్‌ మూడో దశ ముప్పు పొంచి ఉన్న వేళ.. పాఠశాలల్లో వ్యాధి విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో కొవిడ్‌పై ప్రత్యేకంగా ఆమె సమీక్ష నిర్వహించారు. ‘‘విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలి. భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చేయాలి. గురుకుల పాఠశాలలు, వసతి గృహల్లోని విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సబిత సూచించారు. కొన్ని విద్యా సంస్థల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయని, అలాంటి చోట్ల వెంటనే అప్రమత్తమై విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. పాఠశాలల్లో పని చేస్తున్న సిబ్బంది, ఉపాధ్యాయులు టీకా రెండు డోసులూ తీసుకునేలా చూడడం ఆయా విద్యా సంస్థల యాజమాన్యం బాధ్యతని, దీనిపై ఏమాత్రం నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. శానిటైజర్లు, థర్మల్‌ స్ర్కీనింగ్‌ మిషన్లను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు. తెలంగాణ నుంచి సివిల్స్‌కు ఎంపికైన డాక్టర్‌ శ్రీజను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో మంత్రి సబితాను  శ్రీజ కలిశారు.

Updated Date - 2021-11-30T08:39:33+05:30 IST