Advertisement
Advertisement
Abn logo
Advertisement

మోడల్‌ స్కూల్‌లో కరోనా కలకలం

ఆత్మకూర్‌(ఎస్‌), డిసెంబరు 3: సూర్యాపేట జిల్లాలో ఇద్దరు మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు, వంట మనిషికి కరోనా పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ అయింది. ఆత్మకూర్‌(ఎస్‌) మోడల్‌ స్కూల్‌లో 560మంది విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల హాస్టల్‌ భవన సముదాయంలో ఉంటున్న విద్యార్థినుల్లో ఇద్దరు మూడు రోజులుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రిన్సిపాల్‌ భాగ్యలక్ష్మి శుక్రవారం హాస్టల్‌లో ఉన్న 65మంది విద్యార్థినులకు పరీక్షలు చేయించగా; ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చింది. ఇద్దరూ ఇంటర్‌ మొదటి సంవత్సర విద్యార్థినులు కాగా వంట మహిళకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఎంఈవో ధారాసింగ్‌ తెలిపారు. పాజిటివ్‌గా వచ్చిన వారిని వారి ఇళ్లకు పంపించి, హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా పాఠశాలలోని మిగిలిన విద్యార్థులందరికీ ఈ నెల 4వ తేదీన కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంఈవో దారాసింగ్‌ తెలిపారు.

డీఎంహెచ్‌వో కాంటాక్టులకు కరోనా నిర్ధారణ పరీక్షలు

పేట డీఎంహెచ్‌వో కోటాచలం అల్లుడి ఆస్పత్రి సిబ్బందికి నెగటివ్‌

తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కోట చలం సహా ఆరుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డీఎంహెచ్‌వో, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న ప్రైమరీ కాంటాక్టులకు శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 1వ తేదీన జిల్లా కేంద్రంలోని ఎయిడ్స్‌ నివారణ దినంలో డీఎంహెచ్‌వోతో కలిసి పాల్గొన్న సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఎవరికీ ఎలాంటి లక్షణాలు లేవని, అందరికీ నెగటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. డీఎంహెచ్‌వో అల్లుడికి తిరుమలగిరిలో ప్రజానర్సింగ్‌ హోం ఉండడంతో, అందులో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు 12 మందికి పరీక్షలు చేయగా, అందరికీ నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందుజాగ్రత్తగా అందరూ హోంక్వారంటైన్‌లో ఉండాలని తిరుమలగిరి పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రశాంత్‌బాబు వారికి సూచించారు. అదేవిధంగా కోట చలం ఉంటున్న ఇంటితోపాటు, ఆ చుట్టుపక్కల ఇళ్లు, వీధులను తిరుమలగిరి మునిసిపల్‌ కమిషనర్‌ దండు శ్రీను ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయించి, బ్లీచింగ్‌ చల్లారు.

Advertisement
Advertisement