చెట్టు దిగని అరటి

ABN , First Publish Date - 2020-04-08T09:32:49+05:30 IST

అరటి రైతులకు కరోనా ఊహించని కష్టాలను మిగిల్చింది. అటు అమ్మడానికీ లేదు..

చెట్టు దిగని అరటి

పొలంలోనే మాగిపోతున్న పంట.. రూ.లక్షల పెట్టుబడి మట్టిపాలు 

లాక్‌డౌన్‌తో స్తంభించిన రవాణా 

టన్ను 3,500కు పడిపోయిన ధర 

ఈ రేటుకు అమ్మితే 1,250 కోట్లు నష్టం 

అయినా కొనేవారు లేక అవస్థలు 

దిగుబడి బాగున్నా.. అమ్మకాలు నిల్‌ 

కన్నీటి సుడిలో అరటి రైతులు

ఉత్తరాదికి అరటి, మామిడి ఎగుమతికి కృషి

‘కరోనా’ కట్టడికి కేంద్రంతో సమన్వయం

నిధులు, నిత్యావసరాలపై నిత్యం సంప్రదింపులు

ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ వెల్లడి



కడప, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): అరటి రైతులకు కరోనా ఊహించని కష్టాలను మిగిల్చింది. అటు అమ్మడానికీ లేదు.. ఇటు కోయడానికీ లేదు అన్నట్టుగా తయారైంది వీరి పరిస్థితి. దిగుబడిని చెట్టుపైనే వదిలేద్దామంటే పక్వానికి వచ్చిన పంట మాగి కుళ్లిపోతుంది. మరో వారం, పది రోజులు గడిస్తే ఒక్క గెల కూడా చేతికొచ్చే అవకాశం లేదని, లక్షల పెట్టుబడి కళ్లముందే మట్టిపాలవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలో రూ.15వేల వరకూ పలకాల్సిన టన్ను అరటి... రవాణా లేక రూ.3,500 కూడా పలకడం లేదు. ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖలు రవాణా సౌకర్యం కల్పిస్తున్నా అది అరకొరే.


సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో అరటి రైతులను కదిపితే కన్నీటి సుడులే. అరటి సాగుకు ఈ జిల్లా ప్రసిద్ధి. ఇక్కడ పండించిన పంట ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌, గుజరాత్‌, బెంగళూరు వంటి ప్రాంతాలకు రవాణా చేస్తారు. లాక్‌డౌన్‌ కారణంగా లారీలు నిలిచిపోయాయి. రవాణా స్తంభించడంతో పంట కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ధర వచ్చినప్పుడు కోద్దామనుకున్నా పక్వానికి వచ్చిన కాయ చెట్టుపైనే మాగి కుళ్లిపోతోంది. దీంతో ఏం చేయాలో తెలీక రైతులు దిక్కులు చూస్తున్నారు. 


12లక్షల టన్నులు పొలాల్లోనే

జిల్లాలో 20వేల హెక్టార్లలో అరటి సాగు చేశారు. హెక్టారుకు సగటున 60- 62 టన్నుల దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఈ లెక్కన సరాసరి 12లక్షల టన్నుల దిగుబడి పొలాల్లోనే ఉండిపోయింది. ప్రస్తుతం టన్ను అరటి రూ.13,500- రూ.15వేలు పలకాలి. కరోనా కారణంగా రూ.3,500 మించడం లేదు. ‘‘ఆ ధరకే ఇచ్చేస్తాం, కొనండి మహాప్రభో’’ అంటున్నా కొనేవారు కరువయ్యారు.


కొనుగోలు చేసిన పంటను రవాణా ఎలా చేయాలంటూ వ్యాపారులు ముందుకు రావడంలేదు. ‘హాలికునికి హాహాకారాలు..’ శీర్షికన అరటి రైతుల కష్టాలను మార్చి 24న ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. స్పందించిన సీఎం జగన్‌ ఉద్యాన పంటల రవాణాకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అంతేకాకుండా వ్యాపారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు రవాణా చేస్తే కి.మీ.కు రూ.55 రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు కేవలం 24వేల టన్నులు మించి రవాణా చేయలేని పరిస్థితి. రూ.3,500 ప్రకారం అమ్మినా టన్నుకు రూ.10వేలు చొప్పున రూ.1,250కోట్లకు పైగా అరటి రైతు నష్టపోయే పరిస్థితి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


పశుగ్రాసంగా గెలలు 

పక్వానికి వచ్చి మాగిపోతున్న పంట రవాణా చేసేందుకు పనికిరాకుండా ఉండటంతో అక్కడక్కడా పశువులకు ఆహారంగా పడేస్తున్నారు. లింగాల మండలం చిన్నకుడాల గ్రామానికి చెందిన చలమారెడ్డి ఆరెకరాల్లో అరటి సాగు చేశారు. పంట పక్వానికి వచ్చింది. కొనేవారు లేకపోవడం, చెట్టుపైన గెలలు మాగిపోతుండటంతో 200 గెలలు కోసి గేదెలకు పశుగ్రాసంగా వదిలేశారు. ఇలాంటి రైతులు ఎందరో.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యాపారులతో నిమిత్తం లేకుండా ఉద్యానవన శాఖ, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో టన్ను కనీసం రూ.8- 10వేలకు కొనుగోలు చేసి ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అరటి రైతులు వేదన చెందుతున్నారు. 


చెట్టుపైనే కుళ్లిపోతోంది..  ఎరికల ఓబుల్‌రెడ్డి, అరటి రైతు, 

బోరుబావి కింద 2ఎకరాల్లో అరటి సాగుచేశాం. రూ.2.50 లక్షలు పెట్టుబడి పెట్టాము. పంట పక్వానికి వచ్చింది. కోసి అమ్ముదామంటే కరోనా వల్ల రవాణా లేక వ్యాపారులు ముందుకు రావడం లేదు. పక్వానికి వచ్చిన గెలలు పొలంలో చెట్టుపైనే మాగి కుళ్లిపోతుంటే కన్నీళ్లు ఆగడంలేదు. టన్ను రూ.3,500కు అమ్మితే పెట్టుబడి కొంతయినా చేతికొస్తుందని ఆశిస్తే కొనేవారే లేరు. 


ప్రభుత్వమే కొనుగోలు చేయాలి .. షేక్షావలి, అరటి రైతు

ఐదు ఎకరాల్లో అరటి సాగు కోసం రూ.8లక్షలు పెట్టుబడి పెట్టాం. గెలలు బాగా వచ్చాయి. కష్టాలు తీరుతాయనుకున్నాం. మా ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. ఇప్పటికే పక్వానికి వచ్చిన గెలలు చెట్లపైనే మాగిపోతున్నాయి. ఆ పంట రవాణాకు పనికిరాదు. మరో పది రోజులు గడిస్తే ఒక్క గెల కూడా అమ్ముకోలేం. పెట్టుబడి మొత్తం మట్టిపాలవుతోంది. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకోవాలి. 


Updated Date - 2020-04-08T09:32:49+05:30 IST