కార్మిక రంగానికి కరోనా కాటు

ABN , First Publish Date - 2020-04-09T11:09:31+05:30 IST

కరోనా మహమ్మారి వివిధ కార్మిక రంగాలపై ప్రభావం చూపుతోంది. నిత్యం జిల్లా కేంద్రంలోని అడ్డా కూలీల ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. కార్మికులు వచ్చినా పనికి పిలిచేవారు

కార్మిక రంగానికి కరోనా కాటు

ఆగిపోయిన పనులు

ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల కార్మికులు

వెలవెలబోతున్న కూలీల అడ్డాలు.. ఉపాధి హామీ పనులు


కామారెడ్డి, ఏప్రిల్‌ 8: కరోనా మహమ్మారి వివిధ కార్మిక రంగాలపై ప్రభావం చూపుతోంది. నిత్యం జిల్లా కేంద్రంలోని అడ్డా కూలీల ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. కార్మికులు వచ్చినా పనికి పిలిచేవారు లేకపోవడంతో దినసరి అడ్డా కూలీలు పనులు లేక ఆందోళన చెందుతున్నారు. అలాగే ఉపాధి హామీ కూలీలు పనులు చేసేందుకు జంకుతున్నారు. వారికి పని కల్పించేందుకు ఉపాధిహామీ సిబ్బంది రావడం లేదు. దీంతో ఉపాధి హామీ కూలీలకు పనిలేక ఇళ్ల పట్టునే ఉంటున్నారు. అదేవిధంగా నిర్మాణ రంగానికి పని ఉండేది. ప్రస్తుతం జిల్లాలో కరోనా నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్‌తో దినసరి కూలీలతో పాటు ఉపాధిహామీ పనులు లేకపోవడంతో ఉపాధిహమీ కూలీలు పనులు లేక ఇండ్లలోనే ఉంటున్నారు.అలాగే నిర్మాణ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది.


భవనాల నిర్మాణం ఆగిపోవడంతో జిల్లాలో పలు రంగాలకు చెందిన సుమారు 80 వేల మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌ విధించడంతో కార్మికులు పనులు చేసేందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వచ్చినా పనులు దోరకడం లేదు.దీంతో అడ్డ కూలీలతో పాటు ఉపాధి హమీ కూలీలు,భవన నిర్మాణకూలీలు పనులు చేసేందుకు సిద్దంగా ఉన్నా ఆయా రంగాల యాజమాన్యాలు పని చేయించుకోవడానికి సిద్ధంగా లేరు.పరస్పరం మీటరు దూరం, బౌతికదూరం పాటించాలన్న నిబంధన అమలు చేయకుంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకే ప్రమాద ముండటమే ఇందుకు కారణం.


కామారెడ్డి జిల్లాలో కార్మికుల దుస్థితి ఇదీ..

జిల్లాలో ప్రధానంగా వ్యవసాయరంగం తరువాత దినసరి అడ్డా కూలీలు, ఉపాధిహామీ కూలీలు, హమాలీ కూలీలు సాధారణంగా భవన నిర్మాణ కార్మికులుగానే సుతారీ మేస్త్రీలు, కూలీలు జ్ఞాపకమొస్తారు. కానీ భవనాల నిర్మాణంపై సెంట్రింగ్‌, కరెంట్‌, ఫ్లంబర్‌, కార్పెంటర్‌, ఫర్నిచర్‌ తదితర పనులు చేసేవారంతా ఆధారపడి ఉన్నారు. జిల్లాలో వివిధ రంగాలకు చెందిన 80వేల మందికి పైగానే ఈ కార్మికులుంటారని అంచనా. జిల్లా కేంద్రమైన కామారెడ్డి ప్రాంతంలోనే 30 వేలకు పైగా వివిధ రంగాల కార్మికులు ఉంటారు.


ఉపాధిహామీ పనులు చేసే కార్మికులు 15 వేలకు పైగా అడ్డా కూలీలు 3వేలకు పైగా, వ్యవసాయ కార్మికులు 13వేలకు పైగా ఉంటారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు  ఇక్కడ సుమారు 6 అపార్ట్‌మెంట్లు, 400 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. 1200  మంది సుతారీ మేస్త్రీలు, కార్మికులు, 600 మంది సెంట్రింగ్‌ కార్మికులు, అదే క్రమంలో ఇతర కార్మికులుంటారు కామారెడ్డి ప్రాంతం వారే కాకుండా బిహార్‌ నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. యూపీ, రాజస్థాన్‌లకు చెందిన ఫర్నిచర్‌ వర్క్‌ కార్మికులుంటారు. వీరిలో సుమారు 300 మంది అడ్డా కార్మికులుగా పని చేస్తున్నారు. వీరి పనులపై కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌ పట్టుకుంది. దీంతో పనులు లేక కార్మికులు ఇళ్లకే పరిమితం అయ్యారు.


ఎక్కడి పనులక్కడే..

కామారెడ్డి జిల్లాలో జనతా కర్ఫ్యూ నాటి నుంచి 16 రోజులుగా మూడు మున్సిపాలిటీలు, 22 మండలాల్లో ఉపాధిహామీ పనులతో పాటు ఇతర పనులు, భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పురోగతిలో ఉన్న నిర్మాణాలకు క్యూరింగ్‌ చేసేవారు సైతం రావడం లేదు. దీంతో చాలా భవనాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. కరోనా ముప్పు ఉపాధిహామీ పనులతో పాటు ఇతర పనులు చేసే దినసరి కార్మికులకు ఏం చేయాలో తోచడం లేదు. కామారెడ్డిలోని జేపీఎన్‌ చౌరస్తాలో గల తాత్కాలిక కార్మికుల అడ్డా 16 రోజులుగా బోసిపోయింది. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 11 గంటల దాకా ఇక్కడ వందలాది మంది గుమిగూడే వారు. ఇప్పుడు 20 మంది వరకు వచ్చినా పనికి పిలిచే వారు లేక పొద్దంతా ఎదురు చూసి ఇంటికి వెనుదురిగి వెళ్తున్నారు.


భవన నిర్మాణ కార్మికులంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఇలా ఎన్ని రోజులు ఉండాలంటూ వారు మేస్ర్తీలను నిలదీస్తున్నారు. తమకు అడ్వాన్స్‌గా నైనా కొంత మొత్తం ఇవ్వాలని కోరుతున్నారు. చేయించుకునే వారేమో కరోనా ప్రభావంతో మాట్లాడించినా డబ్బు ముచ్చట ఎత్తొందంటూ ముందుగానే చెబుతున్నారని మేస్ర్తీలు తెలిపారు. దాంతో కార్మికులకు సముదాయించలేక సతమతమవుతున్నామని ఆంధ్రా మేస్ర్తీలు వాపోతున్నారు. ఉపాధిహామీ పనులు చేపట్టాలని అధికారులు చెబుతున్నా కార్మికులు మాత్రం పనులు చేసేందుకు జంకుతున్నారు.


కరోనా మహమ్మారి ఏ విధంగా వచ్చి కాటు వేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో బస్టాండ్‌లలో పనిచేసే అడ్డా కూలీలకు పని కరువైంది. బస్సులు నడిస్తేనే బస్సులపై సరుకులు వస్తువులు ప్రయాణికులు తీసుకవచ్చేవారు. వారి సరుకులను, వస్తువులను బస్సుల నుంచి దింపితేనే హమాలీ డబ్బులు వచ్చేవి. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి బస్టాండ్‌లలో 80 మందికి పైగా హమాలీలు పని చేసేవారు. వారికి ఉపాధి కరువైంది. ఉపాధి కోల్పోవడంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని హమాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమ ఉపాధి కరువైందని వాపోతున్నారు.


15 రోజుల నుంచి పస్తులుంటున్నాం..నర్సింలు, అడ్డా కూలీ, సరంపల్లి

జనతా కర్ఫ్యూ తర్వాత ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అందరికి కరోనా వైరస్‌ భయం చుట్టుకున్నది. పనిచేస్తామన్నా చేయించుకునేవారే కరువయ్యారు. గతంలో ఇక్కడ పనులు చేయించే సుతారి కార్మికులే మమ్మల్ని పనులకు తీసుకెళ్లేవారు. లేదా భవనాల యజమానులు ఇటుకలు, ఇసుక మోయడం లాంటి పనులు గుత్తకు చేయించేవారు. ఇపుడు అన్నీ నిలిచిపోవడంతో తిండికి లేని పరిస్థితి ఏర్పడింది.   


పని దొరకడం లేదు..లలిత, ఉపాధిమామీ కూలీ, కామారెడ్డి

కామారెడ్డి ప్రాంతంలో ఉపాధిహామీ పనులు సాగడం లేదు. పనులు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఉపాధి పనులు చేయాలన్నా మనస్సు ఒప్పుకోవడం లేదు. కరోనా వ్యాధి వస్తుందని భయంతో కాలం గడుపుతున్నాం. అధికారులు పనులు చేయాలని చెబుతున్నారు. కానీ గ్రామాల్లో పనులు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. గత 16 రోజులుగా ఇళ్లలోనే ఉంటున్నాం. కరోనా వ్యాధి తగ్గితేనే పనులు చేసేందుకు వెళ్లుతాం.

Updated Date - 2020-04-09T11:09:31+05:30 IST