రబీ రైతుపై కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2020-04-02T09:09:16+05:30 IST

ఇటు కరోనా భయం ఒకపక్కయితే, దానినుంచి బయటపడినా చివరకు అప్పులు మింగేస్తాయనే ఆవేదనలో రబీ రైతులున్నారు.

రబీ రైతుపై కరోనా దెబ్బ

మెట్ట పంటలకూ తప్పని తిప్పలు

 మొక్కజొన్న అడిగే నాథుడే లేడు

అరటి చేలోనే పండిపోతోంది

తమలపాకు ఎండిపోతోంది


తెనాలి, ఏప్రిల్‌ 1: (ఆంధ్రజ్యోతి): ఇటు కరోనా భయం ఒకపక్కయితే, దానినుంచి బయటపడినా చివరకు అప్పులు మింగేస్తాయనే ఆవేదనలో రబీ రైతులున్నారు. ప్రస్తుతం కృష్ణా పశ్చిమ డెల్టాలో రబీ పంట చేతికందివచ్చింది. మొక్కజొన్న, జొన్న పంటలు సాగుచేస్తే, ఇవి రెండూ కోతకు వచ్చాయి. అయితే వచ్చిన సమస్యల్లా వీటిని కొనే నాథుడే లేకుండాపోయాడు. అందరు రైతుల పంట ఒకేసారి ఉంచాల్సి రావటంతో గోదాములూ ఖాళీ లేని పరిస్థితి. మరోపక్క కృష్ణా నదీతీరంలోని లంకగ్రామాల్లో అరటి, పసుపు, తమలపాకు వంటి పంటలు కోతదశలో ఉన్నాయి. వీటికీ మార్కెట్‌ లేకపోవటం, అధికారులు ప్రత్యామ్నాయాలపై ఆలోచించే పరిస్థితి లేకపోవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  


జొన్న, మొక్కజొన్న చేలల్లోనే..

కృష్ణా పశ్చిమ డెల్టాలో 4.73లక్షల ఎకరాల్లో వరి పూర్తయ్యాక రబీ కింద మొక్కజొన్న, జొన్న పంటలను సాగుచేశారు. వీటిలో కాల్వలకు ఎగువనున్న తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర, కొల్లూరు, వేమూరు, అమృతలూరు వంటి మండలాల్లో మొక్కజొన్న, జొన్న కోతకొచ్చేశాయి. జొన్న కోసేందుకు కూలీలు లేకపోవటం, మొక్కజొన్నకూ ఇదే పరిస్థితి ఏర్పడటం, యంత్రాలు కూడా తక్కువగా ఉండటం, ఉన్న కొద్దిపాటి యంత్రాలు కూడా ఎకరాకు రూ. 3వేల నుంచి రూ. 4,500 వరకు అడుగుతుండటంతో మొక్కజొన్న రైతులైతే పంటను చేలల్లోనే వదిలేశారు. జొన్న మాత్రం మంచుకు నల్లబడిపోవటం, బంక ఏర్పడి రంగు మారుతుండటంతో రైతులు కోత కోసేస్తున్నారు. అయితే వీటిని చేలల్లో ఆరబెట్టటం, గోతాలకెత్తినా చేలల్లోనే కాపలా ఉండటం మినహా చేసేదిలేక ఎదురుచూపులు చూస్తున్నారు.


చేలోనే పండుతున్న అరటి

మెట్టచేలల్లోని వాణిజ్య పంటల్లో అరటిపంట ప్రస్తుతం కోతకు వచ్చింది. అరటి, చక్కరకేళి వంటి తోటలు డెల్టాలో ఉంటే, వాటిని కూడా కొనేవారు కరువయ్యారు. కరోనా సమస్యతో లాక్‌డౌన్‌ ప్రకటించటంతో కోల్‌కతా వంటిచోటకే కాకుండా, స్థానికంగా ఉండే విజయవాడ, గుంటూరు వంటి మార్కెట్‌లకు కూడా పంపలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు కరోనా సమస్య రావటానికి ముందు అరటి, చక్కరకేళికి ధరే లేదు. ప్రస్తుతం గెల రూ. 150నుంచి రూ. 200పైన పలుకుతుంటే, ఈ తరుణంలోనూ అమ్ముకునే పరిస్థితిలేకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జొన్న, మొక్కజొన్న లాగా ఎండబెట్టి దాచుకునే అవకాశం లేని పచ్చి సరకు కావటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అరటితోపాటు తమలపాకు కూడా కొల్లూరు, కొల్లిపర, భట్టిప్రోలు, పొన్నూరు మండలాల్లో సాగవుతోంది. ఇదికూడా ఎగుమతులు లేక, ఢిల్లీ, కోల్‌కతా, కర్నాటక వంటి రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటం, స్థానిక మార్కెట్‌లో అంతగా అవసరాలు లేకపోవటంతో తమలపాకు కొయ్యకుండానే పండిపోతోంది. పసుపు మాత్రం రైతులు వంట వండి కల్లాలపై ఆరబోసి ఎండబెడుతున్నారు.


పచ్చి సరకుకు తహసీల్దారు అనుమతిలేఖతో రవాణాచేసుకునే అవకాశం ఉన్నా, రైతులు సాహసించలేకపోతున్నారు. దీనికి రవాణాచేసే వాహనాలను ఎక్కడికక్కడే ఆపేస్తుండటంతో వాహనదారులు రైతులపైనే భారం వేస్తున్నారు. ప్రస్తుతం చేతికందివచ్చిన జొన్న, మొక్కజొన్నను దాచుకునేందుకు గోదాములు కల్పించటం కానీ, లేకుంటే మార్క్‌ఫెడ్‌ ద్వారాకానీ కొనుగోలు చేయించేందుకు అనుమతినివ్వటంకానీ చేస్తేనే మేలు జరిగేది. దీనితోపాటే అరటి, తమలపాకు వంటి పంచి పంటలకు కూడ ప్రత్యామ్నాయాన్ని చూపాలని రైతులు వేడుకుంటున్న పరిస్థితి.


Updated Date - 2020-04-02T09:09:16+05:30 IST