మామిడికి కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2021-05-15T05:56:01+05:30 IST

మామిడి దిగుబడి ఈ ఏడాది ఆశాజనకంగా లేదు.

మామిడికి కరోనా దెబ్బ

ఆశాజనంగా లేని దిగుబడి

గిట్టుబాటు ధరా ప్రశ్నార్థకమే

ఆందోళనలో రైతులు


చిత్తూరు (సెంట్రల్‌), మే 14: మామిడి దిగుబడి ఈ ఏడాది ఆశాజనకంగా లేదు. మరోవైపు కరోనా కారణంగా మార్కెటింగ్‌ రంగం కుదేలవడంతో చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దాంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 1.12 లక్షల హెక్టార్లలో రైతులు మామిడి పంట సాగు చేశారు. ఎక్కువగా.. తోతాపురి, కాలేపాడు, బంగినపల్లి, సింధూరా, ఖాదర్‌, పుల్లూరా, మల్గూబ, మల్లికా, అత్తిరసం, నీలం, బేనీషా వంటి రకాలు సాగులో ఉన్నాయి. ఎకరాకు ఏకంగా రూ.50వేల నుంచి రూ.75 వేల వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడి ఏడు నుంచి పది టన్నుల వరకు వస్తుందని రైతులు భావించారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించాయని, దిగుబడి బాగుంటుందని ఉద్యానశాఖ అధికారులు కూడా అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. పూత దశలో తేనె మంచు పురుగు, కాయ దశలో తొటిమి తొలిచే పురుగులు ఆశించడం వంటి పరిణామాలతో దిగుబడి తగ్గింది. ఎకరాకు నాలుగు నుంచి ఏడు టన్నుల వరకు రావచ్చని రైతులు అంచనా వేస్తున్నారు. సోమవారం నుంచి కోతలు కూడా ఊపందుకోనున్నాయి. 


ధరలపైనే ఆందోళనంతా..

ధరలపైనే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది దిగుబడి తగ్గినా గిట్టుబాటు ధరతో లాభాలొచ్చాయి. తోతాపురి, పుల్లూరా, ఖాదర్‌ రకాలు టన్ను ధర రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పలికింది. ఒకానొక దశలో టన్నుకు రూ.50వేల సైతం వచ్చింది. ఈ ఏడాది అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఆశించిన స్థాయిలో పంట చేతికి రాకపోగా.. కరోనా కారణంగా మార్కెటింగ్‌ లేకపోవడంతో ధరలు భారీగా పతనమయ్యాయి. తోతాపురి, పుల్లూరా, ఖాదర్‌ రకాలకైతే టన్నుకు రూ.7వేల నుంచి రూ.12వేల ధర పలుకుతుండగా, మల్గూబా, అత్తిరసం, నీలం, కాలేపాడు, బేనీషా మల్లికా, ఖాదర్‌, సింధూరా ధర సైతం టన్నుకు రూ.20వేల వరకు మాత్రమే ఉంది. గరిష్ఠంగా టన్నుకు రూ.26వేలు పలుకుతోంది. 


పల్ప్‌ ఫ్యాక్టరీలున్నా.. 

జిల్లాలో 60 నుంచి 65 వరకు పల్ప్‌ ఫ్యాక్టరీలున్నాయి. ప్రస్తుతం సుమారు 30 ఫ్యాక్టరీలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇది కూడా రైతులకు నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటికే 10 నుంచి 15 శాతం పంట చేతికి వచ్చింది. ఈ నెలాఖరుకు మరో 25 శాతం పంట కోసేయాలి. జూన్‌ 15 వరకు మరో 40 శాతం, జూలై మొదటి వారంలో మిగిలిన పంట చేతికి రానుంది. కరోనా సమయంలో వ్యవసాయ ఉత్పత్తులు, అమ్మకాలకు ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వాలు చెబుతోంది. అయితే మామిడి అమ్మకాలకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో రైతులు నష్టపోయేందుకే ఎక్కువగా అవకాశం ఉంది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులతోపాటు, ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖ అధికారులు మామిడికి గిట్టుబాటు ధర కల్పించేలా తగిన చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-05-15T05:56:01+05:30 IST