ఆర్టీసీ కుదేల్‌

ABN , First Publish Date - 2020-08-13T11:16:00+05:30 IST

కరోనా మహమ్మారి...ప్రజా రవాణా శాఖ (పీటీడీ)ను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.

ఆర్టీసీ కుదేల్‌

ప్రజా రవాణా శాఖ (పీటీడీ)కు కరోనా దెబ్బ 

లాక్‌డౌన్‌లో రెండు నెలలపాటు డిపోలకే పరిమితమైన బస్సులు

నిబంధనల సడలింపుతో కొన్ని రూట్లలో బస్సుల నిర్వహణ

ఓఆర్‌ పెరగడంతో మరిన్ని సర్వీసులు పెంపు

గత నెల నుంచి వైరస్‌ విజృంభించడంతో తగ్గిపోయిన ప్రయాణికులు

ఓఆర్‌తోపాటు ఆదాయంపైనా ప్రభావం

దశలవారీగా సర్వీసులను తగ్గిస్తున్న యాజమాన్యం

ప్రస్తుతం 36 శాతం ఓఆర్‌తో రూ.13 లక్షల రోజువారీ ఆదాయం

డీజిల్‌ ఖర్చులు కూడా రాని పరిస్థితి!


ద్వారకా బస్‌స్టేషన్‌, ఆగస్టు 12: కరోనా మహమ్మారి...ప్రజా రవాణా శాఖ (పీటీడీ)ను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. పీకల్లోతు ఆర్థిక న(క)ష్టాల్లో వున్న పీటీడీ పరిస్థితిని మరింత దిగజార్చింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తరువాత నడుపుతున్న కొద్దిపాటి సర్వీసులకు కూడా ప్రయాణికుల నుంచి ఆదరణ లేకపోవడంతో కనీసం డీజిల్‌ ఖర్చులు సైతం రాని పరిస్థితి నెలకొంది.


కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి చివరి వారం నుంచి లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించేంత వరకు...అంటే సుమారు 60 రోజులు విశాఖ రీజియన్‌లోని 1,064 బస్సులు ఆయా డిపోలకే పరిమితమయ్యాయి. మే 21వ తేదీన లాక్‌డౌన్‌ 3.0 ప్రకటించడంతో ప్రజా రవాణా శాఖ బస్సులు నడపడానికి అనుమతి లభించింది. మొదటిరోజున రీజియన్‌లో ఎంపిక చేసిన 20 రూట్లలో (డిపో టు డిపో) 112 సర్వీసులు ఆపరేట్‌ చేశారు. కొవిడ్‌ నిబంధనల మేరకు బస్సుల్లో 50 శాతం సీటింగ్‌కు మించకుండా నడిపారు. మరుసటి రోజుప్రయాణికుల రద్దీ కొద్దిగా పెరగడంతో అవే రూట్లలో 122 సర్వీసులు ఆపరేట్‌ చేశారు. జూన్‌ పదో తేదీ వరకు అదే పరిస్థితి కొనసాగింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) 40 శాతం నుంచి 46 శాతం వరకు నమోదయ్యింది. రోజువారీ సగటు ఆదాయం రూ.20 లక్షలు వచ్చింది.


ప్రయాణికుల రాకపోకలు మరింత పెరగడంతో జూన్‌ 11 నుంచి మరో 20 రూట్లు పెంచారు. మొత్తం 40 రూట్లలో రోజుకు 8 నుంచి 10 బస్సుల చొప్పున పెంచుకుంటూ ఆ నెలాఖరు నాటికి 250 బస్సులను ఆపరేషన్‌లోకి తెచ్చారు. ఇదే సమయంలో విజయవాడ, భీమవరం, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, శ్రీశైలం, శ్రీకాకుళం, విజయనగరం వంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పెరగడంతో ఆయా రూట్లలో కూడా బస్సు సర్వీసులు పెంచారు. ఈ సమయంలో ఓఆర్‌ 38 శాతం నుంచి 42 శాతం వరకు నమోదయ్యింది. అయితే సర్వీసులు పెంచిన కొద్ది రోజుల్లోనే వైరస్‌ విజృంభించడం, వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండడంతో ప్రజలు ప్రయాణాలను తగ్గించుకున్నారు. దీంతో పెంచిన సర్వీసులకు అనుగుణంగా రోజువారీ సగటు ఆదాయం పెరగకపోగా మరింత తగ్గింది. 122 సర్వీసులు నిర్వహించినప్పుడు రోజువారీ సగటు ఆదాయం రూ.20 లక్షలు వుండగా, సర్వీసులను 250కి పెంచిన తరువాత కూడా రోజువారీ సగటు ఆదాయం రూ.25 లక్షలు మాత్రమే వచ్చింది.


దీంతో సుమారు 50 సర్వీసులను ఆపేశారు. జూలై మొదటి వారంలో 30 రూట్లలో 200 బస్సులు ఆపరేట్‌ చేయగా, ఓఆర్‌ 36 శాతానికి మించలేదు. రోజువారీ ఆదాయం రూ.22 లక్షలు మాత్రమే వచ్చింది. తరువాత ప్రయాణికుల సంఖ్య మరింత తగ్గిపోవడంతో పీటీడీ అధికారులు రోజుకు ఐదు నుంచి ఏడు వరకు సర్వీసులు తగ్గిస్తూ వచ్చారు. జూలై నెలాఖరు నాటికి ఈ సంఖ్యను 130కి తగ్గించి, 25 రూట్లకే పరిమితం చేశారు. ఓఆర్‌ 36 శాతంతో రోజువారీ సగటు ఆదాయం రూ.15 లక్షలు మాత్రమే వస్తున్నది. ఆగస్టు మొదటి వారం నుంచి అయినా ప్రయాణికుల రాకపోకలు పెరుగుతాయని భావించిన పీటీడీ అధికారుల  అంచనాలు తలకిందుల య్యాయి. ఓఆర్‌ మరింత పడిపోవడంతో బస్సు సర్వీసులను 120కి తగ్గించేశారు. ప్రస్తుతం 36 శాతం ఓఆర్‌తో రోజువారీ రూ.13 లక్షల ఆదాయం వస్తున్నది. దీంతో డీజిల్‌ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది.


డిమాండ్‌ మేరకు బస్సులు కణితి వెంకటరావు,  డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, విశాఖ రీజియన్‌

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచడం లేదా తగ్గించడం చేస్తున్నాం. శ్రావణ మాసంలో ప్రయాణికుల రాకపోకలు పెరుగుతాయని భావించాం. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత పెరగడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. కరోనా వైరస్‌ కట్టడి అయ్యేంత వరకు ఇదే పరిస్థితి వుంటుందని భావిస్తున్నాం. ప్రత్యామ్నాయంగా సరకు రవాణా ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. 

Updated Date - 2020-08-13T11:16:00+05:30 IST