కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2020-07-09T11:59:56+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత జిల్లాలో పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య ..

కరోనా కల్లోలం

 భయంగుప్పిట్లో వికారాబాద్‌ జిల్లా ప్రజలు

ఇతర ప్రాంతాల నుంచి పెరిగిన రాకపోకలు

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ప్రజల్లో కానరాని జాగ్రత్తలు, భౌతికదూరం


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత జిల్లాలో పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా కరోనా మహమ్మారి వ్యాపిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, జిల్లా కేంద్రంలో ఒకరు మరణించారు. ఆ సంఘటన నుంచి తేరుకోక ముందే బుధవారం కూడా జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్‌ పట్టణంలో మరో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది.


తొలి విడతలో పట్టణాలకే పరిమితమైన కరోనా మహమ్మారి ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం జిల్లాలో కరోనా వ్యాప్తి వేగం పుంజుకుంది. కేసులు పెరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా గతంలో మాదిరిగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌లో 38 మందితో నిలిచిపోయిన కోవిడ్‌ కేసులు.. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం మాత్రం కోరలు చాస్తోంది. సడలింపుల అనంతరం 45 రోజుల వ్యవధిలో 75 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. మోమిన్‌పేట్‌ మండలంలో పనిచేస్తున్న ఓ ఏఎన్‌ఎం కరోనా పాజిటివ్‌ బారిన పడగా, రంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి పాజిటివ్‌  రావడం కలకలం రేపుతోంది. 


వంద దాటిన కరోనా కేసుల సంఖ్య

జిల్లాలో ఇంత వరకు 115 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్‌డౌన్‌ సమయంలో ఏప్రిల్‌ 4 నుంచి అదేనెల 19వ తేదీ వరకు 16 రోజుల వ్యవధిలో 38 కరోనా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వారిలో ఒకరు మృతి చెందారు. మే 24 నుంచి జూలై 8వ తేదీ వరకు 46 రోజుల వ్యవధిలో 77 పాజిటివ్‌ కేసులు నమోదై ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 56 మంది డిశ్చార్జి కాగా, 50 మంది ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


ప్రజల్లో కలవరం

జిల్లాలో వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ నియోజక వర్గాల్లో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో ఒకరికి మరొకరికి మధ్య భౌతికదూరం కరువైంది. కరోనా నియంత్రణ చర్యలు సక్రమంగా పాటించడం లేదు. దుకాణాల ఎదుట గుంపులు, గుంపులుగా నిలబడుతున్నారు. కొనుగోలుదారుల కోసం దుకాణాల ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సులను ఎవరూ పట్టించుకోవడం లేదు. పెద్దేముల్‌ మండలం మారేపల్లి గ్రామంలో కరోనా కలవరపెడుతుంది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయనను ఎవరెవరు కలిశారనే విషయంపై చర్చించుకుంటున్నారు. బషీరాబాద్‌లో ఓ కార్యాలయ అధికారికి కరోనా లక్షణాలున్నాయనే భయం అక్కడి  ఉద్యోగులను పట్టిపీడిస్తోంది. దీంతో బుధవారం ఆ కార్యాలయం ఉద్యోగులు కూర్చీలను ఆరుబయటే విధులు నిర్వర్తించడం కలకలం రేపింది.


ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులకు కరోనా?

తాండూరు : తాండూరులో గత రెండు రోజులుగా కరోనా కలకలం రేపుతుంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ప్రజా ప్రతినిధులు, ఒక ఆర్‌ఎంపీ వైద్యుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. అయితే అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. వీరితోపాటు అనేక మంది రాజకీయ ప్రముఖులకు కరోనా సోకినట్లు తాండూరులో పుకార్లు వెలువడటంతో పలువురు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇదిలా ఉండగా, నియోజకవర్గానికి చెందిన ఓ  ప్రజా ప్రతినిధికి కరోనా సోకినట్లు తాండూరులో పుకార్లు గుప్పుమన్నాయి. ఈ విషయాన్ని ఆయన ఖండించారు.


తాను పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నానని, అనవసరంగా గిట్టనివారు తనపై పుకార్లు చేస్తున్నారని ఆంధ్రజ్యోతితో పేర్కొన్నారు. లారీ ట్రాన్స్‌పోర్ట్స్‌ అసోసియేషన్‌కు చెందిన వ్యక్తికి కూడా కరోనా సోకిందని పుకార్లు వెలువడటంతో ఆయన కూడా ఈ విషయాన్ని ఖండించారు. మంగళవారం ఆర్‌ఎంపీ వైద్యుడు కరోనాతో మృతి చెందాడని పుకార్లు గుప్పుమన్నాయి. అనారోగ్యంతో హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది వాస్తవమే అయినప్పటికీ మృతి చెందలేదని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో  ప్రభుత్వ కార్యాలయాల అధికారులు అప్రమత్తయ్యారు.

Updated Date - 2020-07-09T11:59:56+05:30 IST