2,06,960 రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-08T09:02:40+05:30 IST

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. మొత్తం 13 జిల్లాల్లో కలిపి 24గంటల వ్యవధిలో 89మంది మృత్యువాత పడ్డారని

2,06,960  రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు

  • మరో 89 మంది బలి
  • ఇప్పటివరకూ ఇదే రికార్డు 
  • 1842కు పెరిగిన మరణాలు 
  • మరో 10,171 కేసులు నమోదు
  • ఎంపీ సీఎం రమేశ్‌కు పాజిటివ్‌ 
  • 11రోజుల్లో లక్ష 
  • తొలి లక్ష నమోదుకు 138 రోజులు 
  • జూలై 15నుంచి విలయతాండవం 
  • మహారాష్ట్ర, తమిళనాడును మించి 
  • జాతీయ స్థాయిలో రాష్ట్రం దూకుడు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. మొత్తం 13 జిల్లాల్లో కలిపి 24గంటల వ్యవధిలో 89మంది మృత్యువాత పడ్డారని ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. చిత్తూరులో 10మంది, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున, తూర్పుగోదావరి, కడప, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కృష్ణాజిల్లాలో ఆరుగురు, కర్నూలు, విశాఖపట్నంలో ఐదుగురు చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 1,842కు పెరిగాయి. ఇదే సమయానికి 10,171 కొత్త కేసులు వెలుగు చూసినట్లు ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 2,06,960కి చేరాయి. విజయనగరం జిల్లాలో మరో 530 మందికి వైరస్‌ సోకింది. జిల్లా వైద్య అరోగ్యశాఖ అధికారితో పాటు కార్యాలయంలో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కర్నూలులో 1,331, తూర్పుగోదావరి జిల్లాలో 1,270, అనంతలో 1,100, చిత్తూరులో 1,029, నెల్లూరులో 941, గుంటూరులో 817, కడపలో 596, శ్రీకాకుళంలో 449, కృష్ణాజిల్లాలో 420 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.  


హోం ఐసొలేషన్‌లో సీఎం రమేశ్‌ 

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు కరోనా నిర్ధారణయింది. ఈ విషయం ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. స్వల్పంగా దగ్గు తప్ప ఎలాంటి ఇతర లక్షణాలు లేవని సన్నిహితులు తెలిపారు.


సచివాలయంలో మరొకరికి కొవిడ్‌ 

సచివాలయంలో నాలుగో బ్లాక్‌లో రెవెన్యూశాఖలోని సీఎంఆర్‌ఎ్‌ఫలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సచివాలయం, అసెంబ్లీలో మొత్తం కేసుల సంఖ్య 91కి చేరింది. 

Updated Date - 2020-08-08T09:02:40+05:30 IST