కరోనాపై కాకిలెక్కలు.. తప్పుల తడకగా హెల్త్‌ బులెటిన్‌

ABN , First Publish Date - 2020-07-14T23:29:29+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో లెక్కలు తప్పుతున్నాయంటున్నారు. కాకి లెక్కలతో విడుదలవుతున్న హెల్త్‌ బులెటిన్‌ గందరగోళ పరిస్థితులకు కారణమవుతోందన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రస్థాయిలో విడుదలయ్యే హెల్త్‌బులెటిన్‌లో జిల్లాకు సంబంధించిన వివరాలు ఒక రకంగా, జిల్లాస్థాయి

కరోనాపై కాకిలెక్కలు.. తప్పుల తడకగా హెల్త్‌ బులెటిన్‌

అడుగడుగునా వైద్యశాఖ సమన్వయ లోపం 

మొదటి నుంచి అదే తీరు 

పాజిటివ్‌ కేసులపై అస్పష్ట సమాచారం 

అంతా గందరగోళం.. పరిస్థితి దైవాధీనం 


నిర్మల్‌/అదిలాబాద్ (ఆంధ్రజ్యోతి) : కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో లెక్కలు తప్పుతున్నాయంటున్నారు. కాకి లెక్కలతో విడుదలవుతున్న హెల్త్‌ బులెటిన్‌ గందరగోళ పరిస్థితులకు కారణమవుతోందన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రస్థాయిలో విడుదలయ్యే హెల్త్‌బులెటిన్‌లో జిల్లాకు సంబంధించిన వివరాలు ఒక రకంగా, జిల్లాస్థాయి హెల్త్‌బులెటిన్‌లో పాజిటివ్‌ కేసులకు సంబంధించిన వివరాలు మరోరకంగా ఉండడంతో అంతటా అయోమయం నెలకొంటోంది. వైద్య,ఆరోగ్యశాఖ సమన్వయ లోపంతోనే గత కొద్ది రోజుల నుంచి ఇలాకరోనాపై అస్పష్టమైన వివరాలు వెల్లడవుతున్నాయన్న ఫిర్యాదులున్నాయి.


మొదటి నుంచి వైద్య,ఆరోగ్యశాఖ యం త్రాంగం కరోనా విషయంలో పక్కా సమాచారాన్ని ఇవ్వకుండా దాటవేత వైఖరిని అవలంభిస్తోందన్న విమర్శలున్నాయి. జిల్లా కలెక్టర్‌ పలుసార్లు కరోనా పాజిటివ్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వివరాలు సైతం పకడ్బందీగా జారీ చేయాలంటూ ఆదేశించినప్పటికీ వైద్యారోగ్యశాఖ పనితీరులో మాత్రం మార్పు కనిపించడం లేదంటున్నారు. ఆదివారం జిల్లాలో ఎలాంటి కరోనాపాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ జారీ చేసింది. అయితే రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ జారీ చేసిన హెల్త్‌ బులెటిన్‌లో మాత్రం నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు ఉండడం గందరగోళ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలా మొదటి నుంచి ఇక్కడి వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు సరియైున సమాచారం ఇవ్వకుండా దాటవేత వైఖరితో వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి.


కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో పాటు ఐసోలేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న వారు, హోం క్వారంటైన్‌లో ఉన్న వారు, గాంధీ ఆసుపత్రికి, రిమ్స్‌ ఆసుపత్రులకు తరలించిన వారి విషయంలో కూడా అధికారులు అస్పష్టమైన సమాచారాన్ని ఇస్తున్నట్లు విమర్శలున్నాయి. ఓ అధికారి చెప్పేదానికి మరో అధికారి చెప్పే దానికి పొంతన లేకుండా పోతుందని పేర్కొంటున్నారు. కోవిడ్‌కు సంబందించిన నోడల్‌ అధికారి తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఇటీవలే ఖానాపూర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ప్రకటించిన కొద్ది సేపటికే ఆ రిపోర్టు తప్పు అని పాజిటివ్‌ వేరే వారికి వచ్చిందంటూ చేసిన ప్రకటన అధికారుల మధ్య సమన్వయ లోపానికి అద్దం పడుతోంది. దీనిపై సదరు నోడల్‌ అధికారే పొరపాటు జరిగిందంటూ అంగీకరించడం, ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయిన అంశం చర్చనీయాంశం అయ్యింది. ఇలా గత మూడు నెలల నుంచి కరోనా విషయంలో సంబందిత యంత్రాంగం అనుసరిస్తున్న విధానం పట్ల అనేక ఆక్షేఫణలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు నిర్మల్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత పెరుగుతున్నప్పటికి అధికారులు అంశాన్ని డార్క్‌లో పెట్టి వాస్తవాలను వెల్లడించడం లేదంటున్నారు. దీని కారణంగానే జనం మరింత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ భౌతిక దూరం నిబందనను, మాస్క్‌లు ధరించడం లాంటి వాటిని ఉల్లంఘిస్తున్నారంటున్నారు. 


అస్పష్టంగా హెల్త్‌ బులెటిన్‌... 

మొదటి నుంచి కరోనా పాజిటివ్‌, నెగెటివ్‌ వివరాల వెల్లడి విషయంలో వైద్య,ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. వాస్తవానికి ప్రతిరోజూ దీనికి సంబంధించిన హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఈ నిబందనను ఉల్లంఘించారంటున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి మాత్రమే ఈ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేస్తున్నప్పటికీ ఇందులో కూడా వివరాలన్నీ తప్పుల తడకగా ఉంటున్నాయన్న ఆరోపణలున్నాయి. రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ జారీ చేస్తున్న బులెటిన్‌కు, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ జారీ చేస్తున్న బులెటిన్‌కు పొంతన ఉండడం లేదన్న అభిప్రాయాలున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం, కమ్యూనికేషన్‌ గ్యాఫ్‌తో ఈ తప్పుల వ్యవహారం సాగుతోందంటున్నారు. రోజు రోజుకు కరోనా తీవ్రత పెరుగుతున్న క్రమంలో కూడావైద్య,ఆరోగ్యశాఖ అధికారులు తప్పులను సవరించుకునే ప్రయత్నాలను చేసుకోకుండా ఆ తప్పులను సమర్ధించుకునే రీతిలో వ్యవహరిస్తున్నారంటున్నారు. 


వివరాల వెల్లడిలో జాప్యం

ప్రతిరోజూ కరోనాకు సంబంధించిన పూర్తి వివరాలను సాయంత్రం లోగా వైద్య,ఆరోగ్యశాఖ ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటన్నారు. ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించిన వివరాలను అదే రోజు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఆలస్యంగా ఆ వివరాలను రాత్రివేళ జారీ చేస్తున్నారు. దీంతో మరుసటి రోజుకు సంబంధించిన కరోనా సమాచారమంతా గడబిడగా మారుతోంది. హోం క్వారంటైన్‌లో ఎంతమంది ఉన్నారనే విషయంతో పాటు ఎంతమంది షాంపిళ్ళను సేకరించి ల్యాబ్‌కు పంపారోననే విషయంలో కూడా అధికారులు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. దీని కారణంగా ప్రజలకు సరియైున సమాచారం అందకపోతున్న కారణంగా నిర్లక్ష్య వైఖరి పెరిగిపోతుందంటున్నారు. 


అంతా గందరగోళం... పరిస్ధితి దైవాధీనం

ఇదిలా ఉండగా జిల్లాలో కరోనా వైరస్‌ పరిస్థితి గందరగోళం దైవాధీనంగా మారిందంటున్నారు. జనం లాక్‌డౌన్‌కు ముందు అలాగే లాక్‌డౌన్‌లోనూ ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం లాంటి వాటితో పాటు విందులు, వినోదాల్లో పాల్గొనడం, షాపింగ్‌లు, మార్కెటింగ్‌లు జోరు గా చేస్తుండడం, గుంపులు గుంపులుగా తిరుగుతుండడం లాంటి పరిణామాలన్నీ కరోనావైరస్‌వ్యాప్తికి కారణమవుతున్నాయి.


మొదట పోలీసులు కఠినంగా వ్యవహరించి వ్యాప్తిని కట్టడి చేయగలిగారు. అయితే లాక్‌డౌన్‌ అనంతరం పరిస్థితి మారిపోవడంతో నిర్లక్ష్యధోరణి ప్రజల్లో పెరిగిపోయింది. దీనికి తోడు కరోనా సమాచారం, హోం క్వారంటైన్‌, ఐసోలేషన్‌ సమాచారం స్పష్టంగా తెలియకపోవడం కూడా నిర్లక్ష్యానికి తోడవుతోందంటున్నారు. కరోనావైరస్‌ వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతున్నట్లు అధికారులు ప్రచారం చేసినట్లయితే కొంతమేరకైనా జనం కట్టడికి లోబడి ఉండేవారంటున్నారు. ప్రస్తుతం కట్టడి నిర్వీర్యమైపోయిందని, జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-07-14T23:29:29+05:30 IST