ఒక్కరోజే 13 మందికి పాజిటివ్‌.. ఖమ్మం జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-07-02T22:09:04+05:30 IST

ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులతో అటు యంత్రాంగం..

ఒక్కరోజే 13 మందికి పాజిటివ్‌.. ఖమ్మం జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

ఖమ్మం సంక్షేమ విభాగం/సత్తుపల్లి/పెనుబల్లి: ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులతో అటు యంత్రాంగం.. ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో బుధవారం ఒక్కరోజే 13మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఒక వైపు జిల్లా ఆసుపత్రితో పాటు.. మరో వైపు పలు దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం కోసం వెళ్లి వారికి పరీక్షలు చేస్తుండగా.. పాజిటివ్‌ వచ్చిన వారి వివరాలను జిల్లా వైద్యశాఖ అధికారులకు అందిస్తున్నారు. 


ఖమ్మం నగరంలోని రోటరీనగర్‌, ఎన్నెస్టీరోడ్డు, బుర్హాన్‌పురంలో గతంలో పాజిటివ్‌ కేసులు నమోదవగా.. ఆ వ్యక్తుల నివాసాలకు సమీపంలోని ఒక్కొక్కరి చొప్పున మొత్తం ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణైంది. 


ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో గతంలో పాజిటివ్‌ వచ్చిన మహిళా డాక్టర్‌తో కలిసి పనిచేసిన మరో మహిళా డాక్టర్‌కు, అదే ఆసుపత్రిలోని ఓ నర్సింగ్‌ ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చింది. ఇక ఈ ఆసుపత్రిలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగి ఒకరు కరోనా బారిన పడగా.. ఆ ఉద్యోగి సూర్యాపేట చిరునామాలో ఉన్నారు. 


ఖమ్మం గాంధీచౌక్‌లో 63ఏళ్ల వ్యక్తికి, జిల్లా ఆసుపత్రిలో పనిచేసే ఓ కింది స్థాయి ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నమోదైంది. 


సరితా క్లినిక్‌ సెంటర్‌లో చికెన్‌ దుకాణానికి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ నమోదైంది.


ఖమ్మం యూపీహెచ్‌ కాలనీ (ప్రశాంతినగర్‌ చిరునామా)కి చెందిన ఓ వ్యక్తి కాలేయ సంబంధ వ్యాధి చికిత్స కోసం హైదరాబాద్‌ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. 


సింగరేణి మండలం పోలంపల్లికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడే వైద్యపరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. 


నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన 76ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లోని ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లగా అక్కడ కరోనా బారిన పడ్డట్టు నిర్ధారణైంది.


పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత(24)కు మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఇటీవల హైదరాబాద్‌కు వైద్యం కోసం వెళ్లి కరోనా బారిన పడిన మహిళకు ఈమె సమీప బంధువు. కుప్పెనకుంట్లలో ఇంటి వద్ద ఉన్న సదరు మహిళకు లక్షణాలు కన్పించటంతో ఆదివారం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్యులు తెలిపారు. అయితే తొలుత పాజిటివ్‌ వచ్చిన మహిళతోపాటు ఈమె కూడా హైదరాబాద్‌ వెళ్లివచ్చినట్టు బంధువులు తెలిపారు. 


బెటాలియన్‌ ఉద్యోగికి పాజిటివ్‌

హైదరాబాద్‌లోని బెటాలియన్‌ పరిధిలో కొవిడ్‌-19 విధులు నిర్వహించిన సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ బెటాలియన్‌కు చెందిన ఓ ఉద్యోగి(డ్రైవర్‌) కరోనా బారిన పడినట్టు ఉన్నతాధికారులు నిర్ధారించారు. అయతే హైదరాబాద్‌లో విధులు నిర్వహించిన అనంతరం జూన్‌ 19న గంగారం చేరుకోగా.. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో 27న ఖమ్మం తరలించగా అక్కడ పరీక్షలు నిర్వహించి అనంతరం పాజిటివ్‌గా నిర్ధారణైందని గంగారం పీహెచ్‌సీ వైద్యుడు చింతా కిరణ్‌కుమార్‌ బుధవారం తెలిపారు. దీంతో ఆయనతో కాంటాక్టులో ఉన్నవారిని పలువురిని ఇప్పటికే హోంక్వారంటైన్‌లో ఉంచాని, ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నామన్నారు. 

Updated Date - 2020-07-02T22:09:04+05:30 IST