ఒక్కరోజే 18 మందికి... ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-11T21:07:01+05:30 IST

ఖమ్మం జిల్లాలో శుక్రవారం మరో 18మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో మరో ఇద్దరు ఈ వైరస్‌ బారిన పడ్డారు.

ఒక్కరోజే 18 మందికి... ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

జడ్పీలో మరో ఇద్దరికి పాజిటివ్‌ 

మిలటరీ ఆసుపత్రికి చర్ల సీఆర్పీఎఫ్‌ పోలీసులు


ఖమ్మం (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలో శుక్రవారం మరో 18మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో మరో ఇద్దరు ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటికే జడ్పీలో రెండో స్థాయి అధికారికి పాజిటివ్‌ రాగా.. ఆయనతో పాటు కారులో హైదరాబాద్‌ ప్రయాణం చేసిన డ్రైవర్‌కు, మరో అధికారికి శుక్రవారం పాజిటివ్‌ నిర్ధారణైంది. దీంతో జడ్పీలో కరోనా పాజిటీవ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది. మరో అధికారి శ్యాంపిళ్లు తీసుకోగా.. ఆ రిపోర్టు రావాల్సి ఉంది. వీరితో పాటు ఖమ్మం శ్రీనగర్‌కాలనీలో ఒకరికి, మమతా రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లో ఒకరికి, పాకబండబజార్‌లో ముగ్గురికి, అద్దంకి వారి వీధిలో ఒకరు, జిల్లా ఆసుపత్రిలో ఒకరు, గుర్రాలపాడులో ఒకరు, ద్వారకానగర్‌లో ఇద్దరు, వికలాంగుల కాలనీలో ఒకరు, వెంకటేశ్వరనగర్‌లో ఒకరు, రోటరీనగర్‌లో ఒకరు, కొత్తగూడెంలో ఒకరు, ఖమ్మం రూరల్‌మండలం పెద్దతండాలో ఒకరు, మధిర మండల కేంద్రానికి చెందిన ఒకరు,  తల్లాడ మండలం మిట్టపల్లిలో ఒకరు, ఏన్కూరు మండలం జన్నారంలో ఒకరు కొవిడ్‌ వైరస్‌ బారిన పడ్డారు. వీరితో పాటు వేంసూరు మండలం జయలక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూడా కరోనా బారిన పడగా.. ఆయన వివరాలు ఏపీలో నమోదయ్యాయి. సదరు వ్యక్తి ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరులోని ఓ దుకాణంలో పనిచేస్తుండగా.. అక్కడ ఓ మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో అక్కడి అధికారులు శ్యాంపిళ్లు సేకరించారు. ఈ క్రమంలో ఆయనకు కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. 


మిలటరీ వైద్యశాలకు సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు.. 

చర్ల మండలం కలివేరు సీఆర్‌ఫిఎఫ్‌ 151 బెటాలియన్‌ పోలీస్‌ క్యాంపులోని సుమారు 24 మంది పోలీసులకు కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా వైరస్‌ బారిన పడిన వారిని శుక్రవారం తెల్లవారుజామున  సీఆర్‌పీఎఫ్‌ అధికారులు హైదరాబాద్‌లోని మిలటరీ వైద్యశాలకు ప్రత్యేక వాహనంలో తరలించారు. అలాగే జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, సత్యనారాయణ పురం ప్రభుత్వ  వైద్యాధికారి ఎస్‌.మౌనిక, చర్ల ఎంపీడీవో నారాయణ, తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌ బేస్‌ క్యాంపుని పరిశీలించారు. సీఆర్‌పీఎఫ్‌ పోలీసులతో మాట్లాడారు. క్యాంపు పరిసరాలను శానిటేషన్‌ చేయించారు. 

Updated Date - 2020-07-11T21:07:01+05:30 IST