కృష్ణా జిల్లాలో.. ఒక్కరోజే 998 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-05T16:50:02+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి మరింత..

కృష్ణా జిల్లాలో.. ఒక్కరోజే 998 కరోనా కేసులు

మరో ఆరుగురి మృతి 

యాక్టివ్‌ కేసులు 8,443 


ఆంధ్రజ్యోతి-విజయవాడ : జిల్లాలో కరోనా మహమ్మారి మరింత వికృత రూపం దాల్చింది. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 998 మందికి ప్రాణాంతక వైరస్‌ సోకింది. మరో ఆరుగురు పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 65,125కి ఎగబాకింది. కొవిడ్‌ మరణాలు అధికారికంగా 791కి చేరుకున్నాయి. ఇంకా 8,443 మంది పాజిటివ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. రోజుకు వెయ్యి చొప్పున కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ బాధితులు ఆసుపత్రులకు వెళుతుంటే బెడ్స్‌ అందుబాటులో ఉండటం లేదు. రెండు మూడు రోజులకే వైరస్‌ శ్వాసక్రియను దెబ్బతీస్తుండటంతో ఊపిరాడక మృత్యువాత పడుతున్నారు. ఆక్సిజన్‌తో ప్రాణాలు కాపాడుకుందామంటే దొరకని పరిస్థితి. ఆసుపత్రుల్లో వైద్యసేవలు లేని దుస్థితిలో 90మందికి పైగా కరోనా బాధితులు ఇళ్లలోనే ఉంటూ సొంత వైద్యంతో కాలక్షేపం చేస్తున్నారు. రోజూ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈమరణాలేవీ ప్రభుత్వ లెక్కల్లోకి రావడం లేదు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వాలు తూతూమంత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నాయి. ఇలాగే కొనసాగితే ఈఉధృతి ఇంకా పెరిగి చేయిదాటిపోతుందని వైద్యనిపుణులు సైతం ఆందోళన చెందుతున్నారు.


Updated Date - 2021-05-05T16:50:02+05:30 IST