చేపలు బంద్‌

ABN , First Publish Date - 2020-04-02T09:19:44+05:30 IST

విశాఖపట్నంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలకమైన నిర్ణయం తీసుకుంది.

చేపలు బంద్‌

వేట, అమ్మకం...రెండూ నిషేధం

ఫిషింగ్‌ హార్బర్‌ మూసివేత

వేలం, కొనుగోళ్ల సమయంలో గుంపులు గుంపులుగా జనం

‘భౌతిక దూరం’ పాటించకపోవడంతో అధికారుల ఆందోళన

వ్యాపార లావాదేవీల నిలిపివేతకు నిర్ణయం

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

మళ్లీ ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇదే పరిస్థితి

కరోనా ఎఫెక్ట్‌


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): విశాఖపట్నంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలకమైన నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటించకుండా ప్రతిరోజు గుంపులు గుంపులుగా పెద్దఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ఫిషింగ్‌ హార్బర్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీన్ని బుధవారం నుంచే అమలులోకి తీసుకువచ్చింది. ఏ ఒక్క బోటు చేపల వేటకు వెళ్లకూడదని, వేట నుంచి వచ్చిన బోట్లు సరకును హార్బర్‌లో వేలం వేయకూడదని ఆంక్షలు విధించింది. అంతేకాకుండా రిటైల్‌ మార్కెటింగ్‌ చేసేవారు సైతం నగరంలో ఎక్కడా చేపలు విక్రయించకూడదని స్పష్టంచేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా, ఎక్కడైనా వ్యవహరిస్తే...వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్య శాఖ జాయింట్‌ డైరక్టర్‌ ఫణిప్రకాశ్‌ తెలిపారు.


ఎంత చెప్పినా వినకపోవడం వల్లే!!

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కొన్ని రోజులు చేపల విక్రయాలు ఆపేశారు. కేవలం కూరగాయలు మాత్రమే విక్రయించారు. చేపలు, చికెన్‌, మటన్‌ విక్రయాలు కొన్ని నగరాల్లో కొనసాగుతుండడంతో విశాఖపట్నంలో కూడా అనుమతించారు. గత ఐదారు రోజులుగా ఫిషింగ్‌ హార్బర్‌లో చేపల వేలం, విక్రయాలు ప్రారంభమయ్యాయి. వేటకు వెళ్లిన బోట్లు తెల్లవారుజామున రాగానే నాలుగు గంటలకే హార్బరులో వేలంపాటలు ప్రారంభిస్తున్నారు. వీధుల్లో తిరిగి చేపలు విక్రయించుకునేవారు అక్కడికి వచ్చి వాటిని కొంటున్నారు. అలాగే కొందరు నగర పౌరులు కూడా అక్కడే అవసరమైన సరకు కొంటున్నారు. ఇక్కడ ‘భౌతిక దూరం’ నిబంధన అసలు అమలు కావడం లేదు. ఈ విషయం పత్రికల ద్వారా బయటకు రాగా జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌, మత్స్య శాఖ అధికారులు, పోర్టు అధికారులు వెళ్లి పరిశీలించారు. పారిశుద్ధ్యం చాలా దారుణంగా వుందని, పోర్టు అధికారులు దానిపై దృష్టిసారించాలని ఆదేశించారు. చేపలు అమ్మేవారు 2 మీటర్లు, కొనుగోలుదారులు 1.2 మీటర్లు భౌతిక దూరం పాటించాలని సూచించారు.


ఆ మేరకు గడులు గీశారు. అయితే ఆ నిబంధనలను ఏ ఒక్కరూ పాటించడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా మరోసారి పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ దీనిపై కలెక్టర్‌ వినయ్‌చంద్‌తో చర్చించారు. ఆ తరువాత బోటు ఆపరేటర్లు, విక్రేతలు, మత్స్య శాఖ అధికారులు, పోర్టు అధికారులతో మాట్లాడారు. ఇదే పరిస్థితి కొనసాగితే...హార్బర్‌లోని మత్స్యకారులు, కొనుగోలుదారులకే కాక నగర ప్రజలకు కూడా ప్రమాదం వాటిల్లుతుందని, దీనికి పరిష్కారం సూచించాలని కోరారు. అనేక చర్చలు, తర్జనభర్జనలు జరిగిన తరువాత ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని ఫిషింగ్‌ హార్బర్‌ను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం దీనిపై నిర్ణయం తీసుకొని బుధవారం ఉదయం నుంచే అమలులోకి తీసుకువచ్చారు. హార్బర్‌లోకి వెళ్లేందుకు వున్న రెండు రహదారులను చెక్‌పోస్టులతో మూసేసి, లోపలకు ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.


14 రోజులు ముందుగానే..

వాస్తవానికి ప్రతి ఏటా ఏప్రిల్‌ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట నిలిపివేస్తారు. చేపలు గుడ్లు పెట్టే సమయం కావడం వల్ల మత్స్య సంపద నాశనం కాకుండా 45 రోజులు నిషేధం విధిస్తారు. ఇది ఈ నెల 14 నుంచి అమలులోకి వస్తుంది. అయితే 14 రోజులు ముందుగానే కరోనా వల్ల జిల్లా అధికారులు నిర్బంధ నిషేధం అమలులోకి తీసుకువచ్చారు. 


మేమే నిషేధం అడిగాం... పీసీ అప్పారావు, విశాఖ మరబోట్ల సంఘం అధ్యక్షులు

మాకుగా మేమే ఫిషింగ్‌ హార్బర్‌లో లావాదేవీలు జరగకుండా నిషేధం పెట్టాలని అధికారులను కోరాము. ఇక్కడ ఒకరి మాట మరొకరు వినే పరిస్థితి లేదు. ఎంత కంట్రోల్‌ చేద్దామన్నా నాయకులుగా మా చేతులు దాటిపోతోంది. పోలీసులు చెప్పినా వినడం లేదు. అందుకే హార్బర్‌ని కొన్నాళ్లు మూసేస్తే మంచిదని కోరాము. బతికుంటే ఆ తరువాతైనా వేటకు వెళతాము. అదే అధికారులకు చెప్పాము. ఈ 14 రోజులకు ప్రభుత్వం ఏదైనా భృతి అందిస్తే మంచిది.


బతికుంటే బలుసాకు తింటాము... సీహెచ్‌ సత్యనారాయణ, ఛైర్మన్‌, డాల్ఫిన్‌బోటు ఆపరేటర్ల సంఘం

బతికుంటే బలుసాకు తిని ప్రాణాలు కాపాడుకుంటాము. కానీ కరోనాతో కష్టాలు కొని తెచ్చుకోలేము. జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదు. అందుకే హార్బరు మూసివేస్తామంటే ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. టైగర్‌ రొయ్యలు బయట ధర రూ.1,500 వుంటే ఇక్కడ రూ.600కు కొంటున్నారు. తల లేని రొయ్యల బాస్కెట్‌ ధర రూ.2,500 వుంటే 1,600కు తీసుకుంటున్నారు. దీని వల్ల నష్టాలు వస్తున్నాయి. వేటకు వెళ్లినా ప్రయోజనం లేదు. అందుకే వేట నిషేధాన్ని కూడా అంగీకరించాము. ఇది అందరి మంచికోసమే.

Updated Date - 2020-04-02T09:19:44+05:30 IST