కరోనా కట్టడికి ఈ ఏరియాలో తీసుకున్న జాగ్రత్తలు తీసుకుంటే...

ABN , First Publish Date - 2020-04-10T12:46:28+05:30 IST

తొలి కేసు నమోదు కాగానే అలర్ట్‌ అయిన జిల్లా యంత్రాంగం...

కరోనా కట్టడికి ఈ ఏరియాలో తీసుకున్న జాగ్రత్తలు తీసుకుంటే...

  • కరోనా కట్టడిలో ఇస్లాంపూర్‌.. 
  • తొలికేసుతోనే అప్రమత్తం.. 
  • కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటన
  • యంత్రాంగం ప్రణాళిక.. తగ్గుతున్న కేసులు

హైదరాబాద్‌ : తొలి కేసు నమోదు కాగానే అలర్ట్‌ అయిన జిల్లా యంత్రాంగం... ఒకే ఇంట్లో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ కాగానే ఆ బస్తీని తమ అధీనంలోకి తీసుకుని రూట్‌లన్నీ ఆపేశారు. ఆ కుటుంబం నివసిస్తున్న బస్తీని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ఏర్పాటు చేసి బారికేడ్లతో బంధించేశారు. అంతే కాకుండా ఆ కుటుంబీకులకు నిర్ధారణ కాకముందు వారితో సన్నిహితంగా మెలిగిన 53మందిని హైరిస్కు ఉన్న వారీగా గుర్తించి క్వారంటైన్‌కు, మరో 436మందిని రిస్కుగా గుర్తించి వారిని ఐసోలేషన్‌ చేశారు. ఆ బస్తీలో ఉన్న 1608 కుటుంబాలకు చెందిన 7600 మందికి కేవలం ఒకే వైపు దారి ఉంచారు. వైద్య సేవలు అందుబాటులో ఉంచి ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే సంప్రదించాలని స్థానిక అధికారులను, వైద్యులను అందుబాటులో ఉంచారు.


కుటుంబం నుంచి కేవలం ఒకే వ్యక్తి... ఒకే సారి బయటకు వచ్చి అత్యవసర వస్తువుల కొనుగోలు చేసేందుకు అవకాశముంటుంది. తొలి కేసుతోనే అప్రమత్తం కావడంతో పాటు ప్రతి కదలికపై నిఘా పెట్టి ఎక్కడా నిబంధనల ఉల్లంఘన కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఆ గ్రామంలో మార్చి 23న తొలి నాలుగు కేసులు నమోదు కాగా... 18రోజుల వ్యవధిలో మొత్తం 26 పాజిటివ్‌ వచ్చాయి. వారిలో 9మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్లానింగ్‌తో పాటు పక్కాగా నిబంధనలు అమలు చేసిన ఇస్లాంపూర్‌ పాటించిన విధానాన్ని మనము పాటిస్తున్నామా.. లేదా ఇప్పటికైనా పరిశీలిద్దామా...!


ఇస్లాంపూర్‌ ఆదర్శం

కొవిడ్‌-19 ప్రభావానికి గురి కాకుండా... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దేశంలోని ఓ చిన్న గ్రామం చేసి చూపించింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా... ముంబై- బెంగళూరు హైవేపై ఉన్న గ్రామం ఇస్లాంపూర్‌లో తొలి పాజిటివ్‌ కేసు నమోదు కాగానే... సాంగ్లీ జిల్లా అధికారులు అప్రమత్తమై జిల్లా ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం (డీఆర్‌ఆర్‌టీ) ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన బృందాలు కుటుంబం నివసిస్తున్న ప్రాంతం (కిలోమీటర్‌ పరిధి) కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి కమ్యూనిటీ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేశారు. 70వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 9 వరకు అంటే 18రోజుల్లో పాజిటివ్‌ల సంఖ్య కేవలం 26కు చేరింది. వేగంగా వ్యాప్తి చెందిన కరోనాను కట్టడి చేయడంలో ఆ గ్రామం సక్సెస్‌ అయిందనే చెప్పవచ్చు.

Updated Date - 2020-04-10T12:46:28+05:30 IST