ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా... ఓ మహిళ ద్వారా ఏకంగా 12 మందికి పాజిటివ్..

ABN , First Publish Date - 2020-07-08T22:30:14+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నది. మంగళవారం ఒక్క రోజే 36 మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిలో ఇద్దరు మృతి చెందడం గమనార్హం. సంగారెడ్డి జిల్లాలో 25 మంది,

ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా... ఓ మహిళ ద్వారా ఏకంగా 12 మందికి పాజిటివ్..

ఒకేరోజు 36 మందికి.. 

సంగారెడ్డి జిల్లాలో 25 మందికి... ఇద్దరి మృతి

సిద్దిపేటలో 9, మెదక్‌లో ఇద్దరికి పాజిటివ్‌


సంగారెడ్డి అర్బన్‌/మెదక్(ఆంధ్రజ్యోతి):  ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నది. మంగళవారం ఒక్క రోజే 36 మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిలో ఇద్దరు మృతి చెందడం గమనార్హం.  సంగారెడ్డి జిల్లాలో 25 మంది, సిద్దిపేట, గజ్వేల్‌లో నలుగురు చొప్పున, చేర్యాల, తూప్రాన్‌, రామాయంపేటలో ఒక్కొక్కరు కొవిడ్‌-19 బారిన పడ్డారు. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్‌ నుంచి 28, పటాన్‌చెరు నుంచి 42 శాంపిళ్లను  గాంధీ ఆస్పత్రికి పంపించారు. అలాగే సిద్దిపేట జిల్లా నుంచి వైద్యాధికారులు 27 శాంపిళ్లను పరీక్షల కోసం  పంపించారు. 


సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నమోదైన ఏడు కేసుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఇద్దరు పాజిటివ్‌ రోగులకు సంబంధించిన చైన్‌లింకు ఇంతవరకు తెగలేదు.  గజ్వేల్‌లోని ఒక మహిళా ప్రజాప్రతినిధికి వైరస్‌ సోకగా ఆమె ద్వారా 12 మందికి, మరో కుటుంబానికి చెందిన వ్యక్తి ద్వారా 9 మందికి పాజిటివ్‌ వచ్చింది. కాగా మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ పట్టణంలో నెల రోజుల్లోనే కరోనాతో ఇద్దరు వ్యాపారులు మృతి చెందగా, పది మంది వైరస్‌ బారినపడ్డారు. 


సంగారెడ్డి జిల్లాలో మంగళవారం 25 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సదాశివపేటలో-7, బొల్లారం-1, అమీన్‌పూర్‌- 5, భానూర్‌- 3, జహీరాబాద్‌- 2, బీరంగూడ-2, తెల్లాపూర్‌-2, పటాన్‌చెరు-1, ఆర్సీపురం-1, కంది మండలం ఎర్దనూర్‌ ఇప్పలగడ్డ తండాలో ఒక పాజిటివ్‌ కేసు వెలుగుచూసిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాం రాథోడ్‌ తెలిపారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. 


సదాశివపేటలోని ఫయాజ్‌నగర్‌లో ఓ మహిళ (65) చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో మృతి చెందగా, ఆర్సీపురంలో మరో వ్యక్తి (61) చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆ ఇద్దరికి కోవిడ్‌ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించామని డీఎంహెచ్‌వో తెలిపారు. సదాశివపేటలో నమోదైన ఏడు కేసుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలోని కరోనా వార్డులో 14 మంది పాజిటివ్‌ బాధితులు చికిత్స పొందుతుండగా, కరోనా అనుమానిత లక్షణాలతో ఎనిమిది మంది చేరినట్టు డీఎంహెచ్‌వో తెలిపారు.  సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్‌ నుంచి 28 మంది, పటాన్‌చెరు నుంచి 42 మంది శాంపిళ్లను సేకరించి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించామని డీఎంహెచ్‌వో తెలిపారు.


తూప్రాన్‌ పట్టణంలో ఒకరికి

తూప్రాన్‌ పట్టణానికి చెందిన డ్రైవర్‌(42)కు మంగళవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి భావన తెలిపారు. బాధితుడు 20 రోజుల క్రితం జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ప్రైవేటు హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకున్నాడు. తగ్గకపోవడంతో 10 రోజుల క్రితం ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో పరీక్షలు చేయించుకోగా నిమోనియా ఉన్నట్లు తేల్చారు. వైద్యం కోసం ఈ నెల 1న భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు సోదరులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ బామ్మర్ది ఇంట్లో ఉండి చికిత్స చేయించుకుంటున్నాడు. శ్వాస సమస్య తీవ్రం కావడంతో 4న ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చేసిన పరీక్షల్లో వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉండడంతో మంగళవారం సాయంత్రం డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. 19 మంది కాంటాక్టులను గుర్తించి హోం క్వారంటైన్‌ చేశారు. 


రామాయంపేటలో మరొకరికి 

రామాయంపేట మున్సిపాలిటీ పరిధి గొల్పర్తిలో మంగళవారం మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. మహిళకు(60) కోవిడ్‌-19 లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. మండల పరిధిలోని డి.ధర్మారం ఆరోగ్య సిబ్బంది గొల్పర్తి గ్రామానికి చేరుకొని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్‌ సోకిన మహిళతో పాటు మరో పదిమందిని హోం క్వారంటైన్‌ చేశారు. దీంతో ఇప్పటికే రామాయంపేట మండలంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6కు చేరింది. రోజురోజుకు వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారస్తులు సైతం జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరచి ఉంచేలా అన్ని వ్యాపార సంస్థల అసోసియేషన్‌ ప్రతినిధులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. 


హోం క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన వైద్యబృందం

మెదక్‌ జిల్లా నిజాంపేట మండల పరిధి నార్లాపూర్‌లో ఓ వ్యక్తికి  రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామాన్ని మంగళవారం డాక్టర్‌ ఎలిజిబెత్‌ రాణి సందర్శించారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ గ్రామంలో పాజిటివ్‌ కేసు వచ్చిన వ్యక్తిని హోం క్వారంటైన్‌ చేసి వైద్యం అందజేస్తున్నామన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని సూచించారు. మరో వారం రోజుల్లో నె గిటివ్‌ వచే ్చ అవకాశముందన్నారు. పాజిటివ్‌ కేసు రావడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో లాక్‌డౌన్‌ విధిస్తామని, ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామంలో దుకాణాలు తెరుస్తారని, ప్రతీఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. డాక్టర్‌ వెంట సర్పంచ్‌ అమరసేనారెడ్డి, ఏఎన్‌ఎం నర్సవ్వ, ల్యాబ్‌ టెక్నిషియన్‌ శ్రీకాంత్‌, పంచాయతీ పాలకవర్గం ఉన్నారు. 


సిద్దిపేట జిల్లాలో 9 మందికి పాజిటివ్‌

సిద్దిపేట జిల్లాలో మంగళవారం 9 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.  సిద్దిపేటలోని భారత్‌నగర్‌కు చెందిన ఒక వైద్య ఉద్యోగికి వైరస్‌ సోకింది. ఇటీవల కొంతకాలం పాటు ఆయన డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌లో పనిచేయగా అక్కడ సోకినట్లు అనుమానిస్తున్నారు. గతంలో రైస్‌మిల్లు వ్యాపారికి వైరస్‌ సోకగా వారి ద్వారా శివాజీనగర్‌కు చెందిన ఇద్దరికీ పాజిటివ్‌ నిర్దారణ అయింది. పారుపల్లి వీధిలోని ఒక వ్యాపారి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పాజిటివ్‌గా గుర్తించారు. చేర్యాలకు చెందిన మహిళకు(65) వైరస్‌ సోకింది. గజ్వేల్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంగళవారం 27 రిపోర్టులు రాగా 67 పెండింగ్‌లో  ఉన్నాయి. కొత్తగా 27 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించారు.


గజ్వేల్‌లో తెగని చైన్‌లింకు

గజ్వేల్‌లో ఇద్దరు పాజిటివ్‌ రోగులకు సంబంధించిన చైన్‌లింకు ఇంతవరకు తెగలేదు. గజ్వేల్‌లోని ఒక మహిళా ప్రజాప్రతినిధికి వైరస్‌ సోకగా ఆమె ద్వారా 12 మందికి, మరో కుటుంబానికి చెందిన వ్యక్తి ద్వారా 9 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇంకా ఎంత మందికి విస్తరిస్తుందోనని స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా,  ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కరోనా వ్యాధిగ్రస్తులను చేర్చుకుంటామని మంత్రి రాజేందర్‌ ప్రకటించారు. కానీ, సిద్దిపేటలోని జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో మాత్రం శాంపిల్స్‌ తీసుకోవడానికి, పాజిటివ్‌ రోగులను చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరిస్తున్నారు. మంగళవారం జిల్లాకు చెందిన ఆరుగురు పోలీసులను పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు పంపగా వైద్యులు నిరాకరించారని తెలిసింది. దీంతో సిద్దిపేటలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ శాంపిల్స్‌ తీసుకున్నారు. జీజీహెచ్‌లో రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తుండటంతో పలువురు అవస్థల పాలవుతున్నారు. సిద్దిపేటలోని ఒక గుమస్తాకు ఇటీవలే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన రెండు గదుల ఇంట్లో కుటుంబంతో నివాసముంటున్నారు. వేరుగా ఉండేందుకు ఇంట్లో వసతి లేదని చెబుతున్నా వినకుండా హోం క్వారంటైన్‌లో ఉండాలని ఇంటికి పంపించారు. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లికి చెందిన ఒక మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురవ్వగా స్థానికులు గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో ఉంచారు. 


సిద్దిపేట జిల్లాలో మార్చిలో ఒక కరోనా కేసు నమోదైంది. మేలో మహారాష్ట్ర నుంచి వచ్చిన నలుగురికి కరోనా సోకింది.  జూన్‌లో 46 కేసులు నమోదవ్వగా, జూలైలో ఇప్పటి వరకు 18 కేసులు వెలుగుచూశాయి. ఏనెలకానెల కేసులు పెరుగుతుండడంతో స్థానికుల్లో ఆందోళనలో నెలకొంది.


వ్యాపారుల మృతితో ఆందోళన

తూప్రాన్‌ పట్టణంలో రోజురోజుకు కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పట్టణంలో నెలరోజుల్లోనే కరోనాతో ఇద్దరు వ్యాపారులు మృతి చెందగా, పది మంది వైరస్‌ బారినపడ్డారు. వైరస్‌ విజృంభిస్తుండడంతో పట్టణానికి వచ్చేందుకు గ్రామాల ప్రజలు జంకుతున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండడం, జీహెచ్‌ఎంసీ పక్కనే ఉండడంతో వైరస్‌ విజృంభిస్తున్నదని భావిస్తున్నారు. పట్టణ ప్రజలు ప్రతీ అవసరానికి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ఇది కూడా కేసుల సంఖ్య పెరగడానికి కారణమనుకుంటున్నారు. 

Updated Date - 2020-07-08T22:30:14+05:30 IST