రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్కరోజులోనే..

ABN , First Publish Date - 2020-07-09T18:24:59+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో 281కేసులు నమోదయ్యాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో 162 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో

రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్కరోజులోనే..

కరోనా విజృంభణ.. ఒక్కరోజే 281 కేసులు నమోదు

రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో 162 కేసులు 

మేడ్చల్‌ జిల్లాలో 117  నమోదు, ఒకరి మృతి

వికారాబాద్‌లో తొమ్మిది మందికి పాజిటివ్‌.. ఒకరు మృతి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4,735 చేరుకున్న కరోనా బాధితులు 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో 281కేసులు నమోదయ్యాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో 162 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 117 కేసులు నమోదు కాగా వికారాబాద్‌ జిల్లాలో 9 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 4,735కు చేరుకుంది. 


రంగారెడ్డిలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌లు

రంగారెడ్డి జిల్లాలో బుధవారం 162 కేసులు నమోదు కాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 106, నాన్‌జీహెచ్‌ఎంసీ పరిధిలో 56 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కందుకూరు డివిజన్‌ సరూర్‌నగర్‌లో 31, రాజేంద్రనగర్‌ డివిజన్‌ పరిధి శేరిలింగంపల్లిలో 36, మైలార్‌దేవ్‌పల్లిలో 18, ఇబ్రహీంపట్నం డివిజన్‌ అబ్ధుల్లాపూర్‌మెట్‌లో 21 కేసులు నమోదయ్యాయి. అలాగే నాన్‌జీహెచ్‌ఎంసీ పరిధిలోని కందుకూరు రెవెన్యూ డివిజన్‌ బాలాపూర్‌లో 26, కందుకూరులో 4, దొబ్బచెర్లలో ఒకరున్నారు. రాజేంద్రనగర్‌ డివిజన్‌ పరిధిలోని నర్కొడలో 4, నార్సింగిలో 18, ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని ఇబ్రహీంపట్నంలో ఒకరు, అబ్ధుల్లాపూర్‌మెట్‌లో ఇద్దరున్నారు. 


వికారాబాద్‌ జిల్లాలో 9 పాజిటివ్‌ కేసులు 

జిల్లాలో 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌లో 4 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వారిలో మోతీబాగ్‌లో భార్యాభర్తలిద్దరికీ కరోనా సంక్రమించింది. పూడూరు మండలం, కండ్లపల్లిలో రెండు కేసులు రాగా, తాండూరులో ఒక కరోనా కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. పరిగి పట్టణంలోని బహర్పేట్‌ కాలనీకి చెందిన దంపతులకు కరోనా సోకింది.


మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ సతీమణి మృతి

వికారాబాద్‌లో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వి.సత్యనారాయణ సతీమణి (60) బుధవారం ఉదయం కరోనాతో మృతి చెందారు. సత్యనారాయణ దంపతులకు కరోనా సోకగా వారు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. సత్యనారాయణ మంగళవారం డిశ్చార్జి కాగా, ఆయన సతీమణి మృతి చెందారు.   


శామీర్‌పేటలో వ్యక్తి మృతి

శామీర్‌పేటలో నాలుగు రోజలు క్రితం కరోనా సోకిన వ్యక్తి (48) ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. అధికారులు నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.


ఆర్టీసీ డ్రైవర్‌కు కరోనా..

మేడ్చల్‌ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి(46) కరోనా వైరస్‌ సోకింది. మండలంలోని రాజబొల్లారంతాండాకు చెందిన ఈ వ్యక్తి శనివారం అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకోగా బుధవారం పాజిటివ్‌గా నిర్ధారణయింది. దీంతో మిగతా సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. మేడ్చల్‌లోని ఉమానగర్‌కు చెందిన మరో వ్యక్తికి వైరస్‌ సోకడంతో హోంక్వారంటైన్‌ చేశారు. 


శంషాబాద్‌ మున్సిపాలిటీలో ఐదు పాజిటివ్‌లు 

శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో బుధవారం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. యాదవ్‌బస్తీలో భార్యాభర్తలకు, కుమ్మరిబస్తీలో ఒకరికి, ఆర్బీనగర్‌లో ఒకరికి, హుడాకాలనీలో ఓ వ్యక్తికి వైరస్‌ సోకింది. మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 63 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-07-09T18:24:59+05:30 IST